ఆంధ్రప్రదేశ్ పంటసాగుదారుల చట్టం – 2019” పేరుతో కౌలు రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వం
ఎన్నికలలో ఎన్ని హామీలు ఇచ్చినా, గెలిచాక మాయ మాటలెన్ని చెప్పినా జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కౌలు చట్టం రైతులకు ”ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల చట్టం 2019 పేరుతో వెన్నుపోటు పొడిచింది. పైగా గత ప్రభుత్వాలు సాహసం చేయని విధంగా 1956 ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల చట్టాన్ని, 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని ఒక్క కలం పోటుతో ఈ చట్టం ద్వారా రద్దు చేయడానికి పూనుకుంది.
చట్టంలో కరణీకం భాష ఎంత వాడినా, రాష్ట్ర ప్రభుత్వం చెప్పదలుచుకున్నది ఒక్కటే. కౌలు రైతులను గుర్తించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదనీ, భూ యజమానులు, కౌలు రైతులు ఒక ఒప్పందానికి వచ్చి అగ్రిమెంట్ రాసుకుని గ్రామ సెక్రెటేరియట్‌కు దాఖలు చేస్తే, ఆపుడు గ్రామ సెక్రెటేరియట్‌లో ఉన్న రెవెన్యు అధికారి దానిపై సంతకం చేసి కౌలు రైతుకు గుర్తింపు కార్డు జారీ చేస్తాడని, స్పష్టంగా చెప్పింది. ఈ విషయంలో 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ఎంతో మెరుగుగా ఉంది. ఆ చట్టం స్ఫూర్తిని కూడా ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది.
1. 1956 చట్టం కౌలు రైతులకు 2 హక్కులు ప్రధానంగా కల్పించింది.
అ) ఈ చట్టం ప్రకారం 6 సంవత్సరాల వరకూ భూమి యజమానులు తమ భూమిని కౌలుకు ఇవ్వవచ్చు. ప్రస్తుత జగన్ ప్రభుత్వం దీనిని 11 నెలలకు కుదించింది.
ఆ) పాత చట్టం కౌలు ధరలపై నియంత్రణ విధించి, పంట దిగుబడిలో 5వ వంతు మాత్రమే కౌలు ధర ఉండాలని చెప్పింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం కౌలు ధరపై ఎటువంటి నియంత్రణ పెట్టలేదు. అది భూ యజమానులు, కౌలు రైతుల మధ్య ఒప్పందానికి వదిలేసింది.
2. ఈ రెండు అంశాలూ వాస్తవానికి కౌలు రైతులకు అన్యాయం చేసేవే. కౌలు రైతుల మధ్య పోటీ పెరిగి కౌలు ధరలను పెంచుకుంటూ పోతున్న పరిస్థితి వుంది. దీనికి ప్రధాన కారణం భూమిని నమ్ముకుని వ్యవసాయం వృత్తిగా ఎంచుకుందామని భావిస్తున్న వాస్తవ సాగు దారుల చేతుల్లో భూమి లేకపోవడం వల్ల అనివార్యంగా వీరు కౌలుపై ఆధార పడుతున్నారు. పదులకొద్దీ ఎకరాలను కబ్జాలో పెట్టుకున్న భూముల యజమానులనేకమంది భూమిని కౌలుకు ఇస్తూ, కౌలు డబ్బుల రూపంలో లాభపడడమే కాకుండా, ఇంకా అనేక ప్రయోజనాలను పొందుతున్నారు. వడ్డీ లేని పంట రుణాలు, బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వ్యవసాయ సబ్సిడీ పథకాలు, రైతు భరోసా లాంటి పథకాల ద్వారా లాభం పొందుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయాలను ఏమీ దృష్టిలో పెట్టుకోకుండా, కొలు రైతులకు లాభం జరిగేలా నిబంధనలు పెట్టకుండా, కేవలం భూ యజమానులకు, కౌలు రైతుకు మధ్య ఒప్పందం పైనే కేంద్రీకరించి చట్టం తెచ్చింది.
