ఉత్తరేణి
ఉత్తరేణి
ఉత్తరేణి సుమారు 1-1.5 మీటర్ల ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. ఈ మొక్క అంతా సన్నని నూగు ఉంటుంది. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. ఆకులు అండాకారంలోగానీ, కొంచెం దీర్ఘ వృత్తాకారంలో గానీ వుంటాయి. పత్ర వృతం చాల చిన్నదిగా ప్రధాన కాండానికి అంటుకొని ఉంటుంది. పుష్పాలు చిన్నవిగా లేత ఆకు పచ్చరంగులో ఉంటాయి. అక్కడక్కడ లేత ఎరుపు రంగు చారలు కలిగి ఉంటాయి. పుష్పాలు కాండం చివర పొడవైన కంకిపైన ఏర్పడతాయి. పుష్పాల చివరి భాగం ముండ్ల మాదిరిగా ఉంటాయి. ఫలంలో ఒక చిన్న విత్తనం ఉంటుంది. ఉత్తరేణి అన్ని పొలాలలోను, గట్లపైన, తేలికపాటి నేలలలోను, (ముఖ్యంగా ఎర్ర నేలలు) కలుపు మొక్కగా పెరుగుతుంది.
ఉత్తరేణి మొక్కలో వున్న ”ఎక్డైస్టిరోన్” అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా పనిచేస్తుంది. దీని వల్ల కీటకములు ముఖ్యంగా పంటలకు నష్టం కలిగించే ”లార్వాలు” ఒక దశ నుంచి వేరొక దశలోకి మారేందుకు (మోల్టింగ్) అవరోధకంగా పని చేస్తుంది. ఈ మోల్టింగ్ ప్రక్రియ (కుబుసము విడుచుట) కీటకాలకు చాల ముఖ్యమైన జీవన విధానం. ఈ పద్ధతి ద్వారానే పురుగులు తమ జీవిత చక్రాన్ని పూర్తి చేసుకొంటాయి. (రెక్కల పురుగు దశ, గ్రుడ్డు దశ, లార్వా దశ మరియు కోశస్థ దశ)
ఉత్తరేణి కషాయానికి పంటల నాశించు శిలీంద్రాలను నివారించే గుణం వుందని డా|| రమేష్ లండన్ కర్ (1990 కర్ణాటక) పరిశోధనలు తెలుపుతున్నాయి. పంటల నాశించు ”కాయకుళ్ళు” తెగులును నివారించే గుణం ఉత్తరేణి కషాయానికి వుందని, తెగులు కలిగించు శిలీంద్ర యొక్క జీజాలలో (స్పోర్స్) మొలకెత్తే శక్తిని నివారిస్తుందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. (జాకీర్ హుస్సేన్, 2005)
ఉత్తరేణి ఆకులను ”పంచపత్ర కషాయం”లో కూడా వుపయోగించవచ్చు. అనేక ప్రయోజనాలు వున్న ఉత్తరేణి మొక్కలను రైతులు ఒక కలుపు మొక్కగా భావించక, సేంద్రియ వ్యవసాయంలో సస్యరక్షణ కొరకు వినియోగించుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
Tag:ఉత్తరేణి