“ఉపాధిహామీ పథకం హక్కులు”
గ్రామీణ శ్రామికులకు ఒక ఆర్ధిక సంవత్సరంలో 100 రోజులు పని కల్పించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మన రాష్ట్రం దేశంలోనే ముందుందని కేంద్ర మంత్రులు పొగుడుతుండటం మనం చూస్తూవుంటాం. ఇది కొంతవరకు నిజం కూడా. పథకం అమలులో గ్రామీణా భివృద్ధిశాఖ ఏర్పాటు చేసిన విధి విధానాలు, పద్ధతులు, సమాచారం అందుబాటు, పారదర్శకత వంటి అంశాలలో పలు రాష్ట్రాల కంటే మన రాష్ట్రం చాలా ముందుంది. శ్రమశక్తి సంఘాలు, వికలాంగుల శ్రమశక్తి సంఘాలు, దళిత, ఆదివాసీల భూమి అభివృద్ధి పనులను పథకంతో అనుసంధానం చేయడం, వేతనాలు సక్రమంగా అందించేందుకు చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు నిజంగానే అభినందనీయం. అంతేకాదు, ఉపాధి హామీ పథకం ”వెబ్సైట్”, దాని ద్వారా పౌర సమాజానికి అందుబాటులో వుంచిన సమాచార నిధి, సామాజిక తనిఖీ ప్రక్రియ, ఇంచుమించుగా అన్ని దశలను ”ఆన్లైన్”తో అనుసంధానం చేసిన పద్ధతి శ్లాఘనీయం. ఇదంతా ఒక్కరోజులో, ఒక్క వ్యక్తితో జరిగింది కాదు. ఒక వ్యవస్థగా గ్రామీణాభివృద్ధి శాఖ కృషి, ఆ కృషిని జరగనిచ్చేందుకు వెసులుబాటు ఇచ్చి, అటువంటి అధికారులనే ఆ శాఖకు నియమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం అభినందించాలి. ఈ విషయంలో మాత్రం వారు రాజకీయ సంకల్పాన్ని ప్రదర్శించారు. గ్రామీణ ప్రాంతాలలో సాంఘిక అసమానతలు, అధికార పార్టీలపై ఆ పార్టీకి చెందిన గ్రామీణ ప్రాంత పెత్తందార్లు, దళారీలు తెచ్చే వత్తిడిని గూర్చి అవగాహన వున్నవారే ఈ ”సంకల్పం” విలువను గ్రహించగలరు.
ఇది పథకానికి ఒక పార్శ్వం. నాణానికి రెండవ వైపు కూడా వుంది. ఇది అత్యంత ముఖ్యమైన హక్కుల కోణానికి సంబంధించినది. ఈ రెండవ అంశాన్ని చర్చించడమే ఈ వ్యాసం లక్ష్యం. గత ఉపాధి పథకాలు కేవలం కార్య నిర్వాహక ఆదేశాలు మాత్రమే. కానీ ఈ పథకంలో ముఖ్యమైన అంశం ఉపాధి (పని)ని, వేతనాల (కూలీ)ను ఒక హక్కుగా గుర్తించడం. అందుకే ఇది గత పథకాలకు భిన్నమైనది.
”ఉపాధి, వేతనం” అనే రెండు హక్కుల అమలు తీరును పరిశీలిద్దాం. హక్కుకు చట్టబద్దమైన రక్షణ హామీ వుంటేనే అది నిజమైన అర్థంలో ‘హక్కు’ అవుతుంది. ఆ హక్కుకు భంగం కల్గినప్పుడు, నష్ట పరిహారం, తిరిగి పునరుద్ధరించే ఏర్పాటు విధిగా వుండాలి. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు న్యాయ వ్యవస్థా, మానవ హక్కుల కమీషన్లు అటువంటి రక్షణ వ్యవస్థలుగా వున్నాయి. మరి ఉపాధి హామీ చట్టంలోని ఉపాధి, వేతనాల హక్కులకు రక్షణ, హామీ లేమిటి?
ఉపాధి చట్టం రెండు రూపాలలో ఈ హక్కులకు హామీ పడింది. అదేమిటంటే ”నిరుద్యోగ భృతి”, ”నష్టపరిహారం”. అవేంటో వివరంగా చూద్దాం. ఒక ఆర్థిక సంవత్సరంలో జాబ్ కార్డు పొందిన ఒక కుటుంబం 100 రోజుల పనిని, ఆ పరిమితికి లోబడి వారు హక్కుగా పొందగలరు. తమకు ఆ పని కావాలని అభ్యర్థిస్తే 15 రోజుల గడువులో ”ఉపాధి” లభిస్తుంది. ఇప్పుడు కాదు రాబోయే రోజులలో (1 ఏప్రిల్ – మార్చి 31 మధ్య) పని కావాలంటే, రైల్వే రిజర్వేషన్ మాదిరిగా ముందస్తు అభ్యర్థన కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఈ 15 రోజుల కాల పరిమితి అందులో కలిసిపోతుంది. ఇదంతా బాగుంది. మరి! అభ్యర్థించిన 15 రోజులలో పని ఇవ్వకపోతే? ఆ హక్కు ఉల్లంఘనకు బాధ్యతగా ప్రభుత్వం ”నిరుద్యోగ భృతి”ని చెల్లిస్తుంది. 15 రోజుల గడువు తరువాత మొదటి 30 రోజులకు దిన వేతనంలో 25 శాతం, ఆ తదుపరి 50 శాతం 100 రోజుల లెక్క వరకు లేదా పని కల్పించేంత వరకు చెల్లిస్తుంది. ఇది ఉపాధికి ఇచ్చిన రక్షణ లేదా హక్కు ఉల్లంఘనకు పరిహారం.
