పేరింటకూర
పేరింటకూర
పేరింటకూర సుమారు 1-2 మీటర్లు ఎత్తు పెరిగే ఏకవార్షిక మొక్క. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు దీర్ఘ కటకాకారంతో ఉండి దంతం వంటి అంచులు కలిగి వుంటాయి. మొక్క అంతటా నూగు వుంటుంది. పుష్పాలు చిన్నవి, లేత పసుపు రంగులో వుంటాయి. ఫలం గుళిక. నిలువుగా బ్రద్ధలవుతుంది. ఫలంలో గుండ్రని విత్తనాలు చాలా వుంటాయి. ఈ మొక్క ఎక్కువగా వర్షాకాలంలో పంట పొలాలలో లుపు మొక్కగా, నల్ల రేగడి నేలల్లో పెరుగుతుంది. ఈ మొక్క నుండి జనపరార లభిస్తుంది. ఈ మొక్కను వైద్యపరంగా వుపయోగిస్తారు.
ఈ మొక్కల్లో గ్లైకోసైడ్సు, ట్రైటెరిపిన్స్, ఐయోనోస్స్, ఫినాల్స్, స్టిరాల్స్, కానారిజెనిన్ వంటి అనేక రసాయన పదార్థాలుంటాయి.
పత్రాల కషాయాన్ని పాలతో తీసుకుంటే జ్వరాలు రాకుండా నివారించుకోవచ్చు. పత్రాల రసాన్ని చర్మంపై పూస్తే గాయాలు తగ్గుతాయి. నొప్పులను తగ్గిస్తుంది. పత్రాల రసం చర్మవ్యాధుల నివారణలో వుపయోగ పడతాయి. పేరింటకూర మొక్కలో వున్న రసాయనాలు చాలా శక్తివంతమైనవి. ఈ రసాయనాలు కీటకాలకు, ”కీటకనాశని” – బయోపెస్టిసైడ్గా పని చేస్తాయి. కూరగాయ పంటల నాశించే పురుగులపై పనిచేస్తాయని రైతుల అనుభవం. (డా|| ఒకున్లోలా, నైజీరియా – 2010)
ఈ మొక్క ఆకుల కషాయాన్ని తీగజాతి కూరగాయ పంటలను (సొర, బీర, పొట్ల, దోస, గుమ్మడి, బూడిద గుమ్మడి మొదలైనవి) ఆశించే ”పెంకుపురుగు” నివారణలో వుపయోగించవచ్చని డా|| అబ్దుల్ కలామ్ అజాద్ 2013 పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఈ మొక్క కషాయానికి ఎర్రనల్లి (రెడ్ మైట్స్)ని నివారించే శక్తి వున్నదని పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
Tag:పేరింటకూర