గుంటగలగర
గుంటగలగర
ఈ మొక్క వరి పంట పొలాల సమీపంలోనూ, చెఱువులు, కాలువల గట్ల ఎంబడి కలుపు మొక్కగా పెరుగుతుంది. కొన్ని వరి పండించే ప్రాంతాలలో కలుపు మొక్కగా వరి పైరులో కనపడుతుంది.
గుంటగలగర మొక్క ఆకులలో ఉన్న రసాయనాలు చాలా శక్తివంతమైనవి. ఈ మొక్కలో వున్న రసాయనాలకు శిలీంధ్ర నాశని మరియు కీటక నాశని లక్షణాలు ఉన్నట్లు డా|| మితున్ (2011) మరియు ఇతర శాస్త్రజ్ఞులు (బెంగుళూరు) చేసిన అధ్యయనంలో తేలింది.
గుంటగలగర ఆకు కషాయానికి అపరాలు (పప్పుధాన్యాలు) నిల్వలో ఆశించే పుచ్చు పురుగులను నియంత్రించే లక్షణాలు వున్నాయని డా|| దావాన్ మరియు సక్సేనా (ఉత్తర ప్రదేశ్ -2009) శాస్త్రజ్ఞుల పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఈ మొక్కలో వుండే రసాయనాలు కీటకాలకు అభివృద్ధి నిరోధకంగానూ, గుడ్లను నియంత్రించేవిగానూ మరియు క్రిమిసంహారకంగానూ పని చేస్తాయని సూచించారు.
గుంటగలగర ఆకు కషాయానికి దోమలను నియంత్రించే గుణం వుందని డా|| గోవింద రాజన్ (తమిళనాడు, 2011) పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
గుంటగలగర ఆకులను సస్యరక్షణలో ”పంచపత్ర కషాయం”లో వుపయోగించి పంటలపై వచ్చే ఆకులను, కాయలను తినే గొంగళి పురుగులను సమర్ధవంతంగా నివారించవచ్చని రైతుల అనుభవం.