భూసారాన్ని, తేమను మెరుగు పరిచేదెలా?
భూసారాన్ని మరియు తేమను నేలలో వృద్ధిచేసుకోవటానికి ఒకే విధమయిన పద్ధతులు ఉన్నాయి. అయితే వీటన్నిటికి సమాన ప్రాముఖ్యతను ఇచ్చి పాటించాలి. ఈ పద్ధతుల సహజత్వాన్ని ఆటంకపరిచే, నష్టపరిచే రసాయన ఎరువులను దూరం చెయ్యాలి.
- పంట ఎన్నిక
- పచ్చిరొట్ట ఎరువులు
- పచ్చిఆకు ఎరువులు
- సేంద్రియ ఎరువులు
- వానపాముల ఎరువు
- జీవన ఎరువులు
- మల్చింగ్ పద్ధతి
పంటల ఎన్నిక:
పంటల ఎన్నిక కేవలం మార్కెట్లో ఉన్న మంచి ధరను ఆధారం చేసుకొని మంచి దిగుబడుల కోసం అధిక పెట్టుబడులు వాడే దిశలో కాకుండా మన భూసారం, తేమ మరియు వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోవాలి.
తేమ, నీటి తడులను బట్టి : నేలలో తేమను బట్టి, నీటి తడులకు మనవద్ద ఉన్న నీటిని బట్టి ఎన్ని నెలలు పంటకు అందివ్వగలమో తెలుసుకొని పంటను ఎన్నుకోవాలి. అలాంటి పంటలకు ఉండే ”తేమ కొరకు కీలక దశల”పై అవగాహన ఉండాలి.
నేల లోతును బట్టి : కొన్ని పంటలవేర్లు చాలా లోతుకు వెళ్ళి తేమను పీల్చుకుంటాయి. నేలలోపలి పొర గట్టిపొర అయితే వేర్లను పెరగనివ్వవు. అటువంటి పరిస్థితుల్లో పైపైన వేర్లు ఉండే పంటలు వేసుకోవాలి.
పురుగులు తెగుళ్ళ సమస్యలు : పురుగులు తెగుళ్ళ సమస్యలు అధికమవటానికి పంటల విధానం ప్రధాన కారణం కూడా. ఈ సమస్యల ఉధృతి పెరగకుండా నియంత్రించే మొక్కలు ఎన్నుకోవాలి.
పంట మార్పిడి :
- ఎక్కువ పోషకాలను పీల్చుకునే మొక్కలతో తక్కువ పోషకాలను పీల్చుకునే వాటితో మార్పిడి చేసుకోవాలి.
- పప్పుజాతి మొక్కలను ఇతర పంటలతో మార్పిడి చేసుకోవాలి.
- లోతైన వేరు వ్యవస్థగల మొక్కలను పైపైన ఉండే వేరు వ్యవస్థగల మొక్కలతో మార్పిడి చేసుకోవాలి.
- పురుగుల, తెగుళ్ళ సమస్యలలో చిక్కుకునే పంటలను వాటిని తట్టుకునే పంటలతో మార్పిడి చేసుకోవాలి.
Tag:తేమను మెరుగు