కల్పవృక్షం..! మునగ
మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం.
భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ పిల్లలకు మందులతోబాటు మునగాకు పొడినీ బోనస్‌గా ఇస్తున్నాయి. అందుకే మునగాకు టీ తాగడం వల్ల మధుమేహం తగ్గిందనీ పొడి తినడం వల్ల పాలు బాగా పడ్డాయనీ చెప్పే ఆఫ్రికన్ల సంఖ్య కోకొల్లలు.
ఆనోటా ఈనోటా ఇది మనవరకూ వచ్చింది. ‘పెరటి చెట్టు వైద్యానికి పనికిరాద’న్నట్లు నిన్నమొన్నటివరకూ మనం మునగ చెట్టుని పెద్దగా పట్టించుకోలేదు. తలపైకెత్తి దానివైపే చూడలేదు- సాంబారులోకి నాలుగు కాయలు అవసరమైనప్పుడు తప్ప. కానీ అమెరికాకి చెందిన ‘ద ట్రీస్ ఫర్ లైఫ్’ స్వచ్ఛంద సంస్థ మునగ చెట్టులోని అణువణువూ ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. దానికి పలు అంతర్జాతీయ సంస్థలూ శృతి కలిపాయి. ప్రపంచ దేశాలకు ఆ సంజీవని గురించి కథలుగా చెప్పడం ప్రారంభించాయి.
ఐక్యరాజ్యసమితి కూడా మునగ ప్రాధాన్యతను గుర్తించి ఆ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. దాంతో మన దృష్టీ అటు మళ్లింది. న్యూట్రిషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ సి.గోపాలన్, డాక్టర్ కమలా కృష్ణస్వామిలు మునగాకు లోగుట్టుని విప్పారు. వారికి ఆయుర్వేద వైద్యులూ తోడయ్యారు. అంతా కలిసి మరీ ‘మునగ’ మహత్యాన్ని కొనియాడుతున్నారు.
ఏముంది మునగాకులో..?
‘బతికుంటే బలుసాకు తినొచ్చు’… ఓ పాత నానుడి. ఆ బలుసాకు ఏమోగానీ, ‘రోజూ కాస్త మునగాకు తింటే చాలు, వందేళ్లు బతకొచ్చు అన్నది కొత్త సామెత. ఎందుకంటే…
వంద గ్రా. తాజా మునగాకుల్లో… నారింజల్లోకన్నా ఏడు రెట్లు సి-విటమిన్, క్యారెట్లలోకన్నా నాలుగింతల కాల్షియం, అరటిపండ్లలోకన్నా మూడు రెట్లు పొటాషియం, పాలకూరలోకన్నా మూడింతల ఐరన్, బాదంలోకన్నా మూడు రెట్లు విటమిన్- ఇ, పెరుగులోకన్నా రెండింతల ప్రొటీన్లూ ఉంటాయి.
అంటే ఇరవై గ్రా.మునగాకు నుంచి మనిషికి నిత్యం అవసరమయ్యే ఎ,సి-విటమిన్లూ, వంద గ్రా.ఆకు నుంచి కాల్షియం, మూడొంతుల ఐరన్, సగం ప్రొటీన్లూ దొరుకుతాయి.
అందుకే పోషకాహార లోపాన్ని నివారించడానికి దీన్ని మించినది లేదు. అంతెందుకు… ప్రపంచవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది విటమిన్-ఎ లోపం కారణంగానే అంధులవుతున్నారు. దీనికి మునగాకే మహత్తరమైన పరిష్కారం అంటున్నారు పోషక నిపుణులు.
