ఆలుగడ్డ – సుస్థిర వ్యవసాయ కేంద్రం
వాతావరణం:
చల్లని వాతావరణం అవసరం. పగటి ఉష్ణోగ్రత 320 సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 15-200 సెల్సియస్ మధ్య చాలా అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలో దుంపల పెరుగుదల వుండదు.
నేలలు:
నీటి పారుదల మరియు మురుగు నీటి వసతిగల ఇసుక లేక ఎర్రగరప నేలలు అనుకూలం. పి.హెచ్. 5.2-7 వుండి ఆమ్ల లక్షణాలు గల నేలలు, బరువైన నేలలు దుంపల పెరుగుదలకు అనుకూలం కాదు.
ఆలుగడ్డలో మంచి రకాలు
కుఫ్రీ లాలిమ:
మొక్కలు మధ్యస్థ పొడవుతో, ఆకుపచ్చ ఆకులు కలిగి వుంటాయి. దుంపలు మధ్యస్థంగా, గుండ్రంగా లేత ఎరుపు రంగులో వుంటాయి. 90-140 రోజుల్లో కోతకు వచ్చి, ఎకరాకు 11-12 టన్నుల దిగుబడి నిస్తుంది.
కుఫ్రీ బాద్షా:
మొక్కలు మధ్యస్థ పొడవుగా వుండి పాకే లక్షణం కలిగి వుంటాయి. ఆకులు లేత ఆకుపచ్చ రంగులో వుంటాయి. దుంపలు మధ్యస్థంగా వుండి, గుండ్రంగా తెల్లగా వుంటాయి. 90-140 రోజుల్లో కోతకొచ్చి ఎకరాకు 10-11 టన్నుల దిగుబడినిస్తుంది.
కుఫ్రీ చంద్రముఖి:
మొక్క కొంత వరకు పాకే లక్షణాన్ని కలిగి వుంటుంది. ఆకులు వెడల్పుగా వుండి దుంప పెద్దగా గుండ్రంగా వుంటుంది. దుంప పైపొర గోధుమ రంగులో వుండి, కళ్ళు పైపైన వుంటాయి. కండ లేపసుపు రంగులో వుంటుంది. 90-100 రోజుల్లో ఎకరాకు 10 టన్నులు దిగుబడినిస్తుంది.
కుఫ్రీ సింధూర్:
మొక్కలు నిలువుగా, ఆకులు చిన్నవిగా వుంటాయి. దుంపలు మధ్యస్థంగా, గుండ్రంగా కళ్ళు తక్కువగా వుండి, లోతుగా వుంటాయి. కండ లేత పసుపు రంగులో వుంటుంది. 110 రోజుల్లో కోతకు వచ్చి, ఎకరాకు 9-10 టన్నుల దిగుబడినిస్తుంది. లేట్ బ్లైట్ తెగులును తట్టుకొంటుంది. మన రాష్ట్రంలో పండించటానికి మరియు నిల్వ చేయటానికి అనువైన రకం.
విత్తనశుద్ధి :
విత్తనం ద్వారా ఆలుగడ్డ వేసుకున్నప్పుడు విత్తనశుద్ధి తప్పకుండా పాటించాలి.
పంటకాలం:
రబీ కాలం సాగుకు అనుకూలం. అక్టోబరు రెండవ పక్షం నుండి నవంబరు మొదటి వారం వరకు నాటుకోవచ్చు. కొన్ని పరిస్థితులలో ఖరీఫ్ పంటలు దెబ్బ తిన్నప్పుడు సెప్టెంబరు ఆఖరులో కూడా నాటుకోవచ్చు.
నేల తయారీ:
నేలను 4-5 సార్లు దున్ని, ఎకరాకు 10-12 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్ని చదును చేయాలి. 50 సెం.మీ. ఎడంతో బోదెలు మరియు కాలవలు చేయాలి.
విత్తటం:
తెగులు సోకని, ఆరోగ్యమైన దుంపలను ఎన్నిక చేసుకోవాలి. దాదాపు 30-40 గ్రా. బరువుతో, 2-3 కళ్ళు వుండి, అప్పుడే మొలకెత్తటం ప్రారంభించిన వాటిని విత్తటానికి ఎంపిక చేయాలి. ముక్కలు చేసిన విత్తన దుంపలు ఎకరాకు 6 నుండి 8 క్వింటాళ్ళు అవసరం వుంటుంది. విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే శిలీంద్రాల నివారణకు విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలి. బోదెలకు ఒక ప్రక్కగా కళ్ళు పై భాగం వైపు వుండేటట్లుగా విత్తన దుంపలను నాటాలి. మొక్కల మధ్య 20 సెం.మీ., వరుసల మధ్య 50 సెం.మీ. ఎడం వుండాలి.
అంతరకృషి:
అభివృద్ధి చెందుతున్న దుంపలపై సూర్యరశ్మి పడితే, దుంప ఆకుపచ్చ రంగుకు మారుతుంది. కాబట్టి విత్తిన 30 రోజుల తర్వాత సుమారు 3-4 సార్లు మట్టిని ఎగదోయాలి.
