మాయమైపోతున్న మంచినీరు
ప్రపంచం మీద డైబ్బై శాతం నీరే వుండి అందులో ఒక్క శాతం మాత్రమే మంచినీరుగా వుపయోగపడుతున్నపుడు దాన్ని ధ్వంసం చేసుకున్న జాతిని ఏమనాలి అసలు. మన కుంటలు, వాగులు, వంకలు, వర్రెలు, బావులు, చెరువులు, నదులు ఒక్కొక్కటిగా ఎట్లా ధ్వంసమైపోయాయి. జీవనదులు జీవం లేకుండా ఇసుక పర్రెలుగా ఎందుకు మిగిలిపోయాయి. వానాకాలంలో నీరు వరదలై పొంగుతుంటే కాపాడుకోవడానికి నగరంలో నిజాం కాలంలో హైదరాబాద్ నగరంలో 3000 పైగా వున్న చిన్న పెద్ద కుంటలు ఒక్కటి కూడా ఆచూకీ లేకుండా, అందులో అక్రమ నిర్మాణాలు ఎలా వెలిసాయి? పై నుంచి పడ్డ నీరు నిలిచ్చే చోటు దొరకక సముద్రం పాలవుతుంటే, వున్న కొద్ది భూగర్భ జలాలూ అడుగంటుతున్న దుస్థితి.
మనం చేసిన పాప ఫలితమే కదా ఇదంతా… లేకపోతే ఏమిటి…?
ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 780 మిలియన్ల ప్రజలు స్వచ్ఛమైన నీటికోసం అల్లాడిపోతున్నారు. ఆఫ్రికాలో ఓ తెగ ప్రజలు మంచినీళ్లు దొరకక, వేకువజామునే కిలోమీటర్ల కొద్దీ నడిచి అడవుల్లో ఆకుల మీద కారుతున్న మంచు బిందువులను ఒక్కొక్కటిగా సేకరించి మంచినీరుగా వాడుకుంటారట. ఒకనాడు నదులు పొంగిన జీవగడ్డ భారతావని కూడా ఇవాళ మంచినీటి చుక్క కోసం విలవిలలాడిపోతోంది. అటు చూస్తే ఏళ్ల తరబడి నీటి జాడ కనబడక అనంతపురం జిల్లా ఎడారి దారి పట్టింది. చిత్తూరు జిల్లాలో శిలాజాల లోపలకి వెయ్యి అడుగుల లోతున బోర్లు వేస్తే తప్ప నీటి చుక్క దొరికే అవకాశం లేదు. కృష్ణానది మైళ్లకు మైళ్లు ప్రవహిస్తున్నా పాలమూరు జిల్లా గొంతు తడవడం లేదు. ఫ్లోరిన్ నీళ్లు నల్లగొండకు నిద్ర పట్టనీయడం లేదు. పుష్కలంగా నీటి వనరులన్న ప్రాంతాలు రసాయన ఎరువులు, పురుగు విషాలతో విషతుల్యమైపోయాయి. అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాలుగు వందల అడుగులకు మించి నీళ్లు రకరకాల రసాయనాలతో విషపూరితమైనవి కాబట్టి వాటిని మంచినీటిగా ఉపయోగించకూడదని చెప్పింది. మరోప్రక్క కలుషితమైన నీటి వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఆరువేల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే, మనం రెండు గుక్కల నీళ్లు తాగి గ్లాసు కింద పెట్టే లోపు ఒక చిన్నారి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోతోంది.
అడవుల్ని కొట్టేసి, కొండల్ని పిండేసి, నదుల్ని ఎండేసి, గాలిని కాలుష్యంతో నింపేసి, తిండిని రసాయనాల్తో కలిపేసి, ఇంకా ఎన్ని దుర్మార్గాలు కళ్లముందే జరుగుతున్నా ఇప్పటి దాకా మౌనంగానే వున్నాం. ఆఖరికి తాగే నీళ్లలో కూడా ఇన్ని రసాయనాలు వున్నాయంటే చుక్క కూడా గొంతు దిగడం లేదు. అలాగని తాగకుండా వుండనూలేము, చిన్న చిన్న పిల్లలు తాగే పాలే కాదు, నీళ్లు కూడా విషమని తెలిసాక ఇక మాట్లాడకుండా ఎలా వుండగలం.
