గులాబి రంగు పురుగు – సుస్థిర వ్యవసాయ కేంద్రం
తల్లి పురుగు : ముదురు గోధుమ రంగులో ఉండి నల్లని మచ్చలు కలిగి వుంటాయి. వేేగంగా ఎగురుతాయి.
గుడ్లు : లేత పసుపు రంగు గుడ్లను ఒక్కొక్కటిగా ఆకు తొడిమలపైన పూత పిందెల పైన 100కి పైగా పెడతాయి.
లార్వా : లేత పసుపురంగులో ఉండే పిల్ల పురుగులు పెద్దవై గులాబి రంగులోకి మారతాయి. తల ముదురు ఎరుపు రంగులో ఉంటుంది.
కోశస్థదశ : పత్తి కాయలలో లేదా నేలలో నిద్రావస్థలో ఉంటుంది.
నష్టం : పిల్ల పురుగు పుప్పొడి, పూలు తొలచి తినడం వల్ల గుడ్డి పూలుగా మారతాయి. కాయలలోనికి తొలచి గింజలు తిని పత్తి నాశనం చేయడం వలన సగం పగిలిన గుడ్డి కాయలు ఏర్పడతాయి. ఇది బెండ పంటలో కాయలను నాశనం చేస్తుంది.
గులాబి రంగు పురుగు ఉధృతికి కారణాలు
- రైతాంగం ఎక్కువ కాల పరిమితి కలిగిన అమెరికన్ పత్తి సంకర జాతి రకాల మోజులో పడి దేశావాళి రకాలను సాగు చేయడం మానివేయడం
- కొన్ని రకాలను వాటి కాల పరిమితిని మించి సాగు చేస్తూ వుండడం, సేంద్రియ ఎరువులను వదిలి రసాయన ఎరువులను ముఖ్యంగా నత్రజని ఎరువులను ఎక్కువగా వేయడం
- కార్మి పత్తిని వేయడం, పత్తి పైరును సంవత్సరాల పాటు ఒకే పొలంలో సాగు చేయడం, పత్తి మోళ్ళను తీయకుండా చేనులోనే వుంచడం, పత్తి మోళ్ళను చాలా కాలం వంట చెరుకుగా వాడడం, తదితర కారణాల వలన కొన్ని సంవత్సరాల నుంచి గులాబి రంగు పురుగు ఉదృతి పెరుగుతూ పత్తిలో దిగుబడులు తగ్గుతున్నాయి.
నివారణ :
- విత్తనం పొలంలో నాటేముందు సల్ఫ్యూరిక్ ఆమ్లం 100 మి.లీ. / కిలో విత్తనం చొప్పున తీసుకొని దానితో 3 నుంచి 5 నిమిషాల పాటు విత్తన శుద్ధి చేసి తరువాత సున్నపు నీళ్ళతో కడగాలి. ఇలా చేయడం వలన పత్తి గింజలలో దాగివున్న పురుగులు లేదా నిద్రావస్థ దశలు నశిస్తాయి.
- పత్తిలో అలసందలు, వేరుశనగ, పెసలు లేదా సోయాబిన్ అంతర పంటగా వేసుకోవడం వల్ల రైతు మిత్రపురుగులైన అక్షింతల పురుగులు, క్రైసోపా, సిర్ఫిడ్ ఈగలు మొదలగునవి పెరిగి సహజ సస్యరక్షణ జరుగుతుంది. ఈ అంతర పంటల వలన ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది.
- ఎరపంటగా బెండను గట్లపై నాటుకొని దానిపై ఆశించిన లార్వాలను, పురుగు గుడ్లను నాశనం చేయాలి. పత్తి పంట చుట్టూ రక్షిత పంటగా జొన్న విత్తాలి.
- పొలంలో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.
- పురుగుమందుల పిచికారి ఆపేయడం వల్ల పొలంలో మిత్రపురుగులైన అక్షింతల పురుగులు, క్రైసోపా, సిర్ఫిడ్ ఈగలు మొదలగునవి పెరిగి సహజ సస్యరక్షణ జరుగుతుంది. వీటిని మరింత ఎక్కువ చేయడానికి ట్రైకోగ్రామా పరాన్న జీవులను ఎకరానికి 60,000 చొప్పున (3 కార్డులు) పొలంలో పురుగు ఉధృతిని బట్టి 3-4 సార్లు వదలాలి.
- పొలంలో ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చుకొని పురుగు ఉధృతిని గమనించవచ్చు. ఎకరం పొలంలో 40-50 పిరమోన్ ట్రాప్లు అమర్చి ఆడ మగ పురుగులను కలవనీయకుండా చేయడం ద్వారా పురుగును అదుపు చేయవచ్చు.
- తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా 5 శాతం వేప కషాయాన్ని పిచికారి చేయాలి.
- పత్తి తీత పూర్తయిన వెంటనే మిగిలి వున్న కాయలను, పువ్వులను తినేందుకు వీలుగా గేదెలు, మేకలు, గొర్రెలను పొలంలో వదిలినట్లయితే పురుగు పెరిగే అవకాశం ూండదు.
- పత్తి తీయగానే మోళ్ళు పెరికి కాల్చివేయాలి. లేదా అట్టలు తయారీ పరిశ్రమకు త్వరగా తరలించాలి.
- గుడ్డిపూలు, గుడ్డి కాయలు, మొక్క మొదళ్లలో రాలిన చెత్త ఏరి నాశనం చేయాలి. పంట కాలం పూర్తయ్యాక మొదళ్ళను తొలగించి కాల్చి నాశనం చేయాలి. దీనివలన నిద్రావస్థలో ఉన్న లార్వాలను, కోశస్థదశలను నిర్మూలించవచ్చు.
- గులాబి రంగు కాయతొలుచు పురుగు యొక్క స్వభావాన్ని అవగాహన చేసుకొని గ్రామంలోని రైతులందరూ ఒక సమగ్రమైన ప్రణాళికతో నివారణ చర్యలు చేపట్టినట్లయితే దీని వలన కలిగే నష్టాన్ని సమర్ధవంతంగా అరికట్టవచ్చును.