3. భూ యజమానులకు నిజంగా తమ భూములను కౌలు రైతులు లాక్కుంటారని భయమేమీ లేదు. 1956 నుండీ ఒక్క కౌలు రైతు కూడా, తాము కౌలుకు చేస్తున్న భూమి తమదని కోర్టుకు వెళ్ళలేదు. హక్కులు సాధించలేదు. 2011 చట్టం వచ్చాక కూడా కౌలు రైతులు తాము సాగు చేస్తున్న భూములు తమవని ఎప్పుడూ క్లెయిమ్ చేయలేదు. భూమి యజమానులకు ఉన్న బాధల్లా, ఇంతకాలం తాము ఎంజాయ్ చేస్తున్న వడ్డీ లేని రుణాలు, గుర్తింపు కార్డుల ఆధారంగా కొలు రైతులకు ఇస్తే, తమకు దక్కకుండా పోతాయని మాత్రమే. అలాగే అప్పనంగా వచ్చిపడే పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ అందవని మాత్రమే. ఈ కారణం చేతనే భూ యజమానులు తమ భూములను కౌలుకు ఇచ్చి వేలాది రూపాయలు కౌలు రూపంలో పొందుతున్నా, దానిని పేపర్ పై ఒప్పందంగా వుంచడం లేదు. ఇప్పుడు ఈ చట్టం తెచ్చినా, ఏ భూ యజమాని, తాముగా వచ్చి, కౌలు రైతుతో వ్రాత పూర్వక ఒప్పందం చేసుకోడు. తాము అనుభవిస్తున్న సౌకర్యాలను వదులుకోరు. దీని వల్ల గత సంవత్సరాల కంటే ఈ సారి కౌలు రైతుల గుర్తింపు కార్డుల సంఖ్య భారీగా తగ్గిపోయే అవకాశం వుంది. రైతు స్వరాజ్య వేదికగా మేము ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలను, అధికారులను కల్సి విజ్ఞప్తి చేసినా, అంతిమంగా అది ప్రభుత్వం అధినేత చెవికి ఎక్కలేదు. ఆయన 11 నెలల వ్రాతపూర్వక ఒప్పందం కోసం పట్టు పట్టి, కొలు రైతులకు అన్యాయమే చేశాడు. క్షేత్ర స్థాయి పరిస్థితులతో, ఆయనకు సంబంధం లేకపోవడం వల్ల ఇలా జరిగిందని మేము భావించడం లేదు. భూస్వాముల భయాలను పోగొట్టే పేరున, కౌలు రైతులకు శాశ్వత అన్యాయం చేయడానికి పూనుకున్నాడు.
4. భూ యజమానులు, కౌలు రైతుల మధ్య వ్రాత పూర్వక ఒప్పందం చేయించడానికి ఏ బాధ్యతా తీసుకోని ప్రభుత్వం (2011 చట్టం – గ్రామ సభల ద్వారా కౌలు రైతుల ను గుర్తించే బాధ్యతను రెవెన్యూ శాఖకు పెట్టింది), బ్యాంకులకు మాత్రం ఉచిత సలహా ఇచ్చింది. ఈ కార్డు తప్ప, వేరే ఏ తాకట్టు పత్రాలూ అడగకుండా బ్యాంకులు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని. బ్యాంకులు దీనిని పాటించకపోతే ఏం చేస్తారో ఈ చట్టంలో మాట్లాడలేచు. ఒకవేళ భూమి యజమానులు వ్రాత పూర్వక ఒప్పందానికి ముందుకు రాకపోతే ప్రభుత్వం ఏమి చేస్తుందని కూడా చట్టంలో లేదు. భూ యజమానులు ఏ ప్రేమతో, ఏ భయంతో ఒప్పందానికి వస్తారు. ”సాగు భూములు, పంటలు వేయకుండా ఖాళీగా ఉంచితే సంపద పన్ను వేస్తామని చెప్పండి. భూ యజమాని, లేదా వారి తరపున అనుమతి పొందిన వారు వచ్చి ఒప్పందం చేసుకోకపోతే, గ్రామ సెక్రటేరియట్ బాధ్యత తీసుకుని తాను ఆ భూములను కౌలుకు ఇస్తుందని చెప్పండి ”అని మేము కోరాం. కానీ ఆ రకంగా భూ యజమానులను ఒప్పించే క్లాజులేవీ ఈ చట్టంలో లేవు. అంటే ఒకరకంగా ఈ చట్టం అమలు కాదన్న మాట. అమలు కాని చట్టం కోసం ఉన్న చట్టాలను కూడా రద్దు చేస్తున్నారు.
