పశువుల పేడ, మూత్రం ద్రావణం – సుస్థిర వ్యవసాయ కేంద్రం
పశువుల పేడ, మూత్రం ద్రావణం మొక్కలకు తక్షణ శక్తి ఇస్తుంది. కాబట్టి వర్షాభావ పరిస్థితులలో తెగుళ్లు / పురుగుల సమస్య నుంచి తేరుకుంటున్నప్పుడు దీనిని వాడుకోవచ్చు. పశువుల పేడ, పశువుల మూత్రంలో చాలా రకాల పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవులున్నాయి. ఇవి పంటకు హానిచేసే తెగుళ్ళను నివారించడంలో ఉపయోగ పడతాయి. ఈ ద్రావణంలో ఉన్న పోషకాల (నత్రజని, భాస్వరం, పొటాష్ మరియు సూక్ష్మ పోషకాలు) వల్ల పంటలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ఈ ద్రావణాన్ని పంటకాలంలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
పశువుల పేడ 5 కిలోలు
పశువుల మూత్రం 5 లీటర్లు
సున్నం 150 గ్రా||
తయారు చేసే విధానం:
- 5 కిలోల పశువుల పేడ, 5 లీటర్ల మూత్రం తీసుకుని, 5 లీటర్ల నీటిని కలిపి ఒక తొట్టిలో నిలువ చేయాలి.
- తొట్టిపై మూత పెట్టి, 4 రోజులపాటు ఆ మిశ్రమాన్ని మురగబెట్టాలి.
- పై మిశ్రమాన్ని ప్రతిరోజు కర్రతో, సవ్య మరియు అపసవ్య దిశలలో బాగా కలియపెట్టాలి.
- ఈ మిశ్రమానికి 4 రోజుల తర్వాత కొద్దిగా నీరు చేర్చి, వడపోసి, 150 గ్రాముల సున్నం కలపాలి.
- ఈ ద్రావణానికి 100 లీటర్ల నీటిని కలిపి ఒక ఎకరం పొలంలో ఒక సారి పిచికారీ చేయాలి.
జాగ్రత్తలు:
- పశువుల పేడ, మూత్రం ద్రావణం చిక్కగా ఉంటుంది. అందువల్ల వడపోయటానికి మొదట ఒక మెష్నుగానీ, పలుచటి గోనెసంచిని గానీ ఉపయోగించాలి.
- తర్వాత దానికి నీరు కలిపి పలుచటిగుడ్డతో వడపోసుకోవాలి.
- తయారు చేసిన ద్రావణాన్ని వెంటనే ఉపయోగించుకోవాలి.
- ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే ద్రావణం చెడిపోయే అవకాశం ఉంది.
- పంటలలో తెగుళ్ళ సమస్య వుంటే పశువుల పేడ, మూత్రం ద్రావణానికి ఇంగువ కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఉపయోగాలు:
- ఈ ద్రావణాన్ని పిచికారీ చేస్తే దాని ఘాటైన వాసనకు రెక్కల పురుగులు పంటపై గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు.
- ఈ ద్రావణాన్ని పంటలలో పిచికారీ చేయటం వల్ల పంటలు బెట్టను సుమారు వారం రోజులవరకూ తట్టుకుంటాయి.(రైతుల అనుభవం)
- ఈ ద్రావణం పంటలలో వ్యాధినిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.
- ఈ ద్రావణాన్ని బాగా వడపోసి ”డ్రిప్” లేదా ”స్ప్రింక్లర్” పద్దతి ద్వారా పంటలకు అందజేయవచ్చు.
Tag:పశువుల పేడ, మూత్రం