కరోనా కాటుకి కూలుతున్నరైతాంగం – పద్మ వంగపల్లి
కరోనా కాటుకి కూలుతున్నరైతాంగం
ఆరుగాలం శ్రమించే రైతుల పరిస్థితి ఎప్పుడూ అగమ్యగోచరమే. ప్రతి ఏడాది పరీక్షే. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి ప్రతిసారి ఓ ప్రయాసే. ప్రకృతి కన్నెర్ర చేయడం, విత్తనాలు మొలకెత్తకపోవడం, రుణ సౌకర్యం అందకపోవడం. పురుగులు, తెగుళ్ళు పంటను విద్వంసం చేయడం, అంతా బాగుంటే గిట్టుబాటుధర రాకపోవడం. ఇలా ఎప్పుడూవారి జీవితం వ్యధాభరిత గాధలమయమే.ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచమంతా, అతలాకుతలమవుతున్న వేళ ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ తో అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా వలస కార్మికులు, రైతులు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
ఆహార పంటలను ప్రభుత్వాలు కొనుగోలు చేస్తున్నామని చెప్తున్న, పూల రైతులు, ఉద్యాన పంటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొద్ది పంటనైనా అమ్ముకోలేని పరిస్థితి. కనీసం పండిన పంటను కోసే పరిస్థితి కూడా లేదు. కూలీ డబ్బులు కూడా చెల్లించలేని స్థితిలో భారీ నష్టాన్ని చవిచుస్తున్నారు. ఆ నష్టాలను తట్టుకునే స్థితి లేక ఆత్మ హత్యలకు కూడా పాల్పడుతున్నారు.
చిన్న, సన్న కారు రైతులు, రోజు వారీ తమ పంటను మార్కెట్లో అమ్ముకునే రైతులు పూర్తిగా దివాళా తీసారు. పండిన పంటను, పూలు, పండ్లను అమ్ముకోలేక రవాణా సౌకర్యం లేక, పంటను కోయడానికి కూలీలు దొరకక, దొరికినా వారికి కూలీలు చెల్లించే ఆర్థిక స్థోమత లేక పూలు, పండ్లు, కాయగూరలు అలాగే వదిలేస్తున్న హృదయ విదారక దృశ్యాలు మనల్ని కలచి వేస్తున్నాయి. కరోనా బారిన పడకుండా కాపాడుకోవడం ఒక పరీక్షయితే, పండిన పంటను కాపాడుకోవడం, వీలయితే అమ్ముకోవడం మరో పరీక్షగా మారింది. ఇలాంటి స్థితిలో రైతులు దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడ్డారు.
ఈ పరిస్థితి కేవలం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే పరిమితమై లేదు. ఇది దేశ వ్యాప్త సమస్య. ప్రభుత్వం ఎన్ని పథకాల గురించి మాట్లాడినా, వ్యవసాయ రంగానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నామని చెప్తున్నా, ధాన్యం కొనుగోలుకు ప్రత్యెక ప్రణాళికలు రూపొందించామని మాట్లాడుతున్నా, అవి రైతుల వరకు పూర్తిగా చేరలేవనేది వాస్తవం.
ఇదే సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పంట కోసి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూసే, రైతుల ఆశల మీద నీళ్ళు చల్లింది. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకోలేక, అమ్ముడు పోతుందో లేదో తెలియక వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ స్థితిలో సహనం నశించిన రైతులు ఆగ్రహంతో అక్కడక్కడా పంటను తగులబెట్టిన సంఘటనలు కూడా మనం చూసాం.
కరోనా కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. పంట రుణాలు మాఫీ చేయాలి. ప్రత్యెక పాకేజీ ప్రకటించి, తదుపరి సాగుకు వారికి రుణ సదుపాయాన్ని అందించాలి.
అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కూరగాయలు, పండ్ల లాంటి వాటిని రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసి, వినియోగదారులు నేరుగా అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వరిలాంటి తిండి గింజలు అవసరానికి సరియా సరిపడా వున్నాయని ప్రభుత్వం లెక్కలు చెప్తోంది. కాబట్టి, వానాకాలం పంటల విషయంలో ప్రభుత్వం ప్రత్యెక దృషి సారించి ఇతరత్రా పంటలను, తక్కువ పెట్టుబడి అవసరమయ్యే పంటలను వేసేందుకు రైతులను ప్రోత్సహించాలి. అవగాహన కల్పించాలి.
Tag:కరోనా కాటు