ఆత్మహత్యలు ఆగాలంటే రైతులకు ఆదాయ భద్రత కావాలి – డా|| జి.వి. రామాంజనేయులు
రైతుల ఆత్మహత్యలు సంచలన వార్తలు కావడం మానేసి చాలా కాలమే అయింది. గత పదిహేడేళ్లలో దేశవ్యాప్తంగా 2,70,946 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయమంత్రి శరద్‌పవార్ ఇటీవల రాజ్యసభలో ప్రకటించారు. అందులో 33,326 మంది మన రాష్రానికి చెందిన వారే. రైతుకు వచ్చే ఆదాయం, పంట ఉత్పత్తి ఖర్చులకు సైతం సరిపోకపోవడమే ఈ ఆత్మహత్యలకు మూల కారణమనేది నిర్వివాదం. వ్యవసాయం నేడు కత్తిమీద సాముగా మారిందన్న వాస్తవం ఇతరులకు అంత తేలికగా అర్థం కాదు.
1997-2007 దశాబ్దిలో వ్యవసాయేతర ఉత్పత్తుల ధరలు 300 నుంచి 600 శాతం పెరిగాయి. వ్యవసాయోత్పత్తుల ధరల పెరుగుదల మాత్రం 25 శాతం కంటే తక్కువే! రైతు వ్యవసాయంలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుంటే రాబడి పెరుగుదల నామమాత్రమే. దీంతో రైతాంగం ఏ ఏటికాయేడు అప్పులపాలు కావడం, ఆత్మహత్యలు తప్ప గత్యంతరం లేని దుస్థితికి చేరడం అనివార్యమై పోయింది.
అర్జున్ సేన్‌గుప్తా జరిపిన అధ్యయనం కూడా అదే వాస్తవాన్ని కళ్లకు కడుతోంది. సగటు భారత రైతు నెలసరి ఆదాయం రూ.2,115 కాగా, నెలసరి వ్యయం రూ. 2,770 అని ఆయన అంచనా. రైతాంగంలో 84 శాతంగా ఉన్న చిన్న సన్నకారు రైతాంగం పరిస్థితి మరింత దయనీయం. వారి సగటు నెలసరి ఆదాయం రూ.1,818 కాగా, వ్యయం రూ.2,678. రైతు రాబడికీ, వ్యయానికీ మధ్య ఉన్న ఈ అగాధాన్ని పూడ్చకుండా రైతుల ఆత్మహత్యలు నిలిచిపోవాలనుకోవడం అత్యాశే.
పట్టణ, గ్రామీణ ఆదాయ వ్యత్యాసాలు ఇదే అంశాన్ని మరో కోణం నుంచి ప్రతిఫలిస్తాయి. నేషనల్ శాంపుల్ సర్వే (ఎన్ఎస్ఎన్ఓ) 2012 అంచనా ప్రకారం… 2009-10లో పట్టణ జనాభా సగటు తలసరి ఆదాయం నెలకు రూ. 1984 కాగా, గ్రామీణుల సగటు తలసరి ఆదాయం రూ. 1054. అది కూడా గ్రామాలలో అదాయ అసమానతలను పరిగణనలోకి తీసుకొని చూస్తే సమస్య తీవ్రత అర్థమవుతుంది. గ్రామీణ ప్రాంతంలోని అత్యున్నత అంతస్తుకు చెందిన 10 శాతం జనాభా నెలసరి ఆదాయం. రూ.2,567 కాగా, అట్టడగు 10 శాతం ఆదాయం రూ. 455 మాత్రమే. దీంతో రైతాంగం అప్పులపాలై, దివాళా తీసి కూలీలుగా దిగజారిపోవడం తప్పనిసరి ఆవుతోంది.
