కేంద్ర ప్రభుత్వం వెలువరిస్తున్న లేబర్ కోడ్స్ పై సామాజిక భద్రత కోడ్ వివిధ సంస్థల అభిప్రాయాలు
కార్మిక మంత్రిత్వశాఖ 17 సెప్టెంబర్ 2019న, మంత్రిత్వశాఖ వెబ్సైటులో ప్రచురించిన కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఫైల్ నెం. జెడ్-13025/13/2015-ఎల్.ఆర్.సి మీద అక్టోబర్ 24, 25 తేదీలలో జాతీయ స్థాయిలో వివిధ కార్మిక సంఘాలు స్వచ్ఛంద సంస్థలు, సంఘటిత, అసంఘటిత, గృహ ఆధార కార్మికుల ప్రతినిధులతో చర్చను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్చ ముఖ్య ఉద్దేశ్యం మంత్రిత్వ శాఖ ప్రచురించిన కోడ్ ముసాయిదాని విశ్లేషించి తగిన సూచనలు ఇవ్వడం.
జాతీయ స్థాయిలో జరిగిన ఈ చర్చా వేదిక, 3వ ముసాయిదా (వెర్షన్ 3.0)కు సంబంధించిన తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ప్రస్తుత ముసాయిదాను మెరుగుపరిచేందుకు ఈ ముసాయిదాను
ఉపసంహరించుకుని ఆ తరువాత కార్మిక మంత్రిత్వ శాఖ ముసాయిదా-4ను ప్రజా సంప్రదింపుల కోసం విడుదల చేయనున్న నేపధ్యంలో జరిగింది.
ప్రస్తుత ముసాయిదాను నిశితంగా పరిశీలించిన మీదట, ఈ ముసాయిదాలో అసంఘటిత రంగాన్ని సామాజిక భద్రత చట్టం నుంచి దూరంగా ఉంచాలన్న ఆలోచన ప్రస్పుటంగా కనిపిస్తోందని ఈ చర్చా వేదిక అభిప్రాయపడింది. దీనికి ప్రత్యామ్నాయంగా ”సామాజిక భద్రత ఒక హక్కుగా పరిగణించబడాలి. ఈ హక్కు అందరు కార్మికులకు, అనగా సంఘటిత రంగం, అసంఘటిత రంగం అని తేడా లేకుండా ఇవ్వాలి. ఈ సామాజిక భద్రత హక్కులు అనేవి, అంతర్జాతీయ కార్మిక సంఘం (ఐ.ఎల్.ఓ) కన్వెన్షన్ ఆధారంగా రూపొందించాలి”.
అసలు ముసాయిదా-3 కి ప్రతిస్పందించాల్సిన అవసరం గురించి కూడా వేదిక చర్చించింది. ఈ వేదికలోని సభ్యులు మొదటి, రెండు ముసాయిదాలను విశ్లేషించిన వారు అవ్వడం వలన, సామాజిక భద్రత కోడ్ పుట్టుక నుంచి జరుగుతున్న పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఈ చర్చ తోడ్పడింది. ఈ వేదికలో చర్చించిన అంశాలు, దాని ద్వారా వచ్చిన సూచనలు, మంత్రిత్వ శాఖకి, సామాజిక భద్రత మీద ఒక కొత్త దృక్పథం ఏర్పర్చుకోవడానికి
ఉపయోగపడుతుంది అన్న ఆశావాదంతో ఈ క్రింది సూచనలను ఇవ్వడం జరిగింది.
1. సామాజిక భద్రత అనేది ఒక సార్వత్రిక మానవ హక్కు. 1952లో ప్రకటించిన ఐ.ఎల్.ఓ. కన్వెషన్-102 మరియు సోషల్ ప్రొటెక్షన్ ఫ్లోర్ (2012 (ఆర్-202) మరియు (బి) మరియు అనధికార ఆర్ధిక వ్యవస్థను అధికారిక ఆర్థిక వ్యవస్థగా మార్చే చర్చ -2015 (ఆర్ 204)) సూచనలు, వ్యక్తి గౌరవం మరియు ప్రతి వ్యక్తిని సమాజంలో అంతర్భాగం చేసే ప్రక్రియలో, వ్యక్తి జీవిత చక్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలని చెబుతున్నాయి. వైద్య సంరక్షణ, ఆదాయ భద్రత, అనారోగ్యం, నిరుద్యోగం, ఉద్యోగం వలన ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, ప్రసూతి, కుటుంబ బాధ్యత, కుటుంబ ఆర్థిక బాధ్యత నెరవేరుస్తున్న వ్యక్తి మరణం, ముసలితనం, ఉద్యోగ విరమణ మొదలైన అంశాలలో ధన రూపంలో కానీ, సేవల ద్వారా కానీ లబ్ది చేకూర్చడం ద్వారా సామాజిక భద్రతను సాధించాలని సూచిస్తున్నాయి.
