పంటకాలంలో ఎలుకల నివారణకు కొన్ని సులువైన పద్ధతులు – సుస్థిర వ్యవసాయ కేంద్రం
పచ్చి బొప్పాయి కాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి పొలం గట్లపై చల్లాలి. ఎకరానికి నాలుగు పచ్చి బొప్పాయి కాయలు సరిపోతాయి. వీటిలోని ఒక రసాయనం ఎలుక నోటి కండరాలకు హాని కలిగిస్తుంది.
ఎలుక వికర్షకాలైన జిల్లేడు, పసుపు, ఆముదం మొక్కలను పొలం గట్లపై నాటితే వాటి బాధ నివారణ అవుతుంది.
పొలం గట్లపై ఇంగ్లీషు తుమ్మ లేదా స్క్రూ పైన్ వంటి ముళ్ళ కంపను పరిస్తే వాటిపై సంచరించిన ఎలుకల ఉదర భాగాలు చీరుకుపోతాయి. అవి వాటికి సంచార నిరోధకంగా ఉపయోగపడతాయి.
సిమెంట్‌ను, మైదా పిండిని సమభాగాల్లో కలిపి పొట్లాలు కట్టి కలుగుల వద్ద ఉంచితే అవి తిన్న ఎలుకల నోటి భాగాలు పిడచగట్టుకపోయి నశిస్తాయి.
కొబ్బరి లేదా తాటి గెలల జవటలను పాము ఆకారంలో మలిచి గట్లపై అమరిస్తే ఎలుకల బాధ నివారణ అవుతుంది.
తూటాకు కాడలు రెండు మూడు కిలోలు సేకరించి మూడు లీటర్ల నీటిలో 30 నిమిషాలు మరిగించి వడపోయాలి. ఆ ద్రావణంలో రెండు మూడు కిలోల జొన్నలు కలిపి మరో 30 నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ జొన్న విత్తనాలను ఎలుకల బొరియల్లో వేయాలి. జొన్న గింజలను తిన్న ఎలుకలు మరణిస్తాయి.
ఎండు మిర్చిని కలుగుల్లో వేసి అగ్గిపుల్ల వెలిగించి మూసి ఊదరబెట్టాలి.
మట్టికుండను ఎండుగడ్డితో నింపి నీరు చిలకరించాలి. కుండ అడుగు భాగాన రంధ్రం చేసి కలుగుపై కుండను బోర్లించి పై రంధ్రం ద్వారా కుండలోని గడ్డిని నిప్పుతో రగిలించాలి. సదరు రంధ్రాన్ని తడి మట్టితో కప్పి కుండనుంచి పొగ బయటకు పోకుండా ఎలుక బొరియల్లోకి పోయేలా ఊదరబెట్టాలి. కుండనుంచి వచ్చే పొగ బొరియ అంతటా వ్యాపించి ఎలుకలకు ఊపిరాడకుండా చేస్తుంది. అత్యవసరమార్గం ద్వారా బొరియ నుంచి ఎలుక బయటకు వచ్చి గిల గిలా కొట్టుకొని చనిపోవడం ఒక్కోసారి జరుగుతుంది.
Tag:ఎలుకల నివారణ