ఆ కారణంతోనే క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో మునగ చెట్లను పెంచి, ఆ కాయల్ని రోజూ తినేవాడట. ‘ఒమేగా-3, 6, 9 ఫ్యాటీఆమ్లాలూ, సకల విటమిన్లూ, అన్ని రకాల అమైనో ఆమ్లాలు… మొత్తంగా 96 పోషకాలున్న ఒకే ఒక చెట్టు మునగ…పేదవాడి ఆహారం’ అంటూ దాని గొప్పతనం గురించి పత్రికల్లో వ్యాసాలూ రాశాడు క్యాస్ట్రో. ఇప్పుడు క్యూబా వాసులు మునగాకుని పండించి, పొడి చేసి విక్రయిస్తున్నారు. భారత్ కూడా మునగ ఆకుల పొడిని ఎగుమతి చేయడం ప్రారంభించింది. కానీ ఆకుని తినడం పట్ల ఇప్పటికీ మనదగ్గర అలసత్వమే.
నిజానికి ప్రాచీన కాలం నుంచీ ఆఫ్రికా దేశాల్లోనూ భారత్‌లోనూ తాజా మునగాకుల్ని తినే అలవాటు ఉంది. మధ్యలో మాయమై, మళ్లీ తెరమీదకొచ్చింది. టైమ్ మ్యాగజైన్ ‘ద నెక్స్ట్ క్వినోవా’గా అభివర్ణించింది. దాంతో పాశ్చాత్య దేశాల్లో ఎండిన ఆకుల పొడిని స్మూతీలూ సలాడ్ల మీద చల్లుకోవడం, టీ, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకున్నారు.
ఎందుకంటే…
100 గ్రా. ఎండిన ఆకుల్లో… పాలల్లో కన్నా 17 రెట్లు కాల్షియం, అరటిపండ్లలోకన్నా 15 రెట్లు పొటాషియం, క్యారెట్లలోకన్నా 10 రెట్లు విటమిన్-ఎ, పాలకూరలోకన్నా 25 రెట్లు ఐరన్… ఇలా చాలా లభిస్తాయి.
మునగాకుని ఎండబెట్టి పొడి చేసుకునే తినాల్సిన అవసరం మనకి లేదు. తాజా మునగాకు పుష్కలం. ఒకప్పుడు శుభసూచకం కాదన్న కారణంతో పెరట్లో మునగ పెంచేవారు కాదు. కాలం మారింది. పట్టింపూ పోయింది. దాంతో కాయలకోసం చాలామందే పెంచుతున్నారు. కాబట్టి ఇతర ఆకుకూరల్లానే మునగాకుతో పప్పూ కూరలూ పచ్చళ్లూ పొడులూ రైస్ వెరైటీలూ కోఫ్తాలూ… అన్ని రకాలూ వండుకోవచ్చు. దోసెల్లో రొట్టెల్లో దట్టించినా రుచే. పొడిని టీ రూపంలో తాగొచ్చు, సూపుల్లో అన్నంలో కూరల్లో… ఎలా కావాలంటే అలా తినొచ్చు. అయితే ముదిరిన ఆకుల్లో పీచెక్కువ. కాబట్టి కుక్కర్లో ఉడికించాలన్నది నిపుణుల సలహా.
ఔషధగుణాలెన్నో…
మరే చెట్టు ఆకులకీ లేనంత మహత్తు మునగాకుకి ఉంది. ఇది 300 వ్యాధుల్ని నివారించగలదు. మునగాకులో రోగనిరోధకశక్తిని పెంచే 46 యాంటీఆక్సిడెంట్లూ అనేకానేక బయోయాక్టివ్ పదార్థాలూ ఉండటంతో శాస్త్రవేత్తలు దీనిమీద పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇందులోని ఓషధుల ప్రభావానికి శరీరంలోని బ్యాక్టీరియా, ఫంగస్‌లన్నీ పలాయన మంత్రం పఠిస్తాయి. క్యాన్సర్లూ అల్సర్లూ కనుచూపుమేర కనిపించవు. ఆల్జీమర్స్ ఎగిరిపోతుంది. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్ దరి చేరడానికి భయపడతాయి. గాయాలన్నీ మునగాకు పేస్టుతో గాయబ్.
అంతేనా… రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త వండిన మునగాకునో లేదా టీస్పూను పొడినో రోజూ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఐరన్ వృద్ధి, రక్తం సమృద్ధి. ఈరోజుల్లో పసివయసు దాటకుండానే కంటిజబ్బులనేకం. రేచీకటి బాధితులూ ఎక్కువే. వాటన్నింటినీ మునగాకులోని బీటాకెరోటిన్ నివారిస్తుందని ఇంటర్నేషనల్ ఐ ఫౌండేషన్ అంటోంది.