ఇక పట్టణాలకు వలసలు, అవాంఛనీయమైన రీతిలో పట్టణీకరణ పెరిగిపోవడం చూస్తునే ఉన్నాం.2007-12 మధ్య ఐదేళ్లలో 5.8 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలన్నది ప్రణాళికా సంఘం లక్ష్యం. 2004-2009 మధ్య ఆర్థికవ్యవస్థ వార్షిక వృద్ధిరేటు 8.43 శాతంగా ఉన్నా ఆ నాలుగేళ్లలో ఏర్పడ్డ కొత్త ఉద్యోగాలు 20 లక్షలు మాత్రమే. 2004-2005 మధ్య 42 శాతంగా ఉన్న ఉద్యోగిత రేటు 2009-2010 నాటికి 39.2 శాతానికి పడిపోయిందని ఎన్ ఎస్ ఎస్ ఓ అంచనా. జనాభా పెరుగుదల ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని చూస్తే మొత్తం ఉద్యోగిత సంఖ్యాపరంగా కూడా క్షీణించింది. ఈ ఐదేళ్ల కాలంలో సృష్టించిన కొత్త ఉద్యోగాలు 20 లక్షలు కాగా, పని చేసే జనాభా 5.5 కోట్ల మేరకు పెరిగింది. ఈ వాస్తవాలన్నీ ఒకే కీలకాంశాన్ని పట్టి చూపుతున్నాయి.. వ్యవసాయాన్ని యథాతథంగా కొనసాగించే అవకాశం లేదు. వ్యవసాయ వ్యయం రోజురోజుకూ పెరిగిపోతున్నా, వ్యవసాయోత్పత్తుల ధరలు ఏమాత్రం గిట్టుబాటు కానివిగా ఉండటమే నేటి రైతాంగ సంక్షోభవు మౌలిక లక్షణం. ఈ దుస్థితికి ప్రధాన కారణాలు మూడు.
వ్యవసాయ ఖర్చుల పెరుగుదల:
నేటి వ్యవసాయం గతంలోలాగా స్థానిక ఉత్పత్తికారకాలపై అధారపడటం లేదు. సమస్తమూ బయటి నుంచి సమకూర్చు కోవాల్సి వస్తోంది. సంకర విత్తనాలు, జన్యుమార్పిడి పంటల వంటి నూతన సాంకేతిక పరిజ్జానం, సరికొత్త పురుగుమందులు ప్రవేశించాయి. గత పదేళ్లలో వ్యవసాయ ఉత్పత్తికారకాల వ్యయం 300 శాతం పెరిగింది.ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని ప్రభుత్వం విత్తనాల సరఫరా తదితర అంశాలలో మద్దతును ఉపసంహరించింది. ఉత్పత్తికారకాల ధరల నియంత్రణను ఎత్తి వేసింది.
గిట్టుబాటు కాని ధరలు:
పండించే పంటకు లభించే ధరే రైతు ఆదాయానికి ఏకైక ఆధారం. అసలు వ్యవసాయోత్పత్తుల ధరలను నిర్ణయించే యంత్రాంగమే లోపభూయిష్టంగా ఉంది. తరచుగా అది వాస్తవిక వ్యయాలనుగానీ, రైతుల జీవితావసరాలను గానీ ప్రాతిపదికగా తీసుకోవడం లేదు. ఉదాహరణకు, 2012లో వ్యవసాయాశాఖ అంచనా ప్రచారమే క్వింటాలు వరి ఉత్పత్తి ఖర్చు రూ. 1,600 కాగా, కనీస మద్దతు ధరను రూ.1,280గా నిర్ణయించారు! చౌకగా ఆహారాన్ని అందించి పారిశ్రామికులకు శ్రమశక్తిని చౌకగా లభింపజేసే లక్ష్యంతో ప్రభుత్వాలన్నీ వ్యవసాయ ఉత్పత్తుల ధరలను కుదించడానికే ప్రయత్నిస్తున్నాయి. అంతేకాదు. వ్యవసాయాధార పరిశ్రమలకు ముడిసరుకు చౌకగా లభించేలా పత్తి, చెరకు, పొగాకు వగైరా వాణిజ్యపంటల ధరలను తక్కువగా ఉంచుతు న్నారు. 25 పంటలకు కనీస మద్ధతు ధరలను ప్రకటిస్తున్నారు. కానీ వాటికి హమీని కల్పించేలా ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవడం లేదు. సేకరణను కేవలం వరి, గోధుమలకే పరిమితం చేసి, రైతాంగాన్ని మార్కెట్టు దయాదాక్షిణ్యాలకు వదిలేసింది. ఇక వ్యవసాయోత్పత్తుల మార్కెట్లో సర్వత్రావ్యాపించి ఉన్న అక్రమ పద్ధతుల గురించి చెప్పనవసరమే లేదు. ద్రవ్యోల్బణం రైతాంగం పాలిట అడకత్తెరగా మారింది. ఒకవంక గిట్టుబాటు ధరలు లేక ఖర్చులు పెరిగిపోతున్నాయి. పైగా ప్రభుత్వం వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై ఉన్న పరిమాణాత్మక ఆంక్షలను తొలగించి మార్కెట్లను రైతాంగానికి ప్రతికూలంగా మార్చింది.
