పశువుల అమ్మకాలపై నిషేధం/ నియంత్రణ వ్యవసాయానికీ, రైతులకూ, మహిళలకూ నష్టదాయకం
పశువుల అమ్మకాలపై నిషేధం/ నియంత్రణ వ్యవసాయానికీ, రైతులకూ, మహిళలకూ నష్టదాయకం
ఆశాలత, రైతు స్వరాజ్య వేదిక, మహిళా రైతు హక్కుల వేదిక
పశువులను వధ నిమిత్తం అమ్మటాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘‘ప్రివెన్షన్ అఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ (రెగ్యులేషన్ అఫ్ లైవ్‌స్టాక్ మార్కెట్స్) రూల్స్ 2017’’ పేరిట కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఆవులు, ఎడ్లు, గేదెలు, కోడె దూడలు, పెయ్యదూడలు, ఒంటె అమ్మకాలపై ఆంక్షులు విధించారు. దీని వల్ల వ్యవసాయానికీ, పశువుల యజమానులైన రైతులకూ, పాడి పశువులను పెంచుకునే మహిళా రైతులకూ తీవ్ర నష్టం జరుగుతుంది.
మన దేశంలో పశువుల పెంపకం వ్యవసాయానికి అనుబంధంగా సాగుతుంది. సాధారణంగా చిన్న, సన్నకారు రైతులు, పేద రైతులకు రోజుకూలీతో పాటు పశువుల పెంపకం ముఖ్యమైన జీవనాధారం. 2013 నాటి 70వ విడత ఎన్.ఎస్.ఎస్. గణాంకాల ప్రకారం చిన్న, సన్నకారు రైతులు సగటు నెలవారీ ఆదాయంలో 12 శాతం పశువుల పెంపకం నుండి వస్తున్నదని తొస్తున్నది. గతంలో కంటే ఇటీవలి సంవత్సరాలలో పశువుల పెంపకం ప్రాముఖ్యత పెరిగినట్లు కూడా తెలుస్తున్నది.
వ్యవసాయ కుటుంబాలు కొన్ని సంవత్సరాల కొకసారి వాటిని అమ్మి, కొత్తవి కొనటం కూడా సాధారణంగా జరుగుతూ వుంటుంది. రైతులు కరువు సమయంలో పశువులను పోషించలేక, ఆర్ధిక స్థితి దుర్భంగా వుండి అవసరాల కోసం పశువులను అమ్ముకుని మళ్ళీ వ్యవసాయానికి అవసరం వున్నప్పుడు తిరిగి కొనుగోలు చేస్తూ వుంటారు. వ్యవసాయ సీజను ఆరంభంలో సంస్థాగత రుణాలు అందని రైతు పశువులను అమ్ముకుని ఆ డబ్బుని వ్యవసాయంలో పెట్టుబడిగా పెట్టటం కూడా జరుగుతున్నది. రైతులు సాధారణంగా పశువుల అమ్మకాలు, కొనుగోళ్ళు స్థానిక మార్కెట్లలో చేస్తుంటారు.
ఇప్పుడు పశువుల అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ తీసుకొచ్చిన నోటిఫికేషన్ ప్రకారం పశువులను అమ్మానుకునే రైతులు తాము వాటిని వధించటానికి అమ్మటం లేదని అధికారులు ధ్రువ పరచిన పత్రాలను జతచేయవలసి వుంటుంది. వాటిని కొనుగోలు చేసేవారు తాము వ్యవసాయం కోసమే కొంటున్నామని హామీ పత్రం ఇవ్వవలసి వుంటుంది, అంతే కాదు 6 నెలల వరకు వాటిని తమ వద్దనే వుంచుకోవాలి, 6 నెలలోపు అమ్మకూడదు.
చిన్, సన్నకారు పేద రైతులు పశువులను అమ్మటానికీ, కొనటానికీ అనేక ధృవీకరణ పత్రాలను, హామీ పత్రాలను, గుర్తింపు కార్డులను, అధికారులు సంతకాలను చూపించాల్సి రావటం వల్ల రైతు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. పశువులును అమ్మకూడదు అనే ఆంక్షలు గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీస్తాయి.
