క్రిమి సంహారకాలు కాలకూట విషాలు – డా|| కోయ వెంకటేశ్వరరావు
చట్టబద్ధంగా లేబుళ్లపైనా, కరపత్రాల్లోనూ క్రిమి సంహారక మందులకు సంబంధించి ఈ దిగువ సమాచారాన్ని ఇవ్వాలి. మీరు తీసుకున్న క్రిమి సంహారక మందుతోపాటు ఈ సమాచారం ఇవ్వకపోతే దాని తయారీదారు లేదా మీరు కొన్న దుకాణాదారు మిమ్మల్ని మోసం చేసినట్లుగా పరిగణించాలి. ఇలా సమాచారం ఇవ్వకపోవడం, నైతికంగా చట్టపరంగా రెండు విధాలా కూడా సరైనది కాదు. దీనిని అందరూ ప్రతిఘటించాలి.
ప్రభుత్వం రూపొందించిన కీటక సంహారకాల నియమాలు (1971) ఇలా వున్నాయి.
క్రిమి సంహారకం ప్యాకింగ్, లేబులింగ్ల సమాచారం:
- ప్యాక్ చేయకుండా, లేబుల్ చేయకుండా ఆ క్రిమి సంహారకాన్ని అమ్మకూడదు. ఏ వ్యక్తి కూడా నిబంధనల ప్రకారం ప్యాక్ చేయని, లేబుల్ చేయని క్రిమి సంహారకాల్ని నిల్వ వుంచటం గాని, ఇతరులకు పంపిణీ చేయడం గాని నిషిద్ధం.
ఈ నియమాల ప్రకారం క్రిమి సంహారకాల్ని లేబుల్ చేయకుండా, ప్యాక్ చేయకుండా అమ్మరాదు.
క్రింది సమాచారాన్ని లేబుల్ మీద ముద్రించి గాని, చెరిగిపోని సిరాతోరాసి కానీ ఆ లేబుల్‌ను మందు డబ్బా లేదా సీసా మీద అంటించాలి. అదేవిధంగా మందు పాత్ర వున్న ప్యాకింగ్ కవరుపై కూడా సమాచారం ఇవ్వాలి. ఇవ్వవలసిన సమాచారం.
- తయారు చేసిన సంస్థ పేరు.
- క్రిమి సంహారక మందు పేరు (వ్యాపార నామం లేదా రసాయన నామం. ఈ పేరుతో దానిని అమ్ముతారు)
- కీటక నివారిణి రిజిస్ట్రేషన్ సంఖ్య
- అసలు మందుతో కలిసి వున్న పదార్థాలు, వాటి శాతాలు
- మొత్తం ఘన పరిమాణం (ఇది క్రిమిసంహారిణిది మాత్రమే, డబ్బా, ఇతర పదార్థాలది కాదు. దీన్ని భార రూపంలో, సంహారకం యూనిట్ల రూపంలో మెట్రిక్ పద్ధతిలో ఇవ్వాలి).
- బ్యాచ్ సంఖ్య
- వాడుక గడువు తేదీ, అంటే మందు ప్రభావం పనిచేసే ఆఖరు తేదీ
- మందు విషపూరితమైనదైతే దానికి విరుగుడు పదార్థాల సమాచారం
- పాత్ర మీది లేబుల్ ఊడిపోరాదు.
- లేబుల్ మీద 1/16 భాగం కంటే తగ్గని ప్రదేశంలో డైమండ్ (చతురస్రం) గుర్తుని రెండు త్రిభుజాల కలయికగా ముద్రించి, దాని పై త్రిభుజంలో సబ్‌రూల్-4 సమాచారానికి అనుగుణంగా గుర్తు, సంకేతం వుండాలి. కింది త్రిభుజంలో సబ్ రూల్-5 ప్రకారం ప్రత్యేకమైన రంగు ముద్రించాలి.
సబ్ రూల్ 3 ప్రకారం, చతురస్రం (డైమండ్)లోని పై త్రిభుజంలో కింది గుర్తులు, వాటికి సంబంధించిన స్టేట్ మెంట్లు వుండాలి.
- మొదటి తరగతికి చెందిన అత్యధిక విషపూరిత (Extremety Toxic) క్రిమి సంహారకాలకు పుర్రె, రెండు క్రాస్ ఎముకల గుర్తు వుండాలి. విషం (Poison) అని ఎరుపు అక్షరాలతో ముద్రించాలి.
- త్రిభుజం బయట అదే లేబుల్‌పై క్రింది సమాచారం కూడా వుండాలి.
