కొడిశపాల
కొడిశపాల
కొడిశపాల సుమారు 2-3 మీటర్ల ఎత్తు వరకూ పెరిగే చిన్న వృక్షం. మన రాష్ట్రంలో ముఖ్యంగా ఏజన్సీ ప్రాంతాలలోనూ, గ్రామ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న చిట్టడవులలోనూ, తేలిక నేలలలో ఈ వృక్షం కనపడుతోంది. ఆకులను తెంపితే పాలు కారతాయి. పత్రాలు కణుపుకు రెండు చొప్పున అండాకారంలో ఉంటాయి. ఈ మొక్కలో అనేక రకాల రసాయనాలు (ఆల్కలాయిడ్స్) ఉన్నాయి. వైద్య పరంగా ఈ మొక్క ఆకులు, బెరడు, వేర్లను ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులను ఆదివాసీ రైతులు పూర్వకాలం నుండీ పంటల సస్యరక్షణలో ఉపయోగిస్తున్నారు.
వరిపైరులో కాండం తొలిచే పురుగు నివారణకు…
కొడిశపాల ఆకులను వరి పొలంలో నాటిన 30-40 రోజుల మధ్య ఎకరాకు 10 కిలోల చొప్పున పొలం అంతా సమంగా వేసి, పలుచగా నీరు కట్టాలి. నీటిని 3-5 రోజుల వరకూ పొలం నుండి తీయకూడదు. ఈ లోగా నీటిలో వేసిన కొడిశపాల ఆకులు చివికి నీరు నలుపు రంగుకు మారుతుంది. ఈ విధంగా పొలంలో బాగా చివికిన ఆకులు ‘కీటకనాశని’గా పనిచేసి వరి పొలంలో కాండం తొలుచు పురుగు నివారణకు ఉపయోగపడుతుంది. కాండం తొలుచు పురుగు బెడదగా ఉన్న ఖమ్మం జిల్లా, పాల్వంచ ప్రాంతంలో రైతులు పంటకాలంలో రెండు సార్లు కొడిశపాల ఆకులను పొలంలో వేసి (30 రోజుల వ్యవధిలో) మంచి ఫలితాలు సాధించారు.
Tag:కొడిశపాల