ఆకలితో భారతదేశపు అన్నదాత
నగరాలు మారుతున్నాయి, పల్లెలు ఇంతకు ముందు లాగా లేవు. నగర, పట్టణ వాసుల ఆదాయాలలో గణనీయమైన మార్పు కనిపిస్తున్నప్పటికీ, గ్రామాలలో నివసించే 60 కోట్ల వ్యవసాయ కుటుంబాలకు కొన్ని రాయితీలు ఇస్తున్నప్పటికీ పరిస్థితి ఏ మాత్రం మెరుగ్గా లేదు.
గత 17 సం||లలో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, ప్రస్తుతం ఉన్న రైతులలో సుమారు 65 శాతం అప్పుల ఊబిలో కూరుకుని పోయారు. అయినప్పటికీ అత్యధిక జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి, అతి తక్కువ ఆదాయంతో జీవితం సాగిస్తున్నారు. ఇంత చేసినా సేద్యం మూలంగా వచ్చే ఆదాయం జాతీయ ఆదాయంలో 13 శాతం మాత్రమే. 60 శాతం పైగా రైతులు జాతీయ ఉపాధి హామీ పథకం (యం.యన్.ఆర్. ఇ.జి.ఎస్) మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. మరో విధంగా చెప్పాలంటే జాతికి ఆహారాన్నందించే రైతు తాను పస్తులతో గడుపుతున్నాడు.
గిట్టుబాటు కాని వ్యవసాయంతో విసుగుచెందిన రైతులు ప్రతి రోజూ సుమారుగా 2500 మంది వ్యవసాయాన్ని వదిలి పట్టణాలకు వలసి వచ్చి చిన్న, చితక కూలీ పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఈ విధంగా 2007-12 సం||ల మధ్య వలస వచ్చిన వారి సంఖ్య 3.2 కోట్లకు చేరింది. ఇంకొక పరిశీలనలో ప్రతిరోజూ 50 వేల మంది నగరాలకు / పట్టణాలకు వలస పోతున్నట్లుగా (రైతులతో కలసి) తేలింది. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం దొరికితే 42 శాతం రైతులు సేద్యాన్ని వీడేందుకు తయారుగా ఉన్నట్లు మరొక పరిశీలనలో తేలింది.
తమకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని గత్యంతరం లేని పరిస్థితులలో అమ్మి, పట్టణాలలో రిక్షాలు త్కొటమో, భవన నిర్మాణంలో రోజూ కూలీ పనులు చేసుకుంటూ కాలమెళ్ళ దీస్తున్నారు. ఈ విధంగా వస్తున్న వలసలను మన ఆర్.బి.ఐ గవర్నర్ రఘురామ్ ప్రగతి పథంగా అభివర్ణిస్తున్నారు. వారిని వారు భూములనుండి వెళ్ళగొట్టి, బికారులను చేసి ఇదే ప్రగతి అని చెప్పటం’ దుర్మార్గం.
ప్రధాని మన్మోహన్ సింగ్ గారి లెక్కల ప్రకారం 70 శాతం మంది రైతులను వేరే వృత్తులలోకి పంపాలి. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 40 కోట్ల గ్రామీణులను 2015 కల్లా బయటకు తరలించాలి. ఎలాంటి ఆర్థిక సూత్రాన్ని అనుసరించి ప్రజలను గ్రామాలనుండి పట్టణాలకు తరలిస్తారో నాకు అర్థంకాకుండా వుంది. వ్యవసాయ సంబంధ పనులు మాత్రమే తెలిసిన గ్రామీణులను పట్టణాలకు పంపి, అచ్చట నిర్మాణ రంగానికి చౌకగా కార్మిక శక్తిని అందజేయడం, ఏ విధంగా వ్యవసాయ రంగ సంక్షోభాన్ని నివారించినట్లు?
వ్యవసాయం అత్యంత పెద్ద ఉపాధి రంగం. అది ఆర్థికంగా గిట్టుబాటు కాకుండా పరిస్థితులను కల్పించడం నిరుద్యోగాన్ని పెంచడమే! మరో ప్లానింగ్ కమిషన్ రిపోర్టు చూసినట్లయితే మన జి.డి.పి 8-9 శాతం ఉన్న 2005-09 సం||ల మధ్య 1.4 కోట్ల మంది వ్యవసాయ రంగం నుండి బయటికి వచ్చినట్లుగా తేలింది. వీరంతా ఉత్పాదక రంగంలో పని చేశారనుకుందామంటే అక్కడా ఆ కాలంలో 57 లక్షల మంది నిరుద్యోగులయ్యారు.
మరి ఈ రైతులంతా ఏమై పోయినట్లు?
