బోగన్ విల్లియా
బోగన్ విల్లియా
ఇది ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాలలో సహజ సిద్ధంగా పెరుగుతుంది. వుద్యానవనాలలో, పార్కులలో, కాలేజీల ఆవరణలో మరియు ఇండ్ల దగ్గరా పెంచబడుతుంది.
ఈ మొక్క ఆకులను (పత్రాలు) వ్యవసాయంలో సస్యరక్షణ కోసం వుపయోగించవచ్చు. వీటిని వైద్య పరంగా కూడా ముఖ్యంగా దగ్గు నివారణ మందులలో ఆదివాసీలు ఉపయోగిస్తారు.
ఈ మొక్కలో బీటాసైనిక్, పింటాల్, ఫ్లావనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, గ్లౖేకోసైడ్స్ వంటి అనేక రసాయన పదార్థాలుంటాయి. ఆకులలో ఉన్న రసాయనాలు విత్తన నిల్వలో ఆశించే కీటకాలకు క్రిమిసంహారకంగానూ మరియు వికర్షణిగానూ పనిచేస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. (డా|| తూబాహుక్)
బోగన్ విల్లియా ఆకుల ద్రావణానికి (కషాయం) పెసర పంటను ఆశించే ఆకుమచ్చ తెగులును అదుపు చేసే లక్షణాలు వున్నాయని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం – (కోయంబత్తూర్) పరిశోధనలలో తేలింది.
పంటల నాశించే బూజు తెగుళ్ళ (ఫంగస్) నివారణలో బోగన్ విల్లియా ఆకులను ఉపయోగించి ద్రావణం తయారు చేయవచ్చు.
తయారు చేసే విధానం:
కలబంద ఆకులు (అలోవీరా) కిలో, బోగన్ విల్లియా ఆకులు కిలో, బొప్పాయి ఆకులు కిలో, పసుపు పొడి 200 గ్రాములు
పైన సూచించిన ఆకులను పై మోతాదులో తీసుకొని బాగా మెత్తగా నూరి, 10 లీటర్ల నీరు పోసిన కుండలో వేసి, దానికి 200 గ్రాముల పసుపు పొడిని కలిపి పొయ్యిపై పెట్టి, సన్నని సెగపై ఉడకబెట్టాలి. ద్రావణం నాలుగయిదు పొంగులు వచ్చే వరకూ బాగా కర్రతో త్రిప్పుతూ ఉడక బెట్టాలి. తర్వాత ద్రావణాన్ని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా తయారైన ద్రావణాన్ని వడగట్టి ఒక డ్రమ్ములో పోయాలి. దీనికి 100 లీటర్ల నీరు కలిపి పంటపై సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. ఈ ద్రావణం ఒక ఎకరా పంటకు సరిపోతుంది.
Tag:బోగన్ విల్లియా