సబ్సిడీల ఉపసంహరణ:
1990ల తదుపరి, ప్రభుత్వం క్రమక్రమంగా రైతాంగానికి ఇచ్చే సబ్సిడీలలో కోత వేస్తోంది. ఉదాహరణకు, 2008 నుంచి ప్రభుత్వం రసాయనిక ఎరువుల ధరలపై నియంత్రణను పత్తివేయడం ప్రారంభించి, స్థిరమైన సబ్సిడీని ఇస్తోంది. డీఏపీ బస్తా ధర 2011లో రూ. 580 కాగా, 2012లో అది రూ. 1200కు పైగా పెరిగింది. ఇలా… రైతు రాబడికంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుండగా విద్య, వైద్యం, తాగునీరు తదితర మౌలిక సేవలను అందించే బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది. దీంతో జీవన వ్యయం కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఉత్పత్తికారకాలపై సబ్సిడీ రూపంలో, మద్దతు ధరల రూపంలో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న మద్ధతు మాత్రమే రైతాంగపు ఆదాయ అవసరాలను తీర్చజాలదని అనుభవంలో తేలింది. ఇక ఉత్పత్తి కారకాలకు ఇస్తున్న సబ్సిడీలు ప్రధానంగా పరిశ్రమలకే లబ్ధిని కలుగజేస్తున్నాయి. కాబట్టి రైతుల సుస్థిర ఆదాయానికి, జీవనోపాధికి భధ్రతను కల్పించడానికి, మౌలికమైన మార్పులు అవసరం. జాతీయ రైతు కమిషన్ సూచించిన విధంగా రైతుకు ‘కనీస నికర ఆదాయాని’ కి హామీని కల్పించే విధానం కావాలి. పే కమిషన్‌కు మార్గదర్శకాలుగా ఉండే కనీస ఆదాయం, ఫిట్మెంట్ బెనిఫిట్ అనే రెండు అంశాలను రైతాంగానికి కూడా వర్తింపజేయాలి. అయితే జీవన వ్యయానికి సరిపడే సగటు వినియోగాన్ని లెక్కించేటప్పుడు పే కమిషన్లా ముగ్గురిని గాక గ్రామీణ ప్రాంతాలలో ఐదుగురిని యూనిట్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలుపుకోవడం కోసం పే కమిషన్ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఫిట్మెంట్ బెనిఫిట్‌ను అందిస్తుంది. నేటి ప్రపంచవ్యాప్త ఆహార సంక్షోభం పారిశ్రామిక, కార్పొరేటు వ్యవసాయం కంటే చిన్న రైతు వ్యవసాయమే ఆహారభద్రతకు హామీని కల్పిస్తుందని రుజువు చేసింది. కాబట్టి రైతాంగం వ్యవసాయన్ని వీడకుండా నిరోధించడం అవసరం. అందుకు తగు ప్రోత్సాహకాలు అందించడం తప్పనిసరి. జీవన వ్యయం ఫిట్మెంట్ బెనిఫిట్‌తో కూడిన కనీస నికర ఆదాయానికి రైతుకు హమీని కల్పించాలి. అందుకు దిగువ పేర్కొన్న బహుముఖ వ్యూహం అవసరం.