ఇంటాబయటా అంతటా ధూళిమేఘాలే… కాలుష్యకాసారాలే. మరి ఆస్తమా, బ్రాంకైటిస్, ట్యుబర్క్యులోసిస్ పిలవకుండానే పలుకుతున్నాయి. ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్నాయి. అందుకే ఆకుల్ని సూపులా చేసుకుని రోజుకి రెండుసార్లు తీసుకుంటే లంగ్సులోని టాక్సిన్లు తొలగి, ఆ వ్యాధులన్నీ పారిపోతాయి.
రజస్వలానంతరం అమ్మాయిలకి ఎన్ని కష్టాలో… కొందరిలో నెలసరి సమయంలో గడ్డలు పడుతుంటాయి. అప్పుడు ఆకులతో చేసిన సూపుని 21 రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే సరి. మునగాకు రసం తాగితే గర్భసంచి సాగకుండా ప్రసవం సులభంగా అవుతుంది. పాలుపడని బాలింతలకి కాసిని నీళ్లలో ఉప్పు, మునగాకులు వేసి కాసేపాగి ఆ నీటిని వంపేసి ఆకుల్ని నేతితో తినిపిస్తే ఫలితం ఉంటుంది. పొడి రూపంలో ఇచ్చినా పాలు పుష్కలమే.
డయేరియా, కామెర్లూ, కలరా బాధితుల బాధ కాదు. ఒకటే దాహం. నీరసం. అప్పుడు రోజుకి రెండుమూడుసార్లు గ్లాసు కొబ్బరినీళ్లలో టీస్పూను మునగాకు రసం, కొద్దిగా తేనె కలిపి తాగితే సరి. మూత్ర సమస్యలకీ మునగ బెస్ట్ మెడిసినే. ఆకుల్ని ముద్దలా చేసి క్యారెట్ రసంలో కలిపి పదిగంటలకోసారి తీసుకుంటే హానికర బాక్టీరియా, వైరస్‌లన్నీ తొలగిపోతాయి.
ఆకుల్ని కణతలకి రుద్దితే తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమలమచ్చలు, బ్లాక్‌హెడ్స్ మీద రాస్తే అవి మాయమై చర్మం మెరుస్తుంది. స్కర్వీ, చర్మవ్యాధులు, ఆందోళనలకి
మునగాకు టీ రుచికరమైన పరిష్కారం.
వహ్వా… మునక్కాడ!
సీజన్లో చిటారుకొమ్మ వరకూ చిగురు కనబడకుండా కాసిన కాయలు చూసేవాళ్లకి కన్నులపండగ అయితే, ఆ కాయల రుచి తెలిసినవాళ్లకి విందుభోజనమే. దక్షిణాదిన సాంబారు, పులుసు, అవియల్ వంటల్లో మునక్కాడ కనిపించాల్సిందే. ఇక, బియ్యప్పిండి, బెల్లం లేదా అల్లంవెల్లుల్లి వేసి వండే మునగగుజ్జు కూర ఎవరికైనా నోరూరాల్సిందే. మునక్కాడలతో పట్టే నిల్వ పచ్చడి మహారుచి. మటన్‌లో మునక్కాడ పడితే నాన్‌వెజ్ ప్రియులకి పండగే. ఆకులతో పోలిస్తే కాయల్లో పోషకాల శాతం తక్కువే. కానీ మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఎక్కువే.
‘ఈ ఒక్క మునక్కాడ తినవూ బోలెడు బలం’ అంటూ బామ్మలు బతిమిలాడి తినిపించడం చాలామందికి అనుభవమే. తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అది నిజమే. మునక్కాడల్లోని యాంటీబయోటిక్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తే; కాల్షియం, ఐరన్లు ఎముకబలాన్నీ బరువునీ పెంచుతాయి. రక్తంలో చక్కెర శాతాన్నీ తగ్గిస్తాయి. పిత్తాశయం యమా జోష్‌గా పనిచేస్తుంది.