5. కేవలం 2 నెలల నోటీసుతో భూ యజమాని కౌలును రద్దు చేయవచ్చని చట్టంలో రాశారు. ఇది మరీ అన్యాయం. ఉన్నదే 11 నెలలు. కనీసం 3 సంవత్సరాలు కూడా కౌలు రైతుల చేతుల్లో భూమి వుంచకపోతే, ఏ కౌలు రైతు భూసార పెంపుదలకు పెట్టుబడులు పెట్టడు. భూసారాన్ని పెంచకపోతే, అధిక దిగుబడులకోసం విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడితే ఆ భూములు త్వరగా వట్టిపోతాయి. ఈ నేపధ్యంలో రెండు నెలల నోటీసు అంటే కౌలు రైతుకు ఇక ఏ భరోసా ఉంటుంది. పైగా ఈ కారణము చూపి భూ యజమానులు, కౌలు రైతులను బెదిరిస్తూ, కౌలు ధరలు మరింత పెంచుకుంటూ పోయే ప్రమాదం వుంది.
6. ఇప్పటికే ఆంధ్రప్రదేశంలో కౌలు రైతులు సంక్షోభంలో వున్నారు. ప్రస్తుత చట్టం వల్ల వారు మరింత సంక్షోభంలో కూరుకుపోయే వుంది. కౌలు రైతుల ఆత్మహత్యలు మరింత పెరుగుతాయి. ఈ ప్రమాదాన్ని అడ్డుకోవాలి. ప్రస్తుత చట్టాన్ని వుపసంహరించు కోవాలి. 2011 చట్టాన్ని మరింత మెరుగుపరిచి, కౌలు రైతులకు ప్రయోజనం చేకూరేలా, బ్యాంకులు రుణాలు ఇచ్చేలా భరోసా కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి.
7. వ్యవసాయ సంవత్సరం జూన్ నుండీ మే వరకూ అని చట్టంలో రాశారు కనుక, బ్యాంకులు ఏప్రిల్,మే నెలలలో భూ యజమానులకు ముందస్తు పంట రుణాలు యిచ్చే పద్ధతిని మానుకోవాలి. జూన్ 1 నాటికి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆ వివరాలను బ్యాంకులకు అందుబాటులో వుంచాలి. ఆ వివరాల ఆధారంగా మాత్రమే ఆయా సర్వే నంబర్లలో వాస్తవ సాగుదారులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలి. ముందస్తుగా పంట రుణాలు భూ యజమానులకు ఇచ్చి, గుర్తింపు కార్డు పొందిన కౌలు రైతులకు మొండి చెయ్యి చూపే బ్యాంకులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చట్టం కౌలు రైతులకు ఏ మాత్రమూ ఉపయోగపడేది కాదు. ఈ విషయంలో రైతు సంఘాలు కౌలు రైతుల పక్షాన గొంతెత్తాలి. వివిధ రాజకీయ పార్టీలు ఈ విషయంలో కౌలు రైతుల పక్షాన బలమైన ఉద్యమాన్ని నిర్మించాలి.