- పిల్లలకు దూరంగా వుంచండి.
- మందు తాగినా, విష ప్రభావ లక్షణాలు కన్పించినా వెంటనే డాక్టర్‌ను పిలవాలి.
- రెండో తరగతి Highly Toxic (అధిక విషం) క్రిమి సంహారకాలకు త్రిభుజంలో విషం (Poison) అని పసుపుపచ్చ రంగులో ముద్రించి వుండాలి. పిల్లలకు దూరంగా వుంచండి అన్న వివరణను చతురస్రం బైట లేబుల్ మీద ప్రముఖంగా ముద్రించి వుండాలి.
- మూడో తరగతి Moderately Toxic (ఒక మోస్తరు విషం) క్రిమిసంహారక మందులకు త్రిభుజంలోపల ప్రమాదం అని ముద్రించి త్రిభుజం బయట పిల్లలకు దూరంగా వుంచండి అని వుండాలి.
- నాలుగో తరగతి క్రిమి సంహారకాలకు Slightly Toxic (తక్కువ విషం) అని త్రిభుజంలో వుండి బయట జాగ్రత్త (Coution) అని ముద్రించాలి.
- చతురస్రంలోని కింది త్రిభుజం సబ్ రూల్ 4 ప్రకారం వుంటుంది. దీనికి ఒక ప్రత్యేక రంగు పట్టికలో వరుస-1 ప్రకారం వుంటుంది. ఇది రెండో వరుసలో, క్రిమిసంహారకం విష ప్రభావం ఆధారంగా వుంటుంది. (పట్టికలో చూడండి)
- సబ్ రూల్స్ 3, 4, 5ల ప్రకారం తీసుకొన్న జాగ్రత్తలతో పాటు ప్యాకేజి లేబుల్‌పై అవి తేలికగా మండే పదార్థాలూ, వేడికి దూరంగా వుంచాలి వంటి సమాచారం కూడా వుండాలి.
- లేబుళ్ళపై హిందీ, ఇంగ్లీషుల్లోనూ ఇంకా అవి వాడే ప్రాంతాల్లోని ప్రాంతీయ భాషల్లోనూ సమాచారం ముద్రించాలి.
- సురక్షితం, విషం కాదు, ప్రమాదకారి కాదు లాంటి పదాలను లేబుళ్ళపై ముద్రించరాదు.
కరపత్రంపై వుండవలసిన సమాచారం:
- క్రిమి సంహారకం మొక్కల తెగుళ్ళు, పురుగులు, హానికర జీవులు, కలుపు మొక్కలు, జంతువులు మొదలైన వాటిలో దేనికి పనిచేసేది, ఎంత పరిమాణంలో వాడాలి వంటి వివరాలు, మందును వాడే సరియైన పద్ధతి.
- మనుషులకు, జంతువులకు ఆ క్రిమి సంహారకం వల్ల సంభవించగల హాని, దానికి విరుగుడుగా తీసుకో వలసిన చర్యలు, అసలు ఆ హాని జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు.
- ఆ క్రిమి సంహారకం పేలుడు, తేలిగ్గా మండటం వంటి లక్షణాలు లదా, దానికి ఎలా జాగ్రత్తపరచాలి వంటి వివరణలు.
- మందు వాడిన తరువాత పాత్రలను ప్రమాద రహితంగా పారవేసే విధానాలు
- మందు విషపూరితమైనదైతే దానికి వాడవలసిన విరుగుడు పదార్థం సమాచారం లేబుల్, కరపత్రం రెండింటిపై ముద్రించాలి.
- క్రిమి సంహారకంతో గొంతు, ముక్కులు, చెవులు, కళ్ళు, చర్మం లాంటివి ప్రభావితమయ్యే అవకాశం వుంటే ఆ విషయం స్పష్టంగా పేర్కొవాలి.
పట్టిక
గుర్తు రంగు | విషతీవ్రత | LD50 oral mg/kg | LD50 Dermal mg/kg |
ముదురు ఎరుపు | అత్యధికం (Extreme) | 1-50 | 1-200 |
ముదురు పసుపుపచ్చ | అధికం (High) | 51-500 | 201-2000 |
ముదురు నీలం | సాధారణం (Moderate) | 501-5000 | 2001-20000 |
ముదురు ఆకుపచ్చ | అల్పం (Slight) | 5000 పైన | 20000 పైన |
LD50 ఎంత తక్కువైతే ఆ క్రిమి సంహారక మందు అంత ఎక్కువ విషపూరితమన్న మాట.
Tag:Telugu, క్రిమి సంహారకాలు, విషతీవ్రత