వ్యవసాయ రంగం నుండి రైతులను పట్టణాలకు పంపడం అనేది ఆర్థికంగా, రాజకీయంగా అర్థం లేని చర్య. వారిని రెండింటికీ చెడ్డ రేవడిగా తయారు చేయడమే! ఒక ప్రక్క ఉన్న కొద్ది పాటి భూ వనరును అమ్ముకుని, పట్టణాలలో ఆర్థిక మందగమన పరిస్థితులలో ఉపాధి దొరకక వారు తిరిగి గ్రామాలకే రావాల్సి వస్తుంది. తమదైన భూమిని అమ్ముకున్నవారు బ్రతికేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం (యం.యన్.ఆర్.జి.ఇ.ఎస్) ఆశ్రయించడమో లేక వ్యవసాయ కూలీగా మారడమో జరుగుతుంది. నగరాలలో ఉపాధి దొరకక ఇలా వలస పోయిన వారిలో 1 1/2 కోట్ల మంది 2012-14 సం||ల మధ్య గ్రామాలకు తిరిగి వస్తారని క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ పరిశీలన తెలుపుతుంది.
ప్రస్తుత ఆర్థిక విధానం, లెక్కించదగిన గ్రామీణులను నగరాలకు తరలించాల్సిందిగా సూచిస్తుంది. ఈ చర్యవల్ల వుత్పన్నమయ్యే ఆర్థిక, రాజకీయ మరియు సాంఘిక పరిణామాలను ఆర్థిక శాస్త్రవేత్తలు ఊహించలేకపోవడం నాకు ఆందోళన కలిగిస్తున్నది. నా పరిశీలన ప్రకారం 2030 సం||కి దేశ జనాభాలో 50 శాతం నగరాలు, పట్టణాలలో ఉంటారు. ఇది తప్పకుండా అప్పటి ప్రభుత్వాల మీద పట్టణాలలో ఉపాధి కల్పించవలసిందిగా విపరీతమైన ఒత్తిడి తెస్తుంది. దురదృష్టం ఏమంటే ఉపాధి కల్పన బాగా ఉంటేనే ఆర్థిక ప్రగతిపై ఆధారపడి ఉంటుంది.
ఏదైనా అర్థవంతమైన చర్య వ్యవసాయ రంగంలోనే జరగాలి. అయితే ఇది ఏదో కాంట్రాక్ట్ ఫార్మింగ్ (ఒప్పంద వ్యవసాయం) గానో, లేక భూ కమతాలను పెట్టుబడిదారులకు అప్పగించడం మూలంగానో సమస్య పరిష్కారమనుకుంటే సమస్య మరింత జఠిలమవుతుంది. దీనికి పరిష్కారం ఆర్థిక గ్రంథాల నుండీ కాక, గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధికి తోడ్పడే ఉపాధి పథకాల ద్వారానే సాధ్యం. దీనికి ‘వరే బజార్’ అనే మహారాష్ట్ర గ్రామం చక్కని మార్గదర్శనం. ఒకప్పుడు కరువుతో అల్లాడిన ఆ గ్రామంలో ఇప్పుడు 60కి పైగా లక్షాధికారులను మనం చూడవచ్చు.
గ్రామ సభలకు వారి ప్రకృతి వనరులు వారెలా వుపయోగించుకోవాలో నిర్ణయాధికారం ఇవ్వటం మూలంగా ఇది సాధ్యం అవుతుంది. వ్యవసాయంలో వారికి గిట్టుబాటయ్యే ధరలు లభించి, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకొనేట్లు చూస్తే, ఇప్పటిలా వారి భూములను తెగనమ్ముకొని పట్టణాలవైపు వలసలను అరికట్టవచ్చు. గ్రామ పునర్నిర్మాణానికి రిజర్వు బ్యాంకు జాతీయ స్థాయి ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టాలి. దురదృష్టమేమంటే ఈ బ్యాంకు ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు సూచనలను అనుసరిస్తూ గ్రామీణులను, పట్టణాలవైపు వెళ్ళమంటుంది.
వ్యవసాయం మనదేశ ఆర్థిక రంగానికి దన్నుగా నిలవాలి. ఈ రంగం 2/3 వంతు జనాభాకు చక్కటి ఉపాధిని చూపుతూ, పర్యావరణాన్ని కాపాడుతుంది. జాతికి ఆహార భద్రత ఇచ్చే శక్తి ఉంది. ”భవిష్యత్తు ఆయుధ సంపత్తి ఉన్న దేశాలదికాదు, అది ప్రపంచానికి ఆహారం ఇవ్వగల్గిన దేశాలదే” అని డా|| స్వామి నాథన్ గారు అప్పుడెప్పుడో చెప్పిన మాట అక్షర సత్యం. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి దేశ భవిష్యత్తు చిన్నాభిన్నం చేయవద్దు. ఈ మార్పే మన దేశానికి కావల్సింది.
– అనువాదం: వెంకటరత్నం