కొత్త బాట – పద్మ వంగపల్లి
ఉమా దేవి అనంతపురం జిల్లా తలపుల మండలం, ఒదుల పల్లి పంచాయితి, గొల్ల పల్లి తాండా గ్రామ నివాసి. ఈమె భర్త లారీ డ్రైవర్. వీరికి 4 ఎకరాల సొంత భూమి వుంది. ఆ భూమిలో వీరు ప్రధానంగా వేరుసెనగ పంటను సాగు చేసేవారు. నీటి వసతి కోసం వీరు వారి పొలంలో బావి త్రవ్వుకున్నారు. కొంత కాలం తరువాత ఆర్.డి.టి. వారి ఆర్ధిక సహాయంతో పొలంలో మామిడి మొక్కలు నాటుకున్నారు. మామిడి తోటలోనే వేరుసెనగ, ఉలవ, కంది వంటి పంటలు సాగు చేసే వారు. ఉమాదేవే వ్యవసాయ పనులన్నీ చూసుకునేది. పంట సాగు చేయడం కోసం రసాయన ఎరువుల కొనుగోలు కోసం ఎక్కువ పెట్టుబడి పెట్టేవారు. పెట్టుబడి పెరిగింది కానీ, దిగుబడి తగ్గింది. అయినా అప్పులు చేసుకుంటూనే, వ్యవసాయం కొనసాగించారు. కనీస దిగుబడి కూడా వచ్చేది కాదు అప్పులు చేసి పంట సాగు చేసేవారు. కొంతకాలానికి
ఉమాదేవి ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోవడం వల్ల పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో వ్యవసాయం వదిలేయవలసి వచ్చింది. మామిడి తోటలో ఇతర పంటలు సాగు చేయలేక పోయారు.
కొంత కాలం తరువాత సుస్థిర వ్యవసాయ కేంద్రం సభ్యులు ఆ గ్రామంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాలను గురించి రైతులకి వివరించారు. ఆ సమావేశానికి హాజరయిన ఉమా దేవి తన భర్తకు ప్రకృతి వ్యవసాయం గురించి తెలియ చేసి సి.ఎస్.ఎ వారి సలహాలతో, తిరిగి వ్యవసాయం చేయడం ప్రారంభించింది. మామిడిలో వేరుసెనగ పంటను సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం మొదలు పెట్టింది. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం వాడుతూ పంటను ఆశించే పురుగుల నివారణకు పిచికారి చేసే నీమాస్త్రం, వావిలాకు కషాయం మొదలయిన వాటి గురించి సి.ఎస్.ఎ. వారి ద్వారా తెలుసుకొని పంట సాగు చేసింది. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చును తగ్గించుకొని, కొంత వరకు ఆదాయం పొందగలిగింది.
ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా వేరు సెనగ పంట దిగుబడి పెరగటమే కాక మామిడి మొక్కలు కుడా బాగా ఆరోగ్యంగా ఉన్నాయని, ఖర్చు చాలా వరకు తగ్గించుకో గలిగామని ఆనందం వ్యక్తం చేస్తోంది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ, గ్రామంలోని ఇతర రైతులకు కూడా తను అనుసరిస్తున్న పద్ధతుల గురించి తెలియచేస్తోంది.
గతంలోని చేదు అనుభవాలను, సాగు పద్ధతులు మార్చుకున్నాక, రసాయనాలు వదిలేసాక, ప్రకృతితో మమేకయ్యాక కనిపిస్తున్న సానుకూల ఫలితాలను బేరీజు వేసుకుని, ఇప్పుడు ఉత్సాహంతో, ధైర్యంగా ముందుకు అడుగు వేయడమే కాదు, గ్రామంలోని ఇతర మహిళా రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది.