ఖరీఫ్‌లో కూరగాయల సాగు – డా॥ కె.రాధారాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల, డా॥ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం
ఖరీఫ్‌లో కూరగాయల సాగు
ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలవడంతో రైతులు తమ పంటలను వేసుకోవడానికి సిద్ధమౌతున్నారు. కూరగాయల పంటను పండించే రైతులు సరైన పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలు పొందగరు. ఖరీఫ్‌లో వేసుకోవడానికి టమాట, వంగ, మిరప, బెండ, చిక్కుడు, గోరుచిక్కుడు, ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు దాదాపు అన్ని కూరగాయలూ అనువైనవే.
తీగజాతి కూరగాయలు, చిక్కుడు, గోరుచిక్కుడు, బెండ వంటి కూరగాయల విత్తన పరిమాణం పెద్దదిగా ఉంటుంది. కనుక వీటిని నేరుగా ప్రధాన పొలంలో విత్తుకోవచ్చు. కానీ విత్తన పరిమాణం చిన్నగా ఉన్న టమాట, వంగ, మిరప వంటి పంటల్లో ముందుగా చిన్న చిన్న నారుమళ్ళలో నారు పెంచుకొని ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. నారుమడి యాజమాన్యంలో సరైన జాగ్రత్తలు తీసుకొంటే నాటిన తర్వాత పంటకాలంలో వచ్చే చీడపీడల బెడద చాలా వరకు తగ్గుతుంది. దీనివలన పెట్టుబడులు తగ్గి కూరగాయల పంట సాగు లాభదాయకంగా ఉంటుంది.
నారుమళ్ళు పెంచడం వల్ల లాభాలు :
రైతులు ఎక్కువగా హైబ్రిడ్ విత్తనాలు వేసుకోవడానికే ఇష్టపడతారు. ఈ విత్తనాల ధర చాలా ఎక్కువ కాబట్టి వీటిని చాలా తక్కువ స్థలంలో పెంచడం వల్ల ఆ విత్తనం వృధా కాకుండా ఉపయోగపడేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. చిన్న మొక్క దశ నుండే చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. నారుమడి తక్కువ స్థలంలో ఉంటుంది కాబట్టి పురుగులు, తెగుళ్ళను చాలా సులభంగా నియంత్రించవచ్చు. నారుమడి ద్వారా కూరగాయల పంటలను సాగుచేయడం వలన పంట గ్యారంటీగా చేతికి వస్తుంది. అవసరాన్ని బట్టి సస్యరక్షణ చేయడం సులభం.
నారుమడి:
నారుమడి వేసుకునే ముందు నారుమడికి కావాల్సిన స్థలాన్ని ఎంపిక చేసుకోవడం ముఖ్యం. నారుమడి స్థలం ప్రధాన పొలానికి దగ్గరగా ఒక పక్కగా ఉంటే మంచిది. నారు మడి వేయాల్సిన స్థలం నీటి వసతికి దగ్గరగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎంపిక చేసిన స్థలం ఇసుకతో కూడిన గరప నేలలైతే మంచిది. అలాగే మురుగు నీటి పారుదల సౌకర్యం బాగా ఉండి కొద్దిగా ఎత్తైన ప్రదేశంగా ఉండాలి. స్థలం ఎంపిక చేసిన తర్వాత నారుమడి తయారు చేసుకోవటంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
సాధారణంగా రైతులు ఎత్తైన నారు మడులు తయారు చేసుకోకుండా అప్పటి కప్పుడు పొలంలో ఒక మూలకు విత్తనాలు విత్తుకొని నారుమడి పెంచుతారు. అలా చేయడం వల్ల వర్షం బాగా పడినపుడు ఆ మడుల్లో నీరు నిలబడి మొక్కలు కుళ్ళిపోతాయి. కాబట్టి ఎత్తైన నారుమడులు (కనీసం 15 సెం.మీ. ఎత్తుతో) తయారు చేసుకోవాలి. నారుమడి తయారీకి ముందు ఎంపిక చేసిన స్థలాన్ని బాగా దున్ని ఎండకు ఎండేలా చేయాలి. దీనివల్ల నిద్రావస్థలో ఉన్న పురుగులు, వేరుపురుగు వంటివి బయటపడి నశిస్తాయి. నేలలో ఎటువంటి కలుపు మొక్కలు వేర్లు లేకుండా తీసివేసి కాల్చేయాలి. నారుమడిలో కలుపు మొక్కలు తీయడానికి, ఇతర సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి అనుకూలంగా ఒక మీటరు వెడల్పు, 4 మీటర్ల పొడవు, 15 సెం.మీ. ఎత్తుతో నారుమడులను తయారు చేసుకోవాలి.