ప్రభుత్వాలు పూనుకుంటే రైతులకు మద్ధతు ధరలు అందవా…? – కె. రవి
రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య-పంటల ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా రైతులకు ధరలు లభించకపోవడం. చాలా సందర్భాలలో కనీస మద్దతు ధరలు కూడా రైతులకు అందడం లేదు, గ్రామాలలో నేరుగా రైతుల నుండి వ్యాపారులు పంటలను సేకరణ చేస్తున్న సందర్భంలోనే కాకుండా, ప్రభుత్వ మార్కెట్‌యార్డులకు పంటను తెచ్చినప్పుడు కూడా సరైన నాణ్యత, తేమ శాతం వుండి కూడా వ్యాపారులు, రైతులకు కనీస మద్ధతుధర చెల్లించడం లేదు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట చర్యలు నిజాయితీగా చేపడితే ఈ సమస్యను ఒక మేరకు పరిష్కరించవచ్చు.
- రాష్ట్రాలలో వ్యవసాయ వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, భూముల స్వభావానికి అనుగుణంగా పంటలను పండించేలా విస్తరణ వ్యవస్థను బలోపేతం చేయాలి. దీనిపై నిరంతరం రైతులలో ప్రచారం చేయాలి. పంటల మార్పు సందర్భంలో ఎదురయ్యే సమస్యలను వెంట వెంటనే పరిష్కరించాలి. పంటల మార్పు కోసం అవసరమైన అన్ని రకాల మద్దతు వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.
- వ్యవసాయరంగంలో పంటల ఉత్పత్తి ఎంత ప్రాధాన్యత కలిగిన అంశమో, ఆయా పంటల నమోదు, పంటల మార్కెటింగ్ (సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్, బల్క్ మరియు రిటైల్ మార్కెటింగ్) రైతులకు కనీస మద్దతు ధరలు అందడం అంతే ప్రాధాన్యత కలిగిన అంశం .వీటిపై దృష్టి సారించాలి.
- రాష్ట్రంలో పంటల ఉత్పత్తి ఖర్చులను తగ్గించాలి. అందుకు అనుగుణంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో వుత్పత్తి ఖర్చులను తగ్గించలేని పరిస్థితులలో, ఆయా పంటలకు కేంద్రం ప్రకటించే మద్దతు ధరలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించి, రాష్ట్ర బడ్జెట్ నిధుల నుండి లేదా కేంద్రం ప్రకటించిన పంటల మద్దతుధరల పథకం ద్వారా నేరుగా రైతులకు ఆ మొత్తాన్ని చెల్లించాలి.
- ప్రభుత్వ పంటల సేకరణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, మొత్తం వ్యవసాయ పంటల సేకరణలో ఉన్న ప్రైవేట్ వ్యాపారులను రిజిస్టర్ చేయాలి. వారి మార్కెటింగ్ లావాదేవీలను పర్యవేక్షించాలి. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ (తెలంగాణా) రైతు సాధికార సంస్థ (ఆంధ్రప్రదేశ్) భాగస్వామ్యంతో వివిధ ప్రభుత్వరంగ, సహకార రంగ సంస్థలను, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను, గ్రామీణ స్వయం సహాయక మహిళా సంఘాలను పంటల సేకరణలో భాగస్వాములను చేయాలి.
- మొత్తం పంటల సేకరణ వ్యవస్థ పారదర్శకంగా వుండేలా డిజిటల్ పద్దతిలోనే మొత్తం లావాదేవీలను నిర్వహించాలి.
- ఏ దశలో లోపాలు, తప్పులు, అవకతవకలు కనపడినా ఆయా స్థాయి ప్రభుత్వ అధికారులను నేరుగా బాధ్యులను చేయాలి. తప్పుల స్థాయిని బట్టి కఠిన శిక్షలు అమలు చేయాలి.
ఈ ప్రక్రియ నిర్వహించడానికి తొలి దశ నుండీ అన్ని విషయాలలోనూ సమగ్ర సమాచారం అవసరముంటుంది. ఈ సమాచారం కూడా సమయానుగుణంగా నిర్దిష్ట కాలపరిమితిలో సేకరించవలసి వుంటుంది. ఆ సమాచారం అవసరమైన అన్ని ప్రభుత్వరంగ ఏజెన్సీలకు అందుబాటులో వుంచవలసి ఉంటుంది.