2. భారత రాజ్యాంగం, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు మరియు రాజ్య విధానాల సూచనల ద్వారా, ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాన్ని ప్రజలందరికీ సాధించడానికి ప్రయత్నిస్తుంది. మరియు ఆ బాధ్యతను రాజ్యం మీద ఉంచింది. రాజ్యం తాను చేసే చట్టాల ద్వారా, అనుసరించే సూత్రాల ద్వారా వీటిని సాధించాలి. ఈ సూత్రాలలో అసమానతలు తగ్గించే విధంగా చట్టాలు, శ్రామికుల, మహిళల, పురుషుల, ట్రాన్స్‌జెండర్స్ ఆరోగ్యాన్ని కాపాడటం, చిన్న పిల్లల వేధింపుల నియంత్రణ, ఉద్యోగం, చదువు హక్కులుగా పరిగణించడం, నిరుద్యోగ, వృద్ధ, వికలాంగులకు లబ్ది చేకూర్చడం, ఉద్యోగంలో న్యాయమైన, మానవీయమైన పరిస్థితులను ఏర్పర్చడం, ప్రసూతి లబ్ది, గౌరవంగా జీవించడానికి సరి అయిన వేతనం, ఉద్యోగ పరిస్థితులు సామాజిక, సాంస్కృతిక అవకాశాలను వినియోగించుకునేటట్టు ఉండటం, భారత రాజ్యాంగం 43ఎ నిర్దేశిస్తున్నట్టుగా, ఎటువంటి రంగంలో అయినా, శ్రామికులు నిర్ణయాధికారంలో పాల్గొనడం వంటివి ఉంటాయి.
3. సామాజిక భద్రత మీద జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తూ అంతర్జాతీయ శ్రామిక సంఘం బలపరచిన 9 అంశాలను, కనీసం తప్పనిసరిగా ప్రజలందరికీ అందించాలి. ఐ.ఎల్.ఓ. వ్యవస్థాపక దేశంగా, భారతదేశం ఈ తొమ్మిది అంశాలను అమలు పరచడం రాజకీయ బాధ్యత. ఇదే కాకుండా, భారతదేశం, ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకై ప్రమాణం చేసిన నేపథ్యంలో, ఎస్.డి.జి-8 ని అనుసరిస్తూ శ్రామికులందరికీ పని విషయంలో కనీస ప్రమాణాలనూ పాటిస్తూ లబ్దిని చేకూర్చాలి.
4. ప్రస్తుత భారతదేశ సామాజిక భద్రత వ్యవస్థ ఈ అంశాలను పొందుపర్చుకోవడం మీద ఈ వేదిక హర్షం వ్యక్తం చేసింది.
5. పైన పట్టికలో సూచించిన విధంగా, ఇ.ఎస్.ఐ. యాక్ట్ 1948 మరియు ఇ.పి.ఎఫ్ 1952లు, 9 అంశాలను పొందుపర్చుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.
6. సామాజిక భద్రతలో ముఖ్య భాగాలైన ఇ.పి.ఎఫ్. ఇ.ఎస్.ఐ., గ్రాట్యుటి, ప్రసూతి లబ్ది, ఉద్యోగులకు ముట్టవలసిన పరిహారం మీద సామాజిక భద్రత కోడ్‌లో విడివిడి అధ్యాయాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుత కోడ్ ఈ అంశాలను నీరుగార్చే విధంగా
ఉండటమే కాక, అసంఘటితరంగ కార్మికుల్ని ఈ అంశాల నుంచి మినహాయించడం జరిగింది. మేము, ఈ అంశాలలో నీరుగార్చే, మినహాయించే విధానాలు ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తున్నాము.
