ఆదివాసీ మహిళల ఆత్మవిశ్వాస ప్రతీక – భూదేవి
ఆడపిల్ల పుడితే చులకనగా చూడటం, అవకాశముంటే కడుపులోనే అంతమొందించడం పట్టణాలకే పరిమితమై లేదు. మారుమూల అడవీ ప్రాంతాలకు, గిరిజన తండాలకు కూడా వ్యాపించింది. ఆడపిల్లలను కన్న పాపానికి ఓ గిరిపుత్రిక చిత్రహింసలకు గురయింది. ఆ హింసనుండి బైటపడి, తన భవిష్యత్ జీవితాన్ని తానే తీర్చి దిద్దుకుంది. నేడు అంతర్జాతీయ వేదికలపై అనర్గళంగా మాట్లాడే స్థాయికి ఎదిగింది. ఆ సామాన్య మహిళ, అసామాన్య జీవన పయనం ఎందరికో స్పూర్తిని కలిగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రత్యేక జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. నేటికీ ప్రధానంగా ఆదివాసీల కేంద్రంగా విరాజిల్లుతోంది. అందమైన ప్రకృతి నడుమ ఆదివాసీల జీవితాలు కూడా ఆనందంగానే గడిచిపోతున్నాయని బైటి ప్రపంచం అనుకుంటుంది. కానీ, సమాజంలోని అనేక దురాచారాలు, వ్యవనాలు ఇక్కడి వారి జీవితాలను కూడా అతలాకుతలం చేస్తున్నాయి. ఆధునిక మనిషి ఆలోచనలు, అభిప్రాయాలు ఆదివాసీ జీవితాలను కూడా ముఖ్యంగా అక్కడి మహిళల ఆనందాలను కాలరాస్తున్నాయి.
అటువంటి దురాచారానికే బలైంది శ్రీకాకుళం జిల్లా, హీర మండలం, సవర చొర్లంగి గ్రామానికి చెందిన భూదేవి. ముగ్గురు ఆడపిల్లల్ని కన్న పాపానికి భర్త ఇంటినుండి తరిమేస్తే, కన్న తండ్రి చేరదీసాడు. భూదేవి తండ్రి చిన్నయ్య ఆదివాసీల హక్కుల కోసం పనిచేసేవాడు. సంఘ నాయకుడుగా గ్రామ గ్రామాలు తిరిగే వాడు. కూతురు భూదేవిని కూడా తీసుకెళ్లేవాడు. ఆ ప్రజా జీవితమే ఆమెను రాటుదేలేలా చేసింది. కుటుంబ సమస్య తన ఒక్కదానిదే కాదు, దేశంలోని అనేక మంది మహిళలు అనుభవిస్తున్నదనే నిజాన్ని భూదేవి తెలుసుకుంది. తండ్రితో పాటు ఆదివాసీ సంఘాల్లో చురుకైన పాత్ర పోషించడం మొదలుపెట్టింది. తండ్రి ఇచ్చిన అర ఎకరం సాగుచేయడం మొదలెట్టింది. జీవన భృతి కోసమే కాకుండా, వ్యవసాయాన్ని ఒక జీవికగా చేసుకుంది. అంతరించి పోతున్న సాంప్రదాయ ఆహార పంటలను తిరిగి పండించేందుకు కృషి చేస్తోంది.
వైవాహిక జీవితం తాలూకు విషాదం నుండి బైటపడి, ప్రజాజీవితంలో భాగమవుతున్న దశలోనే కొండంత అండగా నిలిచిన తండ్రిని కోల్పోయింది భూదేవి. మరోసారి అధైర్యం ఆమెను అవహించింది. అయినా ఆదివాసీ సంఘంలోని ఇతర సభ్యులు ఇచ్చిన సహకారంతో మరోసారి ధైర్యాన్ని కూడగట్టుకుంది. తండ్రి మరణానంతరం నాయకత్వ బాధ్యతలు స్వీకరించింది. గిరిజనులకు భూమిపై హక్కులేకుండా ఆహార సార్వభౌమత్వం సాధ్యం కాదు. అందుకే అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలంటూ నినదిస్తోంది. సంప్రదాయేతర పంటల సాగే ఆదివాసీల్లో వ్యాధులు ప్రబలడానికి ఓ కారణమని గ్రహించి, శ్రీకాకుళంలోని 900 కుటుంబాలతో 25 రకాల సంప్రదాయ పంటలను సాగు చేయించింది. ఎవరికి వారు విడివిడిగా కాకుండా సామూహిక పోడు వ్యవసాయం చేసేలా ప్రోత్సహించింది. గిరిజనులు ఎక్కడపడితే అక్కడ ఊటల్లో, కుంటల్లోని నీళ్ళు తాగడం వారిలోని వ్యాధులకు మరో కారణం. ఐటిడిఏ సహకారంతో సీతంపేట, కొత్తూరు, ఎల్.ఎన్.పేట, హీర మండలాల్లో పెద్ద సంఖ్యలో సురక్షిత నీటి నూతులు తవ్వించింది. ఈ రెండు అంశాలు గిరిజన జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకువచ్చాయి. మూడుపదుల వయసులోనే భూదేవిని తిరుగులేని గిరిజన నాయకురాలిగా నిలబెట్టాయి. ఎనిమిది రాష్ట్రాల ఆదివాసీ మహిళా కన్వీనర్‌గా చురుగ్గా పనిచేసేలా చేసాయి.
కష్టాల కడలిలో మునిగినా, భవిష్యత్ ఎలా ఉండ బోతుందో కనుచూపు మేర కనిపించకపోయినా, గుండె ధైర్యంతో నిలబడింది భూదేవి. బైటి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి నుండి, ప్రపంచ వేదికలపై మాట్లాడే స్థితికి ఎదిగింది. చైనాలో జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ సదస్సులో భారతీయ ప్రతినిధిగా పాల్గొంది. ఆ సదస్సులో తన ఉద్యమా నుభవాలను పంచుకుని, అందరి ప్రశంసలూ అందుకుంది.
ఒకప్పుడు భూదేవి ఒంటరి.
ఇప్పుడు…
కుటుంబ హింసకు బలవుతున్న ఆదివాసీ మహిళలకు చుక్కాని.
అడవి బిడ్డల కోసం పోరు చేస్తున్న సాహసి.
మాయమైపోతున్న అనేక వ్యవసాయ ఉత్పత్తులకు ఆమె సంరక్షిణి. ఆదివాసీలకే కాదు, సహజ సంపదను కాపాడు కోవాలనుకునే ప్రతి ఒక్కరికీ… అడవులను కాపాడుకోవాలనుకుని కాంక్షించే వారికీ ఆమె ఓ ఆత్మీయ అతిథి.
Tag:ఆదివాసీ మహిళ, భూదేవి