పైకి పశువు పట్ల క్రూరత్వాన్ని నివారించటం దీని ఉద్దేశ్యం అని చెబుతున్నప్పటికీ ‘‘ఆవు పవిత్రమైనది, అవును పూజించాలే కానీ వధించి గొడ్డు మాంసం తినకూడదనే’’ మతపరమైన దృష్టికోణం నుండి మాత్రమే ఈ నియంత్రణ విధించటం జరుగుతున్నది. కొన్ని శతాబ్దాుగా ప్రభుత్వాు అనుసరిస్తున్న తప్పుడు విధానా వ్లనే మన దేశంలో స్థానిక పశుల జాతుల సంఖ్య తగ్గిపోవటానికి దారి తీసింది. (మేత భూములు తగ్గిపోవటము,
వేసవిలో మేత నీరు కొరతగా వుండటము, అధిక పాల దిగుబడి కోసమంటూ విదేశీ పశుల జాతులను పెద్ద సంఖ్యలో ప్రవేశపెట్టటము, వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల పశువుల అవసరం తగ్గిపోవటము వంటివి.)
నిజానికి రైతులు పశువులను అత్యంత ప్రేమతో పోషించి తమ కుటుంబంలో భాగంగా కాపాడుకుంటారు. కానీ చిన్న, సన్నకారు రైతులు ప్రస్తుత దుర్భమైన ఆర్ధిక పరిస్థితిలో వాటిని తప్పని పరిస్థితిలో అమ్మవలసి వస్తున్నది. సాధారణంగా చాలా కాలం పని చేసి, ఇక వ్యవసాయానికి పనికి రాని పశువులను, వయసు మళ్ళిన, జబ్బుపడ్డ పశువులను రైతులు పోషించలేక అమ్ముతుంటారు, వ్యాపారస్తులు వాటిని కబేళాలకు తరలిస్తుంటారు. రైతులు తిరిగి తమ వద్ద నున్న ఆవుల సంతతి నుండి కొత్తగా ఎడ్ల జతలు తయారు చేస్తారు లేక మార్కెట్లో కొనుగోలు చేస్తారు.
ఇప్పుడు అమ్మకాల పై ఇంతటి తీవ్రమైన ఆంక్షలు విధిస్తే వాటిని కబేళాలకు తరలించే వ్యాపారులు కొనటానికి ముందుకు రాక రైతులకు అమ్ముకునే అవకాశం వుండదు. ఒక అంచనా ప్రకారం ఒక ఆవులనో, గేదెలనో పోషించటానికి సంవత్సరానికి దాదాపు 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ పశువులు వ్యవసాయానికో, మరొక రకంగానో పనికి వచ్చే ఉత్పత్తిని ఇవ్వనప్పుడు ఆ పశువులను మేపాంటే రైతులకు తలకు మించిన భారం అవుతుంది.
చాలా మంది పేద కుటుంబాల మహిళలు వ్యవసాయానికి అనుబంధంగా పాడి పశువులను పెంచుకుని పాల అమ్మకం ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని పొందుతున్నారు. వారికేదైనా కష్టం వస్తే పాడిపశువులను అమ్మి ఆ తర్వాత డబ్బు వున్నప్పుడు తిరిగి కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు ఈ కొత్త నియంత్రణ వల్ల మార్కెట్లో పశువులను కొనాలన్నా, అమ్మాలన్నా అనేక ఆంక్షలు వుండటం వల్ల మహిళలు, మహిళా రైతులు కూడా నష్టపోతారు.
‘గో రక్షకుల’ చేతిలో ఇప్పటికే అనేక మంది దళితులు, ముస్లిలు దాడులకు గురవుతున్న నేపధ్యంలో ఇప్పుడు ఈ నియంత్రణా ఆదేశాల కారణంగా పశువులను అమ్మటానికి వెళ్ళే రైతులు కూడా వారి దాడులకు బలయ్యే ప్రమాదం వుంది.
పశువులను కాపాడటానికి ప్రభుత్వం వాటి పోషణకు అనుకూలమైన పరిస్థితులు, సదుపాయాలు కల్పించాలి, స్థానిక పశుజాతులను ప్రోత్సహించే విధానాలు తీసుకురావాలి. వ్యవసాయంలో వాటి సాంప్రదాయ పాత్రను పునరుదరించాలి. అంతేకానీ వాటి అమ్మకాలపై ఆంక్షలను, నిషేధాలను విధించటం కాదు.