గిట్టుబాటు ధరలు:
వ్యవసాయోత్పత్తులన్నిటి ధరలకు వాస్తవిక ఉత్పత్తి వ్యయాలు ప్రాతిపదిక కావాలి. ద్రవ్యోల్బణంతో వాటిని ముడి పెట్టాలి. రైతు కమీషన్ సూచించినట్లు ఉత్పత్తి వ్యయాలకు కనీసం 50 శాతం లాభాన్ని కలిపి ధరను నిర్ణయించి. పంటల సీజన్‌కు ముందే ప్రకటించాలి. వాటి అమలుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకోవాలి. ధాన్యం సేకరణ చేపట్టాలి. రాష్ట్రస్థాయిలో వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వ జోక్యానికి, ధరల స్థిరీకరణలకు అవకాశం ఉంటుంది. మద్దతు ధరలను రాష్ట్రస్థాయిలోనే పారదర్శకంగా నిర్ణయించి సీఏసీపీకి ప్రతిపాదించాలి. ప్రభుత్వ లెవీ, రూపాయికి కిలో బియ్యం పథకాల వంటి ప్రభుత్వ జోక్యం వలన వ్యవసాయ ఉత్పత్తుల ధరలలో తగ్గుదల సంభవించినప్పుడు ఆ మేరకు రైతులకు పరిహారాన్ని చెల్లించాలి.
కూలీ ఖర్చులకు ప్రభుత్వ మద్దతు:
నేడు గ్రామీణ ప్రాంతాలలో ఓ విచిత్రమైన పరిస్థితి ఉంది. కూలీలకు పనులు దొరకడం లేదని ఉపాధి హామీ (ఎన్ఆర్ఈజీఏ) పథకాన్ని అమలు చేస్తుండగా, వేతన వ్యయాలను భరించలేక రైతులు కూలీలను పనిలో పెటుకోలేని స్థితి నెలకొంది. అందువలన ప్రభుత్వం రైతులకు అయ్యే కూలీ వ్యయాలకు సబ్సిడీని ఇవ్వాలి. ఏడాదికి 100 రోజుల కూలీ రూపంలో శ్రమ సబ్సిడీని అందించాలి. దీనిని రైతు కుటుంబం సొంత శ్రమకు గానీ లేదా కూలీల శ్రమకు గానీ చెల్లించాలి. విత్తడం నుంచి నూర్చే వరకు అన్ని దశలకూ, అన్ని పంటలకూ దీన్ని వర్తింపజేయాలి.
ఆదాయ మద్దతు:
వాస్తవానికి ఈ చర్యలన్నిటినీ సక్రమంగా అమలుచేసినా రైతులకు చాలినంత ఆదాయం లభించదు. అందువలన ప్రతి వ్యవసాయ కుటుంబానికి నిర్ణీత ఆదాయానికి హామీని కల్పించాలి. ఆదాయానికి హామీని కల్పించే ఈ స్థిరమొత్తాన్ని రైతులకేగాక, కౌలు రైతులకు, వ్యవసాయకూలీలకు కూడా చెల్లించాలి. ప్రతి ఏటా సాగులో ఉన్న భూమికి మాత్రమే ఈ మధ్దతును వర్తింప చేయాలి. ఆదాయ మద్దతుకు ప్రాతిపదిక కుటుంబమే తప్ప భూ విస్తీర్ణం కారాదు. రైతాంగానికి ఈ మద్దతును అందజేసే పనిని గ్రామస్థాయి సంస్థలకు అప్పగించడం మంచిది. ఇందుకు మహిళా గ్రూపులను ఉపయోగించుకోవచ్చు. ఈ ఆదాయ మద్దతు రైతుల కొనుగోలుశక్తిని, మదుపు పెట్టే సామర్ద్యాన్ని పెంచగలుగుతుంది. ఈ త్రిముఖ చర్యలు రైతుకు కనీస నికర ఆదాయాన్ని అందించడంతో పాటు గ్రామీణ ఆర్థికవ్యవస్థ వికాసానికీ, దేశ ఆహార భద్రతకూ హమీని కల్పించగలుగుతాయి.