అల్లం
అల్లం
అల్లం దుంపలో జింజిరాన్, షోగాల్, జింజిరాల్, టెర్మినాయిడ్స్ వంటి రసాయన పదార్థాలు వుంటాయి. అల్లం రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే కఫం కరిగి పోతుంది. జలుబు బాధ నుండి ఉపశమనం కలుగుతుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. గొంతు నొప్పిని తగ్గించి, గొంతును శుభ్ర పరుస్తుంది. కడుపు నొప్పి, శూల, కీళ్ళ నొప్పులు నివారించబడతాయి.
ఆహారంలో సువాసన, ఘాటు కలిగించడం కోసం అల్లం దుంపను విరివిగా వాడుతున్నారు. పచ్చళ్ళ తయారీలో, కూరలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేద వైద్యం ప్రకారం అల్లం దుంప ఆరోగ్యానికి ఎంతో మంచిది. అల్లం మురబ్బా, అల్లం ‘టీ’ అందరికీ తెలిసినదే. అల్లం + వెల్లుల్లి పేస్టును చాలా కంపెనీలు తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నాయి. అల్లం నుంచి తీసిన సుగంధ తైలానికి (జోలియోరైజిన్) విదేశాలలో ఎంతో డిమాండ్ వుంది.
అల్లం దుంపలో వున్న రసాయనాలు (ముఖ్యంగా జింజిరాల్) చాలా శక్తివంతమైనవి. ఈ రసాయనాలకు పురుగులను నియంత్రించే గుణం వుందని శాస్త్రజ్ఞుల పరిశోధనలు నిరూపిస్తున్నాయి. (డా|| వీణా ప్రజాపతి మరియు ఇతర శాస్త్రజ్ఞులు-2005). ఇండ్లలో పండించే కూరగాయలలో వచ్చే పురుగుల నివారణకు (ఇంటిపంట) పచ్చిమిర్చి – వెల్లుల్లి ద్రావణంలో అల్లంను కూడా చేర్చటం ద్వారా, పురుగులను సమర్ధవంతంగా అరికట్టవచ్చు. (రచయిత అనుభవం). అల్లం దుంపలో ఉండే రసాయనాలకు పంటల నాశించే తెగుళ్ళను సమర్ధవంతంగా అరికట్టవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. (డా|| పి.యన్. రవీంద్రన్ మరియు డా|| నిర్మల్ బాబు -2004) సేంద్రియ వ్యవసాయంలో అన్ని రకాల తెగుళ్ల నివారణ కొరకు రైతులు సొంఠి పాల కషాయాన్ని వినియోగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సొంఠి పాల కషాయానికి మిర్చి పంట నాశించే వైరస్ తెగుళ్ళ వ్యాప్తిని అరికట్టే లక్షణం వుందని తెనాలి (గుంటూరు జిల్లా) రైతుల అనుభవం.
పంట కోతనంతరం పొలంలో మిగిలిన అల్లం పంట అవశేషాలు (పంట వ్యర్థాలు) వుపయోగించి ‘కంపోస్టు’ తయారు చేయవచ్చు. ఆచ్ఛాదన (మల్చింగ్)గా ఇతర పంటలలో వుపయోగించుకోవచ్చు.
Tag:అల్లం