మండుతున్న పంజాబ్, హర్యానా పంటపొలాలు
పంజాబ్, హర్యానా పంటపొలాల్లో మళ్ళీ మంటలు ఎగిసి పడుతున్నాయి. ‘నాసా’ శాటిలైట్ చిత్రాలు వీటి విశ్వరూపాన్ని చూపిస్తున్నాయి. వరి కోతల తర్వాత, సెప్టెంబర్ చివరి వారం నుండీ అక్టోబర్ మధ్య వరకూ పొలాల్లో పంట మిగులు గడ్డిని తగలబెట్టి గోధుమ సాగుకు పంట పొలాలను సిద్ధం చేసుకునే ఈ ప్రక్రియ దశాబ్దాలుగా పర్యావరణ సమస్యలను సృష్టిస్తున్నది. కేవలం ఈ రెండు రాష్ట్రాలలోనే కాదు ఈ పొగ రాజధాని నగరం ఢిల్లీ గాలిని కూడా కాలుష్య భరితం చేస్తున్నది. ముఖ్యంగా పంజాబ్లోని అమృత్సర్, లూథియానా, పాటియాల జిల్లాలు, హర్యానాలోని కర్నల్ కురుక్షేత్ర, అంబాలా జిల్లాలు, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు ఈ ప్రకియలో ముందున్నాయి.
ఈ పొగ సృష్టించే మేఘాల కారణంగా, ఢిల్లీలో వాతావరణ కాలుష్యం మరింత పెరుగుతున్నది. 2019 నవంబర్ 4-19 వరకూ 15 రోజుల పాటు ట్రాఫిక్ పరమైన కొన్ని మార్గదర్శకాలను ఇప్పటికే జారీ చేసింది. గత సంవత్సరం పంజాబ్ ప్రభుత్వం, పంట మిగులును తగులబెట్టకుండా, రైతులకు, రైతు సహకార సంఘాలకు 13,000 యంత్రాలను సమకూర్చింది. దీని వల్ల ఇలా తగలబెట్టే ప్రక్రియ 9.5 శాతం తగ్గిందని, అక్కడి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రకటించారు. ఇప్పటికే అక్కడి ప్రభుత్వాలు ఇలా పంట మిగులును తగలబెట్టడాన్ని నిషేధించాయి. కానీ, రైతులు సమయాభావం, ఖర్చు కారణంగా, ఇంకా తగలబెడుతూనే వున్నారు. ఈ అలవాటు తెలుగు రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నది. ఇది, మొదిటి దశలోనే ఆపకపోతే రైతులు, ఇతర ప్రజలు పర్యావరణపరంగా భారీ మొత్తం చెల్లించాల్సి వుంటుంది.
Tag:పంటవ్యర్ధాలు