కుక్కతులసి
కుక్కతులసి
ఈ మొక్క పంట పొలాలలోనూ, బీడు భూములలోను, గ్రామాలలో కంచెల వెంబడి కలుపు మొక్కగా పెరుగుతుంది. ఈ మొక్కను వైద్యపరంగా దగ్గు నివారణ కొరకు ఉపయోగిస్తారు.
కుక్కతులసి మొక్క ఆకులలో వున్న రసాయనాలు చాలా శక్తివంతమైనవి. అందువల్ల కుక్కతులసి ఆకుల కషాయం పంటలపై పిచికారీ చేస్తే కషాయంలో వుండే రసాయనాలు (ముఖ్యంగా యూజినాల్) కీటకాలకు వికర్షకంగానూ, ఆహార భక్షక నిరోధకంగానూ పనిచేస్తుందని పరిశోధనలలో నిరూపితమైంది.
కుక్కతులసి ఆకుల ద్రావణానికి అపరాల నిల్వలో ఆశించే పుచ్చు పురుగును (బ్రూకిడ్స్) నివారించే శక్తి వున్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. (వీవర్ – 1991)
కుక్కతులసి ఆకు కషాయానికి పత్తి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటల నాశించే పేనుబంకను నివారించే గుణం వున్నట్లు డా|| పాండే మరియు వర్మ (1982) పరిశోధనలు తెలుపుతున్నాయి.
కుక్కతులసి ఆకుల కషాయానికి పంటలలో వచ్చే ఆకుమచ్చ తెగుళ్ళను నియంత్రించే లక్షణాలు వున్నాయని డా|| గార్గ్ మరియు డా|| సిద్ధికి (1992) పరిశోధనలు తెలుపుతున్నాయి.
దోమల లార్వాలను నిర్మూలించే గుణం కుక్క తులసి ద్రావణానికి వుందని డా|| అన్నీస్ (2008) పరిశోధనలో నిరూపితమైంది.
కుక్కతులసి ఆకులను సస్యరక్షణలో, పంచపత్ర కషాయం (వివిధ ఆకుల ద్రావణం)లో వుపయోగించి పంటలపై ఆశించే రసం పీల్చే పురుగులను మరియు ఆకులకు నష్టం చేసే గొంగళి పురుగులను సమర్ధవంతంగా నివారించవచ్చని రైతుల అనుభవం.
Tag:కుక్కతులసి