తెగుళ్ళపై వాతావరణ పరిస్థితుల ప్రభావం
వేరుశనగలో వచ్చే తిక్క ఆకుమచ్చ తెగులు వాతావరణంలో అత్యల్ప ఉష్ణోగ్రత 21 డిగ్రి సెం.గ్రే. లేదా అంతకంటే ఎక్కువగా ఉండి ఆకులపై తేమ 10 గంటలకంటే ఎక్కువ సేపు ఉన్నట్లయితే విపరీతంగా వస్తుంది.
మిరపలో వచ్చే ఎండుతెగులు వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత, భూమిలో తేమవుండి పొలాల్లో మురుగునీరు పారుదల సరిగాలేని ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది.
వరిలో వచ్చే అగ్గితెగులు కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీ.సెం.గ్రే. కంటే తక్కువ, గాలిలో తేమ 90శాతం కంటే ఎక్కువ, రాత్రిపూట మంచుబిందువులూ వర్షపు జల్లులు ఆకులమీద పడటం…. ఈ మూడు పరిస్థితులు ఒక వారంరోజులపాటు ఉంటే విపరీతంగా ఆశించి నష్టం కలుగజేస్తుంది.
వరిలో వచ్చే పొడతెగులు 28 డిగ్రీ.సెం.గ్రే. పైగా ఉష్ణోగ్రత, గాలిలో ఎక్కువ తేమ, మబ్బులు ఉన్న పరిస్థితులలో ఎక్కువగా విస్తరిస్తుంది. ఈ రోగం చెట్ల నీడల్లో తొందరగా అభివృద్ధి చెందుతుంది.
పొట్టకుళ్ళు తెగులు రాత్రి ఉష్ణోగ్రత 25డిగ్రి.సెం.గ్రే. ఉన్నప్పుడు, గాలిలో అధికంగా తేమ, మంచు, చల్లని వాతావరణం వున్నప్పుడు త్వరగా వ్యాపిస్తుంది.
బ్యాక్టీరియా ఎండుతెగులు 30 డిగ్రి.సెం.గ్రే. లోపు ఉష్ణోగ్రత, గాలిలో ఎక్కువ తేమ, జల్లులు లేదా వర్షం లేదా గాలివాన…. ముఖ్యంగా ఆగస్టు నుండి అక్టోబర్ వరకు పడే వర్షాలలో వ్యాప్తి చెందుతుంది.
దీనివలన మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే ప్రతి తెగులు వ్యాప్తికి కొన్ని రకాల వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. ఈ పరిస్థితులు లేకుంటే వ్యాధికారకాలు ఉన్నా, తెగులు వ్యాప్తి చెందదు. కానీ మనం పంటపై ఏదో మచ్చకనిపించగానే అవసరం లేకున్నా తెగుళ్ళ మందులు విపరీతంగా పిచికారి చేస్తున్నాం.
ఉష్ణోగ్రత ప్రభావం:
ఏ కాలంలో, ఏ ప్రాంతంలో తెగులు వ్యాపిస్తుందనేది ఆ ప్రాంత ఉష్ణోగ్రతలమీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కొన్నిరకాల తెగుళ్ళు చలికాలంలో వస్తే, కొన్ని వేసవి కాలంలో వస్తుంటాయి. ఎక్కువగా తెగుళ్ళు వర్షాకాలంలో వస్తుంటాయి. చల్లని ఉష్ణోగ్రతలో వచ్చే తెగుళ్ళు ఎక్కువగా చల్లని ప్రాంతంలో పండించే పంటలలోనే వస్తాయి. అదేవిధంగా నారుకుళ్ళు, ఎండుతెగులు, బ్యాక్టీరియా ఎండుతెగులు, కుళ్ళుతెగులు ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంటాయి.
1. ఒక పంటకు ఎండుతెగులు ఆశిస్తే 27 డిగ్రీ సెం.గ్రె. ఉష్ణోగ్రత దగ్గర ఆ పంటలో 12 రోజులకు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. అదే 16 డిగ్రీ. సెం.గ్రె. దగ్గర 58 రోజులకు వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
2. భూమిలో 12-20 డిగ్రీ.సెం.గ్రె. ఉష్ణోగ్రత ఉన్నప్పుడు నారుకుళ్ళు తెగులు శిలీంద్రం మొక్కలలోనికి సులువుగా ప్రవేశిస్తుంది.
తెగుళ్ళమీద తేమ, మంచు ప్రభావం :
సాధారణంగా ఆకుల మీద తేమలేకుంటే ఆ మొక్కల మీద వ్యాధికారమున్నా తెగులు వ్యాప్తిచెందదు. ఎందుకంటే శిలీంధ్రాలు మొక్కలలో ఆకులమీది తేమను ఉపయోగించుకొని మొలకెత్తి ఆకులలోని రంధ్రాల ద్వారా మొక్కలలోని ప్రవేశిస్తాయి. చాలా రకాల తెగుళ్ళ పెరుగుదలకు మంచు తోడ్పడుతుంది. అలాగే నీడ కూడా తెగుళ్ళ వ్యాప్తికి తోడ్పడుతుంది.
Tag:వాతావరణ ప్రభావం