ఉపాధి పనుల్లో వారాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఆ వారం వేతనాన్ని 7 నుండి 15 రోజుల వ్యవధిలో చెల్లిస్తామని, ఒకవేళ అందులో విఫలమైతే పనివారల నష్ట పరిహార చట్టం అనుసరించి ఆలస్యానికి ”నష్టపరిహారం” చెల్లిస్తామని చట్టం చెపుతుంది. ఈ విధంగా ‘ఉపాధి’, వేతనాల’ హక్కుకు చట్టం హామీ కల్పించింది. ఇంత వరకు బావుంది. అసలు సమస్య ఏమిటంటే ఏ చట్టమూ దానంతట అది రోజు వారి కార్యాచరణలోకి రాదు. అలా రావాలంటే ఆ చట్టానికి కార్యవర్తనాలు లేదా నియమాలను రూపొందించాలి. ఉపాధి హామీ చట్టం అమలుకు నియమాలను రూపొందించవలసింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే. మన రాష్ట్రం కూడా అటువంటి నియమాలను 2006లో ప్రకటించింది. ముందు ప్రస్తావించుకున్న చట్టంలోని రెండు హక్కులు, వాటి హామీలు ఆంధ్రప్రదేశ్ నియమాలలో ఏ విధంగా ప్రతిఫలించాయి, వాటి ఆచరణాత్మక అనుభవాలేమిటో ఇప్పుడు చూద్దాం.
ఉపాధి పని కావాలని ”కోరడం” అంటే అర్థం ”దరఖాస్తు” చేయాలని. దరఖాస్తు చేస్తే సరిపోదు, దానికి రశీదును సంబంధిత అధికారి నుండి అర్జీదారు పొందగలగాలి. దరఖాస్తు ఇచ్చి 15 రోజులు గడిచినా పని ఇవ్వకపోతే ఆ విషయం నిరూపించడానికి ఇది కావాలి. దరఖాస్తు ఇస్తే రశీదు ఇచ్చే సాంప్రదాయం మన పాలనా వ్యవస్థకు లేదు. గట్టిగా అడిగితే రిజిష్టరు పోస్టులో పంపుకోండని అంటారు. అసలు ”కాగితం, కలం, దరఖాస్తు” పట్టణ, నగర సంస్కృతి. గ్రామీణ, ఆదివాసీలది మౌఖిక సాంప్రదాయం. ఈ దరఖాస్తు, రశీదులను గూర్చి గ్రామీణ శ్రామికులకు చెప్పేవారు, వాటిని పొందేందుకు వారికి సహకరించేవారేరీ?
అయితే ఉపాధి హామీ చట్టం ప్రకారం పని ”కోరిన” (అంటే దరఖాస్తు చేసిన) వారికే పని ఇవ్వాలి. అది చట్టం. ఇందుకోసం గ్రామీణాభివృద్ధి శాఖ ఒక తమాషా చేస్తుంది. తాను ఎంత మందికి పని ఇచ్చిందో అంతమందే తనను పని కోరారని చెపుతుంది. అప్పుడు పని కోరి, అది లభించని వారు ఒక్కరూ వుండరు. ఆ కారణంగా నిరుద్యోగ భృతి చెల్లింపనే సమస్యే రాదు. 2006 నుండి కొన్ని జిల్లాలలో, 2008 ఏప్రిల్ 1 నుండి రాష్ట్రం అంతటా ఈ పథకం అమలౌతుంది. మరి, ఇన్ని సంవత్సరాలలో ఒక్కరంటే ఒక్కరు కూడా దరఖాస్తు చేసి పని లభించని వారు లేరా?
