భూసార యాజమాన్యం
ప్రధానం పొలం తయారీ
విత్తనం వేయడానికి నారుమడిని సిద్ధం చేస్తు న్నప్పుడే, నారు నాటాల్సిన ప్రధాన పొలాన్ని తయారు చేయడం కూడా మొదలెట్టాలి. పొలాన్ని దున్నడం, చదును చేయడమే గాక, నేలను సారవంతం చేసే పనులు కూడా చేపట్టాలి. సేంద్రియ సేద్యం విధానంలో సులభంగా దొరికే దిబ్బ ఎరువు, వేపచెక్క వంటివి వేయాలి. వీటితో పాటు, అజోస్పైరిల్లమ్ వంటి జీవన ఎరువులు, అమృత జలం, జీవామృతం వంటి ద్రావణాలు ఉపయోగించి నేలలో సూక్ష్మజీవులను అభివృద్ధి చేసుకోవాలి.
వరి సాగు చేయడానికి ఎంచుకున్న భూమిని చదును చేసుకోవాలి. నీళ్ళు పెట్టినప్పుడు వరి మడి అంతా సమానంగా పారాలి. అదే విధంగా చేనులో ఎక్కువ నీరు ఉన్నప్పుడు వాటిని తీసేసే మార్గం అంటే మురుగు నీరు పోయే సౌకర్యం ఉండాలి. భూసారం పెంచడం కోసం సేంద్రియ పదార్థం వాడడం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలు అందుబాటులోకి తెస్తాయి.
భూసారాన్ని పెంచే కొన్ని సేంద్రియ పద్ధతులు
చెరువుమట్టి వేయడం :
ప్రతి మూడు సంవత్సరాలకోసారి ఎకరానికి 15-20 బండ్లు చెరువు మట్టిని తోలాలి. దీని వల్ల నేలకు తేమను పట్టిఉంచే శక్తి పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయి.
పెంటపోగు ఎరువు :
వరి సాగుకు పూర్తిగా కుళ్ళిన పెంటపోగు ఎరువు/ పశువుల పెండ తప్పనిసరిగా వేయాలి. ఎకరానికి కనీసం 15 బండ్లు లేదా 3 ట్రాక్టర్ల (6 టన్నులు) పశువుల ఎరువు సరిపోతుంది. ఎరువు బాగా నాణ్యమైనదిగా ఉండాలి. ఈ క్రమంలో ఇటీవల వానపాముల (జెర్రలు) ఎరువు తయారీ, వినియోగం కూడా ఎక్కువవుతోంది.
పచ్చిరొట్టపైరు :
పచ్చిరొట్ట పైరు భూమి సారాన్ని పెంచడానికి ఎంతగానో సహాయ పడుతుంది. పచ్చిరొట్ట పైరు సగం పూత దశలో ఉండగా దున్ని, నేలలో కలిపి మురగ పెడతారు. సాధారణంగా జీలుగ, జనుము వంటి పంటలను పచ్చిరొట్ట పైరుగా సాగు చేస్తారు. పచ్చిరొట్ట పైరు పెరగడానికి 45 రోజులు, అది మురగడానికి పది రోజులు పడుతుంది. పచ్చిరొట్ట పైరును దున్ని, నేలలో కలిపిన రోజు నారు మడి పోసుకుంటే పచ్చిరొట్ట పైరు కుళ్ళిపోయే సమయానికి నారుమడి నాటుకు తయార వుతుంది. పచ్చిరొట్ట పైరు సాగు చేయడానికి, మురగ బెట్టడానికి తగినంత నీటి వసతి, సమయం ఉండేట్లు చూసుకోవాలి. ఈ పద్ధతి చౌడు భూముల్లో వరి పండించి నప్పుడు మంచి ఫలితాన్నిస్తుంది.
పచ్చిఆకు ఎరువులు :
పచ్చిరొట్ట పంట వేసుకోవటం కుదరని పరిస్థితుల్లో దూరంగా ఉన్న చెట్ల ఆకులను, లేత కొమ్మలను తీసుకు వచ్చి పొలంలో కలుపుకోవచ్చు. ఇది పచ్చి ఆకుల ద్వారా నేలకు ఎరువులు అందించే పద్ధతి. పచ్చిఆకు ఎరువుగా ఉపయోగపడే మొక్కలు గ్లైరిసీడియా, కానుగ, మోతుక, సీతాఫలం, వెంపలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గట్ల మీద ఈ మొక్కలను నాటుకుంటే ప్రతీ పంట సీజన్లో ఎరువు అవసరాలు సులువుగా అందించవచ్చు.