శస్త్రచికిత్సానంతరం మునగాకునీ, మునక్కాడలనీ తింటే త్వరగా కోలుకుంటారని చెప్పడం తెలిసిందే. దానిక్కారణం మరేంటో కాదు, మునక్కాడల్లోని ఐరన్‌వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందట. మునక్కాడల్ని మరిగించిన నీళ్లతో ఆవిరిపట్టడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలూ తగ్గుతాయి. వీటిని ఉడికించిన నీరు తాగితే చర్మం మెరుస్తుందట.
‘తరచూ జలుబు చేస్తోందా… జ్వరమొస్తోందా… అయితే రోజూ మునక్కాడలు తినండొహో’ అంటూ చాటింపు వేస్తున్నారు ఆధునిక వైద్యులు. వాటిల్లోని విటమిన్-సి జలుబూ ఫ్లూ జ్వరాలకి ట్యాబ్లెట్లా పనిచేస్తుందట. వీటిని ఎక్కువగా తినేవాళ్లకి పొట్టలో నులిపురుగుల బాధ ఉండదు. ఈ ముక్కలను ఉడికించిన సూప్ డయేరియాకి చక్కని నివారణోపాయం. కీళ్లనొప్పులయితే పరారే. కాలేయం, ప్లీహ సంబంధిత వ్యాధులన్నీ హాయ్ చెప్పడానికే సందేహిస్తాయి.
‘ఏమోయ్… ఇంకా పిల్లల్లేరా… అమ్మాయిని మునక్కాయ కూర వండమనోయ్…’ అని ఏ పెద్దాయనో అంటే సరదాగా తీసుకోవద్దు. వీటిల్లోని జింక్ స్త్రీ, పురుషుల్లో వంధ్యత్వాన్ని తగ్గిస్తుంది. వీర్యం చిక్కబడుతుంది.
నియాసిన్, రిబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్, పైరిడాక్సిన్ వంటి బి-కాంప్లెక్స్ విటమిన్లు మునక్కాడల్లోనూ సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి సంక్లిష్ట పిండిపదార్థాలూ ప్రొటీన్లూ
జీర్ణమయ్యేలా చేస్తాయి.
ఏదేమైనా మునక్కాడలు ఎక్కువగా తినేవాళ్లలో రోగనిరోధకశక్తి ఎక్కువ. శ్వాససంబంధ సమస్యలు తక్కువ. వీటిల్లోని ప్రొటీన్లూ పీచూ కారణంగా పోషకాహార లోపమూ ఉండదు. నాడీవ్యవస్థా భేషుగ్గా పనిచేస్తుంది.
పూలు… తేనెలూరు..!
పచ్చదనంతో కళకళలాడే దీని ఆకులూ కాయలే కాదు, సువాసనభరితమైన తెల్లని పూలూ ఔషధ నిల్వలే. ఆయుర్వేద వైద్యంలో వాడదగ్గవే. పూలతో కాచిన కషాయం లేదా టీ పిల్లతల్లుల్లో పాలు బాగా పడేలా చేస్తుంది. ఇది మూత్రవ్యాధుల నివారణకూ దోహదపడుతుంది. ఈ పూలను మరిగించిన తేనీరు జలుబుకి మంచి మందు. కొన్ని ప్రాంతాల్లో ఈ పూలను సెనగపిండిలో ముంచి పకోడీల్లా వేస్తారు, కూరలూ చేస్తారు. మునగ పూలలో తేనె ఎక్కువ. దాంతో ఇవి తేనెటీగల్ని ఆకర్షించి, తేనె ఉత్పత్తికీ తోడ్పడతాయి.
విత్తనంతో నీటిశుద్ధి..!
విరగ్గాసిన కాయలు ఎండిపోయాయా… ఫరవాలేదు, ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. విటమిన్-సి పుష్కలంగా ఉండే వీటిని వేయించి పల్లీల్లా తినొచ్చు. నూనె తీయొచ్చు. దీన్ని వంటనూనెగానూ సౌందర్యసాధనంగానూ ల్యూబ్రికెంట్‌గానూ వాడుతుంటారు.
