చెమ్మకాయ – ఒక సాంప్రదాయేతర కూరగాయ పంట – డా॥ కె.రాధారాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల, డా॥ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం
చెమ్మకాయ – ఒక సాంప్రదాయేతర కూరగాయ పంట
కూరగాయలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కూరగాయల ద్వారా ప్రోటీన్లు, పిండి పదార్థాలు, విటమిన్లు, లవణాలు లభిస్తాయి. కేవలం కొన్ని పప్పుజాతి పంటలైన చిక్కుడు మొదలైన పంటలు పండిరచడం ద్వారా మన భారతదేశంలో పెరిగే జనాభాకు సరిపడా పోషక విలువలను అందించలేము. అయితే ఇంకా కొన్ని వాణిజ్య పరంగా సాగులో లేని పప్పుజాతికి చెందిన కూరగాయ పంటలు కూడా చాలా వున్నాయి. అందులో చెమ్మకాయ ముఖ్యమైనది.
పప్పుజాతి కూరగాయల్లో చెమ్మకాయ (తమ్మకాయ)లో అధిక పోషక విలువలు ముఖ్యంగా ప్రోటీన్స్ ఎక్కువగా వున్నట్లు శాస్త్రీయంగా కనుగొనబడింది. అయితే ఈ పంట మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ వాణిజ్యపరంగా సాగులో లేదు. కానీ ఇది మన సాంప్రదాయ పంట.
చెమ్మకాయ ‘‘లెగ్యూమినేసి’’ కుటుంబానికి చెందిన సాంప్రదాయేతర కూరగాయలలో ఒకటి. మన దేశంలో పండించే సాంప్రదాయేతర కూరగాయలలో చెమ్మకాయ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యాన్ని పొందుతుంది. వీటి లేత కాయలను కూరగాయలుగా, ఎండిన విత్తనాలను బాగా ఉడికించిన తరువాత పప్పు దినుసులుగా వాడతారు. వీటి ఆకులో మరియు విత్తనాలో పెరుగుదలను నిరోధించు ప్రోటిన్ పదార్థం మరియు పోషక విలువలు నిరోధించు పదార్థాలు వుంటాయి. వీటి తీవ్రత మొక్క వయస్సుతో పాటు పెరుగుతుంది. కాబట్టి కూరగా లేత కాయలను మాత్రమే వాడుకోవాలి. ఎండిన కాయ నుండి సేకరించిన విత్తనాలను అధిక ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సేపు ఉడికించాలి.
ఈ పంట 50-60 రోజుల మధ్య పూతదశకు వస్తుంది. ఒక్కో మొక్క 15-40 కాయలను ఇస్తుంది. ఒక్కో కాయలో 7-13 విత్తులు వుంటాయి. హెక్టారుకు 3 టన్నులు లేత కాయలను ఇస్తుంది. వీటిలో 16.6-20.8శాతం ప్రోటిన్, 0.13-0.36శాతం మెగ్నిషియం, 0.21-0.75శాతం కాల్షియం, 37.6-100.8 పిపియం ఐరన్, 0.036-0.73 శాతం సోడియం, 2.24-4.22శాతం పొటాషియం మరియు 0.086-0.29శాతం భాస్వరం కలదు.
ఇతర ఉపయోగాలు:
- దీనిని పచ్చిరొట్ట పంటగానూ, కవర్ క్రాప్గానూ వుపయోగించవచ్చు.
- వీటి ఆకును పశువుల దానాగా వాడవచ్చు.
- తల్లి వేరు వ్యవస్థ లోతుగా వుండటం వన సమస్యాత్మక భూములను బాగు చేయటంలో వుపయోగపడుతుంది.
- నత్రజని స్థాపనలో ఉపయోగపడుతుంది.
- క్షార నేలలు, ఆమ్ల నేలలు మరియు నీరు ఎక్కువగా వుండే నేలలలోనూ దీనిని సమర్ధవంతంగా పండించవచ్చు.
సాగు పద్ధతి:
వాతావరణం చల్లగా వున్నప్పుడు (15-27 డిగ్రీ సెంటీగ్రేడ్) చెమ్మకాయలను ఏడాది పొడుగునా సాగు చేయవచ్చు. ఇసుకతో కూడిన గరప నేల నుండి బరువైన అన్ని రకాల నేలలు దీని సాగుకు అనుకూలం. క్షార నేలలోనూ మరియు ఆమ్ల నేలలోనూ దీనిని పండిరచవచ్చు.
చెమ్మకాయలను ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు విత్తుకోవాలి. కొండ ప్రాంతాల్లో అయితే మార్చి నుండి మే వరకు విత్తుకోవాలి. హెక్టారుకు 80 నుండి 100 కిలో విత్తనం కావాలి. విత్తే దూరం మొక్కల మధ్య 0.5 మీ., వరుసల మధ్య 3.0 మీ. వుండాలి. విత్తనశుద్ధి చేసిన విత్తనాన్ని వాడుకుంటే మంచిది.
ఈ పంట సాగుకోసం ముందుగా భూమిని పూర్తిగా దున్నిన తరువాత ఒక టన్ను పచ్చిరొట్ట ఎరువు మరియు వర్మికంపోస్టుతో పాటు బాగా చివికిన పశువుల ఎరువు 25 నుండి 30 టన్నుల ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. హెక్టారుకు 75 కిలో నత్రజని, 60 కిలో పొటాష్, 30 కిలో భాస్వరం ఇచ్చే సేంద్రియ ఎరువు వేసుకుంటే కాయల నాణ్యత బాగుంటుంది.
విత్తనాలు నాటిన వెంటనే తడివ్వాలి. ప్రతి పది రోజులకు ఒకసారి నీటి తడివ్వాలి. ముఖ్యంగా పూత సమయంలో మరియు కాయ పెరిగే దశలో నేలలో తేమ తప్పనిసరిగా వుండేటట్లు చూసుకోవాలి. లేకపోతే పూత మరియు పిందె రాలిపోయే అవకాశముంటుంది.
కాయలు లేతగా వున్నప్పుడు మాత్రమే కోయాలి. విత్తిన 65-75 రోజులకు మొదటి కోతనిస్తాయి. ఆ తరువాత 10-15 రోజుల వ్యవధిలో ఇంకోసారి కోసుకోవచ్చు. సాగు చేసే పద్ధతి, వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి హెక్టారుకు 2 నుండి 5 టన్నుల లేతకాయలు లభిస్తాయి.