7. పలు నిర్వచనాల ద్వారా ముఖ్యంగా కోడ్ మొదటి భాగంలోని ఉపవాక్యం-4, ఎవరికి ఈ కోడ్ వర్తిస్తుంది అన్న విషయంలో, రెండవ భాగంలోని ఉపవాక్యం 2 (58) ద్వారా, ఈ కోడ్ సామాజిక భద్రతలోని 5 ముఖ్యమైన అంశాలైన ఇ.పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ., గ్రాట్యుటీ, ప్రసూతి లబ్ది, ఉద్యోగులకు ముట్టవలసిన పరిహారం నుంచి అసంఘటిత రంగ కార్మికుల్ని మినహాయిస్తోంది.
8. ఈ కోడ్ ప్రస్తుతం అమలులో ఉన్న సామాజిక భద్రత ప్రమాణాలను అందుకోలేక పోయింది అని తెలియజేస్తున్నాము. 33 శాతం ఉన్న అసంఘటిత రంగ కార్మికుల్ని మినహాయిస్తోంది. గిగ్ వర్కర్స్ ప్లాట్ఫారం ఆర్థిక వ్యవస్థని నిర్వచించింది. కానీ, ఈ కోడ్ ద్వారా వారికి చేకూరే లబ్ది గురించి మాట్లాడలేదు.
9. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ విచక్షణతో భవిష్యత్తులో షెడ్యూల్ 7లో పొందుపరిచిన 13 పథకాలతో సహా, అమలు చేసే కొన్ని పథకాలు మాత్రమే 9వ భాగంలో రాయడం, దానినే అసంఘటిత రంగానికి సామాజిక భద్రత అనడం, ఒక తెలివైన ప్రయత్నం మాత్రమే. నిజానికి ప్రస్తుతం సంఘటితరంగ కార్మికులకు అందిస్తున్న ఇ.పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ., గ్రాడ్యుటీ, ప్రసూతి లబ్ది, ఉద్యోగులకు ముట్టవలసిన పరిహారం వంటి పథకాల్ని అనుగుణమైన మార్పులతో అసంఘటిత కార్మికులకు అమలు పరచాలి.
10. అన్ని కార్మిక రంగాలకి సార్వత్రిక సామాజిక భద్రత కల్పించడానికి వనరుల అవసరం ఏర్పడుతుంది. ఈ వనరులను బడ్జెట్ ద్వారా, లెవీ, సెస్, పన్నుల ద్వారా, ఇతర తగిన విధానాల ద్వారా, ప్రభుత్వం మరియు ఇతర వాటాదారులకు ఆమోదయోగ్యమైన పద్ధతుల ద్వారా, సమీకరించుకోవాలి. ఆదర్శవంతంగా, రాజ్యాంగంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చిన ఉభయ లిస్ట్ ప్రేరణతో ఇటువంటి వనరుల సమీకరణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషితో జరగాలి. సామాజిక భద్రత అమలును సీ.ఇ.ఓ. నడిపే ఒక సంస్థ ద్వారా చేస్తామని, నిర్వహణ మరియు పరిపాలన కేవలం కేంద్ర ప్రభుత్వం చేయడం వంటి అంశాలను కోడ్ నుంచి మినహాయించాలి.
11. సంఘటితరంగ ఉద్యోగులు ధనరూపంలో పాలుపంచుకునే పి.ఎఫ్. మరియు ఇ.ఎస్.ఐ. వంటి పథకాలను, ప్రస్తుత పద్దతిలోనే అమలు చేయవచ్చు అని ఈ వేదిక అభిప్రాయ పడింది. అయితే అసంఘటితరంగ కార్మికుల విషయంలో వనరుల సమీకరణ బాధ్యత ప్రభుత్వానిదే. ఇందుకోసం, మహారాష్ట్ర మాతాడి బోర్డు ప్రేరణతో బోర్డు యజమానిగా వ్యవహరించే సంక్షేమ బోర్డులను (గృహ నిర్మాణ కార్మికులు, గృహ కార్మికులు) ఏర్పాటు చేయాలి.