పశు జీవాలు మంద కట్టడం :
ఇది సాంప్రదాయంగా పాటిస్తున్న పద్ధతే. పశువులు, గొర్రెలు, మేకలను మందులు, మందలుగా పొలాల్లో రాత్రిపూట విడిచిపెడతారు. వాటి మూత్రం, పేడ వల్ల నేల సారవంతమవుతుంది.
వేప చెక్క, గానుగ చెక్క
ఎరువువేసి, దున్ని, చదును చేయడంతో ఇక పొలం విత్తడానికి లేక నాట్లకు సంసిద్ధమవుతుంది. ఇందులో చివరి పనిగా నాట్లకు కొద్దిగా ముందు, దుక్కి ఎరువు, జీవన ఎరువులను కొద్దిగా ఉపయోగించవచ్చు. దిబ్బ ఎరువు, పచ్చిరొట్ట ఎరువుల మాదిరి కాకుండా వీటిని మొక్కలు తక్షణం తీసుకుంటాయి. నూనెగింజల నుంచి నూనె తీసేశాక మిగిలే గానుగ చెక్కలో సేంద్రియ నత్రజని సమృద్ధిగా ఉంటుంది. గానుగ చెక్క ఒక ఎరువుగా చాలా వేగంగా పనిచేస్తుంది.
వరిసాగులో చాలా ఎక్కువగా రెండు రకాల గానుగ చెక్కలను ఉపయోగిస్తారు. ఒకటి వేప చెక్క, రెండవది వేరుశెనగ చెక్క. ఈ రెండు గానుగ చెక్కలు నేల ఉత్పాదక శక్తిని పెంచడమే గాక, చీడ పురుగులను దూరం ఉంచడానికి కూడా ఉపయోగపడుతాయి. నూనె గింజల నుంచి నూనె తీసేశాక మిగిలే గానుగ చెక్క వరి పెరుగుదల ప్రారంభ దశలో అత్యవసరమైన పోషకాల్ని అందిస్తుంది. పునాది ఎరువుగా ఉపయోగిస్తున్నట్లయితే ఎకరాకు 60 కిలోల వేప చెక్క లేదా 40 కిలోల వేరుశెనగ చెక్క సరిపోతాయి. పై పాటు ఎరువుగానయితే, రెండింటిలో ఏదైనా ఒకటి…. ఎకరానికి 25 కిలోలు సరిపోతుంది. ఎరువులు వేయాల్సిన పంట దశలలో ఈ గానుగ చెక్కను పొలంలో చల్లాలి. గానుగ చెక్కలోని పోషకాలు మొక్కలు ఉపయోగించుకోవడానికి తగిన రూపంలో సిద్ధంగా ఉంటాయి. మొక్కలు వాటిని వెంటనే తీసుకుంటాయి.
జీవన ఎరువులు
సేంద్రియ ఎరువులు వాడడం వల్ల తయారయ్యే సేంద్రియ పదార్థం భూమిలో సూక్ష్మ జీవుల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఈ సూక్ష్మ జీవులు నిరంతరం సేంద్రియ పదార్థాన్ని విడగొట్టి, అందులోని పోషకాన్ని మొక్కలు తీసుకోడానికి వీలుగా మార్చి అందిస్తుంటాయి. సేంద్రియ పదార్థంలో బందీ అయి ఉండే పోషకాలు, విడుదలై మొక్కలకు అందాలంటే ఈ సూక్ష్మజీవులు తప్పనిసరిగా అవసరం. నేలలో సూక్ష్మజీవుల సంఖ్యను కృత్రిమంగా అభివృద్ధి చేయాలంటే అజోస్పైరిల్లమ్, ఫాస్పో బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ నాచువంటి సూక్ష్మజీవులను నేలలో చేర్చాల్సి ఉంటుంది. ఈ ఎరువులు అంగళ్ళలో దొరుకుతాయి. వీటిని తగిన మోతాదులలో పొలానికి చేర్చడం వల్ల నేలలో ఆయా సూక్ష్మ జీవుల సంఖ్యను పెంచగలుగుతాం.