రెండు ఉదాహరణలను చూద్దాం. ఒకటి తెలంగాణా ప్రాంత దళితులది, మరొకటి ఆంధ్ర ప్రాంత ఆదివాసీలది. మెదక్ జిల్లా దౌల్తాబాదు మండలంకు చెందిన తిరుమలపూరు, చినకోడూరు మండలం గుర్రాలగొంది, రాముని పట్ల, సికింద్రాపూరు పంచాయితీలలో 2007-2008 సంవత్సరంలో 798 మంది పని కోరగా వారందరికీ పని కల్పించినట్లుగా ప్రభుత్వ వెబ్సైట్ చెపుతుంది. ఇది నిజం కాదు. ఆ పంచాయితీలకు చెందిన 114 దళిత కుటుంబాలు పనులకు దరఖాస్తు చేసినా వారికి పని ఇవ్వలేదు, నిరుద్యోగ భృతీ ఇవ్వలేదు. దళిత బహుజన ఫ్రంట్ (డి.బి.ఎఫ్) అనే ప్రజా సంఘం నాలుగు సంవత్సరాల పాటు నిరంతరాయంగా తెచ్చిన వత్తిడితో 2011-12లో ఆ కుటుంబాలకు 1,90,000 రూ||లు నిరుద్యోగ భృతిగా చెల్లించారు. రాష్ట్రంలో అదే మొదటి, ఆఖరి కేసు.
ఇక విశాఖ జిల్లా చింతపల్లి మన్య ప్రాంతంలో అంజలి శనివారం పంచాయితీకి చెందిన 636 ఆదివాసీ కుటుంబాలు పని కోరగా పని కల్పించినట్లు 2011-12 గణాంకాలు చెపుతున్నాయి. అదే పంచాయితీ జంగం చెట్టు గ్రామం, ఆదిమ తెగ ఆదివాసీలకు చెందిన 60 కుటుంబాలు పని కావాలని దరఖాస్తు చేసారు. పని లేదు నిరుద్యోగ భృతీ లేదు. దీనిపై వారు ఆ పథకం డైరెక్టర్ వద్ద పెట్టుకున్న దరఖాస్తు ఇంకా అపరిష్కృతంగా ఉంది. 15 రోజులలో ఉపాధి కల్పించని వారికి నిరుద్యోగ భృతి వేతనం ఇవ్వనప్పుడు, వారికి నష్టపరిహారం ఇవ్వనప్పుడు పని, వేతనం హక్కులు ఎలా అవుతాయి? అప్పుడు పనికి ఆహారం పథకంకు, ఉపాధి హామీ పథకానికి సారాంశంలో తేడా ఏమిటి? పార్లమెంట్ చట్టానికి గల పవిత్రత ఏమిటి?
ప్రభుత్వ అలసత్వానికి రెండు కారణాలు ఉండవచ్చు. 1. ఉపాధి, వేతనాలను ఒక హక్కుగా ఇవ్వడం వారికి ఇష్టం లేకపోవడం, లేదా నిరుద్యోగ భృతి వ్యయాన్ని రాష్ట్రం భరించవలసి ఉండటం. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించింది. గ్రామీణ శ్రామికులు, ఉపాధి శాఖకు మధ్య అంబుడ్సుమెన్లను నియమించమంది. విశాఖ జిల్లా అంబుడ్సుమెన్ వద్ద జి.మాడుగుల, చింతలపల్లి, ఆదివాసీ శ్రామికులు నిరుద్యోగ భృతి, నష్ట పరిహారాల కోసం వేసిన 40 కేసులలో ఎలాంటి విచారణా లేదు. ఉపాధి హామీ పథకం నిర్వహణ, అమలులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ అంశాలలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటూ వస్తున్నది. ఇప్పుడిప్పుడే ”దిద్దుబాటు” చర్యలకు సిద్ధం అయింది. ఇది శుభపరిణామం. 2012 నవంబర్ 11న ఉపాధి పని కొరకు అభ్యర్ధనల నమోదు, నిరుద్యోగ భృతి చెల్లింపు నియమాలను జీ.వో నెం. 368 ద్వారా మొదటి సారి ప్రకటించింది. ఈ ఉత్తర్వులలో 5 అధ్యాయాలు, 16 సెక్షన్లు వున్నాయి. 2వ అధ్యాయంలో పనికి దరఖాస్తు చేయడం, వాటిని క్షేత్ర సిబ్బంది సేకరించి, రశీదులు ఇవ్వడం గూర్చి, 3వ అధ్యాయం నిరుద్యోగ భృతి చెల్లింపు గూర్చి వివరిస్తుంది. దరఖాస్తు అందిన 15 రోజులలో పని కల్పించక పోతే మండల ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం.పి.డి.ఓ నిరుద్యోగ భృతిని చెల్లించాలని సెక్షన్-8 చెబుతుంది.
మండల ప్రోగ్రామ్ అధికారి నిర్ణయంతో విబేధించేవారు జిల్లా ప్రోగ్రామ్ అధికారి (అనగా కలెక్టర్)కి ఫిర్యాదు చేసుకోవచ్చు, ఆ ఉత్తర్వులపై పథక సంచాలకుల వద్ద అప్పీలు దాఖలు చేసుకొనే అవకాశం కల్పించారు. దరఖాస్తుల పరిష్కారానికి మండల, జిల్లా ప్రోగ్రామ్ అధికారులకు 15 రోజులు, పథక సంచాలకులకు 30 రోజుల సమయం నిర్ధేశించారు.
పి.ఎస్. అజయ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ (ఎ.పి.వి.వి.యు) – రాష్ట్ర కార్యదర్శి
Tag:హక్కులు