12. అసంఘటితరంగంలో జీతం తీసుకునే కార్మికులకు, ధనరూపంలో పాలుపంచుకునే వీలు ఉండేవారికి పి.ఎఫ్. మరియు ఇ.ఎస్.ఐ. వంటి పథకాలను సృజనాత్మకంగా అమలు పరచవచ్చు అని ఈ వేదిక భావిస్తోంది. ఇది వేజ్ కోడ్ పరిధిలోకి వస్తుంది.
13. భారతదేశంలోని అత్యంత పేదవారు స్వయం
ఉపాధిరంగంలో ఉన్న విషయాన్ని నొక్కి చెబుతూ, వారికి తప్పనిసరి బడ్జెట్ కేటాయింపు ద్వారా సామాజిక భద్రతని కల్పించడం మొదటి ప్రాధాన్యతగా ఉంచాలి.
14. ఐ.ఎల్.ఓ. గుర్తించిన సామాజిక భద్రతను, వివిధ రంగాల ప్రజలకు ఎలా అమలు పరచవచ్చు, అని భారత ప్రభుత్వం శ్వేత పత్రాలను విడుదల చేయాలి. కావలసిన నిధులను, వాటిని సమీకరించే విధానాలను కూడా దీనిలో పొందుపర్చాలి.
15. కనీస సామాజిక భద్రత, వనరుల కొరత వల్ల లభించని చోట, సామాజిక భద్రతని సాధనంగా కాక హక్కుల కోణం నుంచి పరిశీలించాలి.
16. పార్లమెంటులో సామాజిక భద్రత కోడ్‌తో, నిధులను సమీకరించే విధానాల తాఖీదును జత చేసి ప్రవేశపెట్టాలి.
17. 14 వ పారాలో సూచించిన శ్వేత పత్రాలను, చట్టం చేసే ముందు జరిపే సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా ఉంచాలి. సామాజిక భద్రత విషయంలో కార్యాచరణ తలబెట్టే ముందు వీటిని కార్మిక మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో ఇతర భాషలలోకి తర్జుమా చేసి పొందుపరచాలి. అలాగే, ప్రస్తుతం చట్టం చేసే ముందు జరిపే సంప్రదింపుల ప్రక్రియ కాలపరిమితిని ఒక నెల నుంచి కనీసం ఆరు నెలలుగా మార్చాలి.
18. భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఆస్తిత్వంలో ఉన్న సంక్షేమ బోర్డులలో త్రైపాక్షిక లక్షణం కలిగి, వనరుల సమీకరణలో అత్యంత సృజనాత్మకంగా ఉన్న బోర్డులను గుర్తించి ఆదరించాలి.
19. కావలసిన వనరులను తానే సమీకరించుకునే మతాడి సంక్షేమ బోర్డు ద్వారా సామాజిక భద్రత కనీస ప్రమాణాల కన్నా మెరుగుగా అందుతుంది. ఇటువంటి బోర్డుకి గుర్తింపు తొలగించే ప్రక్రియను ప్రశ్నించాలి.
20 భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం 1966 ద్వారా ఏర్పడిన సంక్షేమ బోర్డులు, అవసరమైన నిధులను సెస్ ద్వారా సమీకరించు కుంటున్నాయి. వీటిని జాతీయం చెయ్యాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. మరో వైపు సుప్రీం కోర్టు ”వీటిని సమర్థవంతంగా నిర్వహించాలి” అని ఆదేశాలు జారీ చేసింది.
21. కనీస సామాజిక భద్రత భారత ప్రజలందరికీ చట్టపరంగా అందాలి. (స్వయం ఎంపిక సూత్రాల ప్రకారం) సృజనాత్మకంగా వ్యవహరిస్తున్న సంక్షేమ బోర్డులను, ఈ పత్రానికి జత చేయడం జరిగింది. వీటిని సంరక్షించడమే కాక, వీటిని ప్రోత్సహించి, పూర్తి సామర్థ్యంతో పని చేసేలా ఆదరించాలి.
22. భారత దేశ కార్మిక చట్టాల చరిత్రను పరిశిలిస్తే, ట్రేడ్ యూనియన్ ఆక్ట్ 1926 వంటి అన్ని రంగాలకు అమలు చేయగలిగే చట్టాలు ఉంటే, ఒక రంగం యొక్క ఒక సమస్యని పరిష్కరించే నిర్ధిష్ట చట్టాలు కూడా ఉన్నాయి.