త్వరగా మొలకెత్తటానికి (నిద్రావస్థను తొలగించడానికి):
శీతల గిడ్డంగుల నిల్వ నుండి తీసిన ఆలుగడ్డ విత్తన దుంపలను త్వరితంగా మొలకెత్తించడానికి, వాటిని 30 సెం.మీ. మందం కన్నా మించకుండా నీడలో పరచి కనీసం 7-10 రోజుల పాటు ఆరనీయాలి. గాలి చొరబడడానికి 2-3 సార్లు విత్తన దుంపలను తిరగ తిప్పాలి. పెద్ద సైజు దుంపలను శుభ్రంగా నీటిలో కడిగి 30-40 గ్రా. ఉండేలా దుంపలను ముక్కలుగా కోయాలి.
నీటి యాజమాన్యం:
నేలను, వాతావరణాన్ని దృష్టిలో వుంచుకొని నీరు పెట్టాలి. చల్కా నేలల్లో, మొలకెత్తడానికి ముందు 7-8 రోజుల వ్యవధితోనూ, దుంప ఏర్పడేటపుడు 4-5 రోజుల వ్యవధితోనూ నీరు పెట్టాలి.
సస్యరక్షణ
పురుగులు, తెగుళ్ళ నివారణ …
- పంటచుట్టూ రక్షక పంటగా జొన్న, మొక్కజొన్న లేదా సజ్జ పంటను వేసుకోవాలి.
- దుంపల ద్వారా ఆలుగడ్డ వేసుకున్నప్పుడు దుంపలను పైన తెలిపిన తయారు చేసుకున్న ద్రావణంలో ముంచి విత్తనశుద్ధి చేసుకుని నాటుకోవాలి.
దుంప తొలిచే పురుగులు
(ట్యూబర్ మాత్):
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు దీని ప్రభావం ఎక్కువగా వుంటుంది. మన రాష్ట్రంలో ఈ పురుగు ఉధృతి చాల తక్కువగా వుంది.
నివారణ పద్థతులు:
- దుంపలను బయటపడకుండా ఎప్పటికప్పుడు బోదెల పైకి మట్టి ఎగదోయాలి.
- పురుగు ఆశించిన దుంపలను గుర్తించి ఏరి నాశనం చేయాలి.
- దుంపపురుగు నివారణకు ముందు జాగ్రత్త చర్యగా ఆఖరి దుక్కిలో ఎకరానికి 1-2 క్వింటాళ్ళ వేపపిండి వేసుకోవాలి.
- దీపపు పురుగు నివారణకు జిగురుపూసిన పసుపురంగు డబ్బాలను ఎకరానికి 15-20 అమర్చుకోవాలి.
- పేనుబంక నివారణకు 5 శాతం వేపకషాయం లేదా నీమాస్త్రం తయారు చేసి పిచికారీ చేసుకోవాలి.
- పక్షిస్థావరాలను ఎకరానికి 15-20 అమర్చుకోవాలి.
- లద్దెపురుగు నివారణకు ముందు జాగ్రత్త చర్యగా 5 శాతం వేపకషాయం లేదా నీమాస్త్రం తయారు చేసి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పురుగు పెరిగిన తరువాత పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం లేదా బ్రహ్మాస్త్రం తయారు చేసి పిచికారీ చేసుకోవాలి.
- ఆకులు తినే పురుగు నివారణకు 5 శాతం వేపకషాయం లేదా నీమాస్త్రం తయారు చేసి పిచికారీ చేసుకోవాలి.
- ఆకు ఎండు, ఆకుమచ్చ తెగులు మరియు లేట్/అర్లీ బ్లైట్ వల్ల ముదురు గోధుమరంగు మచ్చలు ఆకులపై ఏర్పడతాయి. దీని నివారణకు పులిసిన పుల్లటి మజ్జిగ (ఆరు లీటర్ల మజ్జిగ వందలీటర్ల నీటిలో) లేదా పశువులపేడ, మూత్రం, ఇంగువ ద్రావణం లేదా పిచ్చితులసి కషాయం (ఐదుకిలోలు వందలీటర్ల నీటిలో) పిచికారీ చేసుకోవాలి.
- బ్యాక్టీరియా కుళ్ళు తెగులు దుంపలకు ఆశించడం వల్ల దుంపలు కుళ్ళిపోతాయి. ఈ తెగులు నివారణకు విత్తడానికి ముందు దుంపలను పైన తెలిపిన విత్తనశుద్ధి ప్రకారం విత్తనశుద్ధి చేసుకుని నాటుకోవాలి.
- రిమ్ము తెగులువలన (రింగ్రాట్) ఆకులు పసుపుగా మారి వడలి పోతాయి. మొక్క కూడా వడలి పోయినట్లుగా కనిపిస్తుంది. గడ్డ లోపల పెద్దమచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు సాధారణంగా దుంపల ద్వారా వ్యాపిస్తుంది. దుంపలను పైన తెలిపిన విధంగా విత్తనశుద్ధి చేసుకోవాలి.