ఏటికి ఎదురీదుతూ…
గొడిశాల భాగ్యమ్మ 3 ఎకరాల రైతు, మరొక 6 ఎకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నది. అమెది వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామం. ఆమె కుటుంబానికి 3 లక్షల అప్పు వుంది.. 6 గురు కుటుంబ సభ్యుల పోషణ, ముగ్గురి పిల్లల చదువు ఖర్చు, ఆరోగ్యం ఖర్చులు, ఈ ఒత్తిడి తట్టుకోలేక భాగ్యమ్మ భర్త మూడేళ్ళ క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.
అంతకు ముందు అప్పు తీర్చటంకోసమని ఇష్టం లేక పోయినా వాళ్ళు పశువులను అమ్మేశారు. నిండా నీళ్ళు పొయ్యని బోరుతో మొత్తం 9 ఎకరాలలో పత్తి, వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తే 30 వేలు కూడా చేతికి రాని పరిస్థితి. 6 ఎకరాలకు 12 వేలు కౌలు చెల్లిస్తే మిగిలినదానితో అప్పు తీర్చే దారి కనబడని ఈ బక్క రైతుకు ఆత్మహత్యే శరణ్యమనిపించింది. భాగ్యమ్మ వరంగల్లో పిల్లల వైద్యం కోసం ఆసుపత్రిలో వుండగా భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
30 ఏళ్ళు కూడా నిండని వయసులో భాగ్యమ్మ భర్త చనిపోతే, బెంబేలెత్తి కాడి క్రింద పడేయ్యలేదు. భర్త చెయ్యలేని వ్యవసాయం నేనెట్లా చేస్తానని దిగులు పడలేదు. చిన్నప్పుడు తల్లి తండ్రులు, తర్వాత భర్త చనిపోతే చచ్చే దాకా మనమే చెయ్యాలి. ‘బతకాలంటే కష్టపడాలే అంటుంది’ భాగ్యమ్మ. భర్తకు రావలసిన నష్టపరిహారం కోసం ఏళ్ళ తరబడి ఎం.ఆర్.ఓ. ఆఫీసు చుట్టూ తిరుగుతూనే వుంది.
భాగ్యమ్మ 7వ తరగతి వరకు చదువుకుంది. కొద్దిగా చదవ గలదు, రాయగలదు. గుండె నిండా ధైర్యం వుంది. తన ముగ్గురి పిల్లల సాయంతో ఇరుగు పొరుగు రైతుల సహకారంతో సేద్యం సాగిస్తున్నది.. సైకిల్ పైన పొలం వెళుతుంది. చేను ఇంటికి దూరంగా వుంది. నడిచి వెళ్ళటం కష్టమని సైకిల్ తొక్కటం నేర్చుకుంది. సైకిల్ పైనే విత్తనాలు, ఎరువుల బస్తాలు తీసుకువెళుతుంది. తిరిగి వచ్చేటప్పుడు కట్టెల మోపు పెట్టి ఇంటికి తెస్తుంది. సెలవు రోజుల్లో ముగ్గురు పిల్లలూ పొలంలో పని చేస్తారు. ఇదే నిజమైన కుటుంబ వ్యవసాయం. ఏడాదిలో 365 రోజుల్లో పొలం పని చేస్తుంది. దుక్కి దున్నటం లాంటి తనకు చేతకాని పనులను కిరాయికి నాగలి తెచ్చి దున్నిస్తుంది. రాత్రి 3 గంటలకు వచ్చే కరెంటు, బోరు నీళ్ళతో చేను గొంతు తడపాలి. 13 ఏళ్ళ కొడుకు రానంటే సముదాయించి సాయం తీసుకుని వెళ్ళి పొలంలో గడ్డి పరుపు చేసుకుని పడుకుంటుంది.
బ్యాంకు లోన్లు అందవు. షాపుకారు దగ్గర, డీలర్ల దగ్గర అప్పులు తెస్తుంది. గంటల తరబడి లైన్లో నిలబడి ఎరువులు, పత్తి గింజలు తెస్తుంది. యూరియా, పొటాష్ వేసిన చేను సౌడు బారివెక్కిరిస్తుంది. నకిలీ పత్తి గింజలు మొలవకుండా మొరాయిస్తాయి. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత అమ్మబోతే దళారుల మోసం. చేతికి పైసలు రావు. ఇంతా చేస్తే ఆ మూడు ఎకరాల భూమీ ఆమె పేరు మీద పట్టా కాలేదు. ఇంకా మామ పేరు మీద వుంది. భర్త చనిపోయిన తర్వాత కష్టపడి వ్యవసాయం చేసి లక్ష రూపాయల అప్పు తీర్చింది. ”నా కష్టాలు అందరి రైతులు పడే కష్టాలు లాంటివే. కానీ ఒక ఆడదాన్నిగా మరింత కష్టం. ఇంట్లో ఐదుగురి పోషణ, ముగ్గురి పిల్లల చదువులు, ఆసుపత్రి ఖర్చులు – ఈ పనులన్నీ చూసుకుంటూ వ్యవసాయం చెయ్యాలె. అప్పులు తీర్చాలె. ఏ ఇబ్బంది వచ్చినా నేనే వుర్కాలె అంటుంది భాగ్యమ్మ.
భర్త చనిపేయిన తర్వాత పత్తి పంట వెయ్యటం మానేసి చిక్కుళ్ళు, పెసర, వరి, మొక్కజొన్న సాగు చేస్తున్నది. చిన్న రైతులు పెట్టుబడి ఎక్కువగా వుండే పత్తి పంట కాకుండా తక్కువ పెట్టుబడుల పంటలు, కుటుంబానికి తిండినిచ్చే పంటలు వెయ్యాలి అని అంటున్నది. భాగ్యమ్మ మాటల్లో వ్యవసాయం అంటే సాయమే, చాలా కష్టాలు వున్నాయి. అయినా చెయ్యాలె. చెయ్యాలంటే ధైౖర్యం కావాలె. చెయ్యకుంటే బతుకు లేదు. అప్పులున్నాయని కుంగి పోవద్దు. రైతులు ధైర్యంగా ఉండాలే.
ఒంటరి మహిళలుగా వ్యవసాయం చేస్తున్న వారికే కాదు చిన్న రైతులందరికీ భాగ్యమ్మ మాటలు దారి చూపుతాయి.
Tag:ఒంటరి మహిళ