రక్షిత నీటి పథకాలు కరవైన ప్రాంతాలకు మునగ విత్తనాలే నీటిశుద్ధి పరికరాలు. కఠిన జలాల్ని సైతం ఈ గింజలు ఉప్పు లేకుండా తేటగా మారుస్తాయి. సూడాన్, ఇండొనేషియా వాసులు ఆ కారణంతోనే విత్తనాలను ప్రత్యేకంగా సేకరించి, ఆ గింజల్ని పొడిలా చేసి, కప్పు నీళ్లలో కలిపి, వడగడతారు. ఇప్పుడు ఈ నీళ్లను బిందెలోని నీళ్లలో కలిపి, ఓ ఐదు నిమిషాలు గరిటెతో కలుపుతారు. తరవాత ఓ గంటసేపు కదపకుండా ఉంచితే మలినాలన్నీ కింద పేరుకుని పైనున్న నీరంతా తేటగా అవుతుంది. వీటిని విడిగా పాత్రలో పోసుకుని తాగుతారు. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ పొడి కలిపిన ద్రవాన్ని నీటిలో కలపగానే అది పాలీ ఎలక్ట్రోలైట్‌గా పనిచేసి నీటిలోని మలినాలను అయాన్లుగా మార్చడం ద్వారా వాటిని ఆకర్షించి కింద పేరుకునేలా చేస్తుంది.ఇంకా… ఇంకా…!
మునగాకు మనుషులకే కాదు, పశువులకీ బలవర్థకమైనదే. పశువుల మేతగానూ పంటలకు ఎరువుగానూ వాడతారు. చెట్టు కాండం నుంచి వచ్చే గుజ్జుని కాగితం తయారీకి వాడతారు. ఆగ్రో ఫారెస్ట్రీకి మునగ చక్కగా సరిపోతుంది. పెద్దగా నీడ ఉండని ఈ చెట్ల మధ్యలో ఇతర పంటల్నీ వేసుకోవచ్చు. ఈ మొక్కల్ని కంచెలానూ పెంచవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీన్ని పెంచుతున్నా మునగ పంటలో మనదేశమే ఫస్ట్. ఏటా 13 లక్షల టన్నుల కాయల్ని పండిస్తున్నాం. రాష్ట్రాలకొస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మునగ ఉత్పత్తుల విలువ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.27వేల కోట్లు. వాటిల్లో 80 శాతం మనవే. కాయలతోబాటు పొడినీ
ఎగుమతి చేస్తున్నాం. కాయల్ని శీతలీకరించి చక్కెరపాకంలో వేసి ఎగుమతి చేస్తారు.
మునగలో రకాలనేకం. కుండీల్లో కాసే హైబ్రిడ్ రకాలూ ఉన్నాయి. జాఫ్నా రకం కాయలు 60 నుంచి 120 సెం.మీ. వరకూ కాస్తే, ఆరునెలలకే పూతొచ్చి, కాయలు కాసే కెఎం-1, పీకేఎం-1, పీకెఎం-2, పీఏవీఎం రకాలూ వస్తున్నాయి. నేలతీరు, వాతావరణాన్ని బట్టి ఆయా రకాలని ఎంపికచేసుకుని ఈ చెట్లను పెంచి ఎకరాకి కనీసం లక్ష రూపాయల లాభాన్ని పొందుతున్నారు రైతులు. వ్యవసాయపరంగానే కాదు,
ఇంటి అవసరాలకోసం పెరట్లోనో లేదంటే కుండీల్లోనో మునగను పెంచితే, రోజూ ఓ గుప్పెడు తాజా ఆకుల్ని కూరల్లో వేస్తే మీ ఆహారంలో సూపర్‌ఫుడ్ చేరినట్లే, మీకు డాక్టరుతో పనిలేనట్లే..!
మునగ గురించి ఇంతటి సమగ్రమైన సమాచారం అందించిన వారికి కృతజ్ఞతలు.