నానబాలు
నానబాలు
దీనిని హిందీలో ‘ధూది’ అని కూడా అంటారు. ఇంచుమించు 60 సెంటీమీటర్ల వరకు నేలపై పాకుతూ పెరిగే మొక్క. గిచ్చితే పాలు వస్తాయి. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. మొక్క అంతటా నూగుతో కప్పబడి ఉంటుంది. పత్రాలు 2 సెంటీ మీటర్ల పొడవుండి దాదాపు దీర్ఘ అండాకారంలో ఉంటాయి. పుష్పాలు గుత్తులుగా ఏర్పడతాయి. ఫలము గుళిక. విత్తనాలు లేత ఎరుపురంగులో ఉంటాయి. ఈ మొక్కలకు పుష్పాలు, ఫలాలు సంవత్సరం పొడవునా ఏర్పడతాయి. ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ అంతటా కలుపు మొక్కగా పెరుగుతుంది.
నానబాలు మొక్క ఆకులలో వున్న రసాయనాలు చాలా శక్తివంతమైనవి. అందువలన ఈ మొక్కను సస్యరక్షణలో ”పంచపత్ర కషాయం” (వివిధ ఆకుల ద్రావణం)లో వుపయోగించి పంటల నాశించే రసం పీల్చే పురుగుల పైన మరియు ఆకులకు నష్టం కలిగించే గొంగళి పురుగుల లార్వాల పైన వుపయోగించి, వాటిని సమర్ధవంతంగా అరికట్టవచ్చని రైతుల అనుభవం.
నానబాలు ఆకుల కషాయానికి అపరాల నిల్వలో (కంది) వచ్చే పుచ్చు పురుగులను నివారించే గుణం వుందని డా|| దివాన్ మరియు డా|| సక్సేనా (2010, ఉత్తర ప్రదేశ్) పరిశోధనలు నిరూపిస్తున్నాయి. మొక్కలో వున్న రసాయనాలు కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా మరియు క్రిమిసంహారకంగా కూడా పనిచేస్తాయని, డైమండ్ మచ్చల పురుగు (క్యాలీఫ్లవర్, క్యాబేజీ నాశించే ముఖ్యమైన పురుగు) నివారణలో ఈ మొక్క కషాయాన్ని వుపయోగించుకోవచ్చని డా|| హెచ్.వే (జపాన్ – 2005) పరిశోధనలలో నిరూపితమైంది.
నానబాలు మొక్క ద్రావణానికి వరి, గోధుమ, మొక్క జొన్న మరియ వేరుశనగ నిల్వలో ఆశించే ”అఫ్లోటాక్సిన్” (శిలీంధ్రం) ఉత్పత్తిని నియంత్రించే శక్తి ఉన్నట్లు డా|| సింగ్ మరియు డా|| సిన్హా (1986) పరిశోధనలు తెలుపుతున్నాయి.
Tag:నానబాలు