గ్రామస్థాయిలో సమాచార సేకరణకు గ్రామ పంచాయితీ కార్యదర్శి కన్వీనర్‌గా, గ్రామ రెవెన్యు అధికారి (వి.ఆర్.ఓ.), గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వి.ఆర్.ఎ.), బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ (బి.ఓ.), వ్యవసాయ విస్తరణ అధికారి (ఎ.ఇ.ఓ.) – మెంబర్ సెక్రటరీగా ఒక కమిటీ పని చేయాలి.
ఈ కమిటీ గ్రామ పంచాయితీ పరిధిలో భూమి సర్వే నంబర్ల వారీగా పంట సాగు వివరాలను ప్రతి సీజన్లో నమోదు చేయవలసి ఉంటుంది. ఈ వివరాల నమోదుకు తగిన ఎక్విప్మెంట్ ఈ టీంకు అందచేయాలి.
ఈ టీం సేకరించిన వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి. ఒక సారి ఎంటర్ చేసిన వివరాలను మార్చేందుకు వీలు లేకుండా కట్టడి చేయాలి.
సర్వే నంబర్ల వారీగా కౌలు రైతులతో సహా వాస్తవ సాగుదారులను గుర్తించే బాధ్యత కూడా ఈ గ్రామ స్థాయి కమిటీదే. ఈ సందర్భంగా రాజకీయ నాయకుల, భూయజమానుల ఒత్తిడికి లొంగి వాస్తవ సాగుదారుల వివరాలను తప్పుగా నమోదు చేస్తే, కమిటీ సభ్యులపై చర్యలు చేపట్టాలి.
మండల స్థాయిలో ఏర్పడే కమిటీకి మండల రెవెన్యూ అధికారి కన్వీనర్‌గా, డిప్యూటీ తహసీల్ధార్, ఎంపీడీఓ, స్థానిక ప్రభుత్వ బ్యాంకు మేనేజర్ సభ్యులుగా, వ్యవసాయ అధికారి (ఎ.ఓ) మెంబర్ సెక్రటరీగా వ్యవహరించాలి. గ్రామస్థాయి కమిటీలు ఇచ్చే నివేదికలను పరిశీలించి ఈ మండల స్థాయి కమిటీ వాస్తవ సాగుదారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
ఈ కమిటీలు అందించే సర్వే నంబర్ల వారీ వాస్తవ సాగుదారుల నివేదిక ప్రభుత్వం అందించే ప్రతి వ్యవసాయ మద్ధతు వ్యవస్థకూ ప్రాతిపదికగా ఉండాలి. (రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధకశాఖల సబ్సిడీ పథకాలకు) బ్యాంకులు ఇచ్చే పంట రుణాలకు కూడా ఈ నివేదికలు ప్రామాణికం కావాలి. బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వాస్తవ సాగుదారులకు పంట రుణాలు ఇవ్వాలి. ప్రభుత్వం రుణ మాఫీ లాంటి పథకాన్ని కూడా ఈ నివేదికల ఆధారంగా వాస్తవ సాగుదారులకే అమలు చేయాలి. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద వ్యవసాయ అభివృద్ధి పథకాలకు కూడా ఈ నివేదికలు ప్రామాణికం కావాలి.
ప్రస్తుతం వేస్తున్న పంటలకు, తీసుకుంటున్నపంట రుణాలకు, బీమా చేస్తున్న పంటలకు ఏమీ పొంతన వుండడం లేదు. దాని వల్ల ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపధ్యంలో దీనిని సరిదిద్దడానికి పంటల బీమా పథకాలకు కూడా అధికారుల కమిటీలు ఇచ్చే ఈ వాస్తవ సాగుదారుల నివేదికలు ప్రామాణికం కావాలి.
ఒక ప్రత్యేక సీజన్‌కు సంబంధించి వాస్తవ సాగుదారుల వివరాలు, పంటల సాగు వివరాలు సమగ్రంగా ఉంటే, పంటల దిగుబడుల విషయంలో ఒక స్పష్టత వస్తుంది. పంటల వారీగా సాగు విస్తీర్ణం, సగటు దిగుబడుల ఆధారంగా మొత్తం పంటల ఉత్పత్తి పరిమాణం తేలుతుంది. కుటుంబ అవసరాలు పోను, ఆయా పంటల వారీగా మార్కెట్ అమ్మకానికి ఎంత పంట వస్తుంది అనేది కూడా తేలుతుంది.