ఇందుకు మనమేం చేద్దాం…
- నీరు లేనప్పుడు ఇబ్బందులు పడడం కంటే అందుబాటులో వున్న చుక్కనీటిని కూడా వృధా చేయకపోవడం అవసరం. నగరాల్లో, పల్లెల్లో ఎక్కడిక్కడ ఇంకుడు గుంతలు, కందకాలు, చెక్‌డ్యామ్‌లు, వాటర్షెడ్లు నిర్మించుకోవాలి.
- వాన నీటిని ఒడిసి పట్టుకునే చాలా వరకు మంచినీటి కొరతను అధిగమించవచ్చు. సముద్రతీర ప్రాంతం కావడంతో ప్రకాశం జిల్లాలలోని ఉప్పు నీళ్ళు ఎక్కువగా వుంటాయి కాబట్టి అక్కడ చాలా ప్రాంతాల్లో సంప్రదాయికంగా వాననీటిని ఒడిసిపట్టి సంవత్సరమంతా మంచినీటిగా ఉపయోగిస్తారు. ఎడారి రాష్ట్రం రాజాస్థాన్‌లోని గ్రామాల్లో తరతరాలుగా వాననీటిని మంచినీటిగా వాడుకునే సంప్రదాయం వుంది.
- అతి తక్కువ వర్షపాతం పడే అనంతపురం ప్రాంతంలో కూడా (400-500 మి.మీ. వర్షపాతం) 200 చదరపు అడుగుల వైశాల్యంలో వుండే ప్రభుత్వ కట్టిచ్చిన ఇందిరమ్మ ఇంటి మీద 10000 లీటర్లు నీరు నిల్వ చేసుకోవచ్చు.
- ఈ నీటిని రోజుకు 20 లీటర్ల చొప్పున వాడినా ఒక కుటుంబానికి దాదాపు 500 రోజులకు సరిపోతుంది.
- మహారాష్ట్ర రాలెగావ్ సిద్దిలో అన్నాహజారే, రాజస్థాన్‌లో రాజేంద్రసింగ్ చేసిన నీటి సంరక్షణ ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ కోవలో ఎండిపోయిన బావుల్ని, వట్టిపోయిన చెరువుల్ని, జీవం వచ్చిన నదుల్ని తిరిగి బతికించుకునే ప్రయత్నం చేయాలి.
- వనసంరక్షణే జన సంరక్షణగా భావించాలి. పిల్లలకు పర్యావరణ పరిరక్షణ, అడవుల ఉపయోగాలపై అవగాహన కల్పించి చిన్నప్పటి నుంచి ప్రకృతిని వాళ్ల జీవితంలో భాగం చేయాలి.
- అడవులు, నదులు, వానలు, రుతుపవనాలు, కాలాలు ఇలా ప్రకృతిలో ఒకదానికొకదానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని అవగాహన చేసుకుని మనం వివేకంతో వ్యవహరించాలి.
నీరు లేకపోతే మనకు వర్తమానమూ లేదు, భవిష్యత్ అంతకన్నా లేదన్న నిజాన్ని మనమంతా నిర్భయంగా అంగీకరించాలి. నీటిని వ్యాపార వస్తువుగా మార్చిన సమస్త పరిస్థితులను వ్యతిరేకించాలి. ప్రతి నీటి చుక్కను గుండెలకు హత్తుకుని పదిలంగా కాపాడుకోవాలి. వాననీటి సంరక్షణ చేపట్టకపోతే భూగర్భజలాలను పెంచుకోకపోతే మానవజాతి ఈ భూమి మీద నుంచి నిష్క్రమించే రోజు మరెంతో దూరంగా లేదని గ్రహించాలి.