కంపోస్టు తయారీ – సుస్థిర వ్యవసాయ కేంద్రం
భూమిలో సారం పెంచుకోవటానికి మట్టిలో జీవపదార్థాన్ని పెంచుకోవాలి. అది ఎకరానికి ప్రతి పంటకాలానికి కనీసం 1-2 టన్నులు వుండాలి. ఇందుకోసం పంట వ్యర్థాలను కానీ, మొక్కల/ చెట్ల ఆకులను కానీ వాడుకోవచ్చు. జీవ పదార్థాన్ని భూమిని కప్పి వుంచటానికి వాడుకోవాలి. జీవ పదార్థం లేకుండా కేవలం పంచగవ్య, జీవామృతం లాంటివి వాడుకుంటే ఉపయోగం ఉండదు.
సేంద్రియ పదార్థాలు సూక్ష్మజీవుల చర్య ద్వారా కుళ్ళి పోషకాలు విడుదల వుతాయి. ఈ చర్య సహజంగా జరగటానికి చాలా నెలలు పడుతుంది. కుళ్ళే ప్రక్రియ చాలా త్వరగా జరగటానికి అనువైన పరిస్థితులు కల్పించడాన్ని కంపోస్టింగ్ పద్ధతి అంటారు. అలా తయారైన ఎరువును కంపోస్టు ఎరువు అంటారు.
కంపోస్టింగ్కు అనువైన పరిస్థితులు:
పంట వ్యర్థాల ఎంపిక:
పంట వ్యర్థాలలో ఉండే కర్బన, నత్రజని మోతాదులను బట్టి కుళ్ళటానికి పట్టే సమయం ఆధారపడుతుంది. కర్బన, నత్రజని నిష్పత్తి ఏ పంట వ్యర్ధాలలో తక్కువ ఉంటుందో అది త్వరగా కుళ్ళుతుంది.
ఉదా || గడ్డి ఆకులు, గ్లైరిసీడియా లేత కొమ్మలు, ఆకులు, ఆహార పదార్థాలు, పప్పుజాతి మొక్కల ఆకు, కొమ్మల భాగాలు, పేడ మొదలైనవాటిలో నత్రజని మోతాదు ఎక్కువ ఉండటం వల్ల అవి త్వరగా కుళ్ళుతాయి.
కర్బన, నత్రజని నిష్పత్తి ఏ పంట వ్యర్థాలలో ఎక్కువ ఉంటుందో అవి త్వరగా కుళ్ళవు.
ఉదా || చెక్క, రంపపుపొట్టు, వరిగడ్డి
కనుక కంపోస్టు 3-4 నెలలలో తయార వ్వాలంటే నత్రజని మోతాదు ఎక్కువ ఉన్న పంట వ్యర్థాలను ఎన్నుకోవాలి.
మొదటి పద్ధతి:
1. కంపోస్టు దిబ్బలో ఎక్కువ కర్బన పదార్థాలు (ఎండు పుల్లలు వంటివి) ఎక్కువగా ఉన్నట్లయితే, నత్రజనిని దిబ్బకు అందించడం వల్ల త్వరగా కుళ్ళుతుంది. నత్రజని పశువుల మూత్రంలో ఉంటుంది కనుక మూత్రాన్ని చల్లితే మంచి ప్రయోజనం ఉంటుంది.
2. పంట వ్యర్థాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి దిబ్బలో వేయటం వల్ల త్వరగా కుళ్ళి ఎరువు తయారవుతుంది.
3. దిబ్బలో ఎప్పుడూ తగినంత తేమ ఉండాలి. తేమ ఉండటం వల్ల సూక్ష్మజీవులు అధికంగా వృద్ధిచెంది వ్యర్థపదార్థాలు త్వరగా కుళ్ళుతాయి. ఎట్టి పరిస్థితుల లోనూ దిబ్బలో నీరు నిల్వ ఉండకూడదు. ఇందుకోసం దిబ్బ అడుగులో రాళ్ళు, పెంకులు వంటివి వేయటం వల్ల ఎక్కువైన నీరు నిల్వ ఉండకుండా జారిపోతుంది. నీరు నిల్వ ఉన్నట్లయితే ఆ భాగానికి గాలి అందదు. గాలి అందనప్పుడు వేరే రకమైన సూక్ష్మజీవులు (ప్రాణవాయువు ఆక్సిజన్ అవసరం లేనివి) పెరుగుతాయి. తెగుళ్ళకు సంబంధించిన సూక్ష్మజీవులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దిబ్బ నుండి కంపు మొదలవుతుంది.
4. తేమ త్వరగా కోల్పోకుండా ఉండటానికి దిబ్బను చెట్ల నీడలో వేసుకోవాలి.
రెండవ పద్ధతి:
గ్రామాల్లో రైతులు పశువుల పేడను, వ్యవసాయ వ్యర్థ పదార్థాలను కుప్పలుగా వేస్తారు. అలా చేయడం వలన అది ఎండకు ఎండి, వానకు తడిసి సహజ పోషకాలను చాలా వరకూ కోల్పోతుంది. రైతులు కొంత శ్రమపడి సేంద్రియ పదార్థాలను సేకరించుకోవాలి.
రెండు మీటర్ల వెడల్పు, ఒక మీటరు లోతు మరియు తగినంత పొడవుతో గొయ్యి తీయించాలి. అందులో సేంద్రియ వ్యర్ధ పదార్థాలను ఆరు అంగుళాల మందం వరకూ నింపి దానిపై పేడ నీటిని, పశు మూత్రాన్ని చల్లాలి. ఆపై సూపర్ పాస్ఫేట్ను చిలకరించి, తిరిగి ఇంకొక 6 అంగుళాల మందం వరకూ మరల సేంద్రియ పదార్ధాలను నింపాలి. తిరిగి పేడ నీటిని, పశు మూత్రాలను చల్లి ఆపై సూపర్ పాస్ఫేట్ను చిలకరించాలి.
ఈ విధంగా సేంద్రియ పదార్థాలను పొరలుగా అమర్చిన తర్వాత అందులో తేమను 60 శాతానికి పెంచి భూమి కంటే కొంచెం ఎత్తు వరకూ కూర్చి, గాలి పోకుండా పేడతో పూత పూయాలి. సూక్ష్మజీవుల చర్య ద్వారా గొయ్యిలో వేసిన సేంద్రియ పదార్థాలు కుళ్ళి సుమారు 90-100 రోజులలో మంచి సారవంతమైన కంపోస్టు తయారవుతుంది. గొయ్యిలో ఉత్పన్నమైన వేడిమికి (40-50 డిగ్రీల సెంటీగ్రేడ్) అందులోని శిలీంధ్రాలు, రోగకారక క్రిములు, క్రిమికీటకాదులు నశిస్తాయి.
Tag:కంపోస్టు తయారీ