23. భారత రాజ్యాంగంలోని 21వ అధికరణను వివరించే ప్రక్రియలో న్యాయ మీమాంస ద్వారా కొన్ని హక్కులు – ఎం.ఎన్.ఆర్.ఇ.జి.ఎ., జాతీయ ఆహార భద్రత చట్టం, చదువుకునే హక్కు, అటవీ హక్కులు, నివాస హక్కు, త్రాగునీరు వంటివి – సాధించగలిగే హక్కులుగా కోర్టు ఆదేశాల అనుసారం ఏర్పడ్డాయి. సామాజిక భద్రత జీవన ప్రమాణాల విషయంలో ఎం.ఎన్.ఆర్.ఇ.జి.ఎ.లో పొందుపరిచిన ”పనికి హక్కు” వివరణ ఎంతో ముఖ్యమైనది.
24. ప్రస్తుత చట్టాలను తీసివేయాలని బలమైన కోరికకి భారత ప్రభుత్వం స్వస్తి పలకాలి.
25. నిర్ణయించిన విధంగా (aర ఎaవ పవ జూతీవరషతీఱపవస) అనే పదజాలం, రోగ లక్షణంలా కార్మిక మంత్రిత్వ శాఖలో బలంగా కనబడుతోంది. దీనిని నయం చేయాలి.
26. బ్యాంకింగ్ వ్యవస్థని కుదిపేస్తున్న ఎన్.పి.ఎ.ని, కో-ఆపరేటివ్ బ్యాంకుల వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రావిడెండు ఫండ్స్‌ని ఐ.ఎల్ మరియు ఎఫ్.ఎస్ (Iకూడఖీచీ) వంటి ఆర్థికంగా చితికిపోయిన కంపెనీలలో ఇన్వెస్ట్ చేసిన నేపథ్యంలో, సామాజిక భద్రతకి సంబంధించిన నిధుల్ని, ప్రభుత్వ బాండ్స్లోనే పెట్టుబడి చేయాలి.
27. సామాజిక భద్రత కోడ్ సీరియల్ నెంబర్ 4 షెడ్యూల్ 5లో తెలియబరచిన విధంగా పథకాన్ని అమలు పరిచే ఏజెన్సీలను మేము వ్యతిరేకిస్తున్నాం. కార్మికుల పొదుపు ధనాన్ని, ఊహాగానాల మీద నడిచే మార్కెట్లో పెట్టుబడి పెట్టే విధానాన్ని వ్యతిరేకిస్తున్నాము.
28. అత్యంత పేదలు, అమానవీయ పరిస్థితులలో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితికి విరుగుడుగా ఒక పటిష్టమయిన సామాజిక భద్రత తప్ప ఈ కోడ్ అనుసరించే వేరే మార్గాలు పనికిరావు. ఒక పటిష్టమయిన సామాజిక భద్రత, ప్రజాస్వామిక విలువలతో జవాబుదారీతనంతో, పారదర్శకతో కూడిన తనిఖీ మరియు పర్యవేక్షణ వ్యవస్థలతోనే సాధ్యం అవుతుంది అన్న విషయంతో మేము ముగిస్తున్నాము.
టేబుల్1.0-ఐ.ఎల్.ఓ. కన్వేషన్ 102 ప్రకారం సామాజిక భద్రత ప్రయోజనాలు మరియు భారత సామాజిక భద్రత చట్టాలు
క్ర.సం. | సామాజిక భద్రత అంశం(ఐ.ఎల్.ఓ) | ప్రావిడెంట్ ఫండ్ | ఇ.ఎస్.ఐ. చట్టం | ఉద్యోగి పరిహార చట్టం |
1 | వైద్య ప్రయోజనం | అవును | ||
2 | అనారోగ్య ప్రయోజనం | అవును | ||
3 | నిరుద్యోగ లబ్ది | అవును | ||
4 | వృద్యాప్య లబ్ది | అవును | ||
5 | ఉద్యోగపరమైన గాయం | అవును | ||
6 | కుటుంబ లబ్ది | అవును | ||
7 | ప్రసూతి లబ్ది | అవును | ||
8 | పని చెయ్యలేనప్పుడు లబ్ది | అవును | అవును | అవును |
9. | కార్మికుడు చనిపోయినప్పుడు కుటుంబానికి సహాయం |