సుగంధిపాల
సుగంధిపాల
సుగంధిపాల సుమారు 5 మీటర్ల పొడవు పెరిగే తీగజాతి మొక్క. నేలపైగానీ, చెట్ల ఆధారాన్ని పట్టుకొని గానీ పెరుగుతుంది. ఈ మొక్కకు చాలా శాఖలు వుంటాయి. ఆకులను, శాఖలను గిచ్చితే పాలు వస్తాయి. ఆకులు కణుపుకు రెండు చొప్పున వుండి, ఆకు మధ్యలో తెలుపు రంగు కలిగి మెరుస్తుంటాయి. పుష్పాలు లేత ఆకుపచ్చగా వుండి గుత్తులుగా వస్తాయి. ఫలాలు సన్నగా, పొడవుగా వుంటాయి. విత్తనాలకు దూది వుంటుంది. పుష్పాలు ఆగస్టు నుండి నవంబర్ వరకు లభిస్తాయి. ఈ మొక్క వేర్లు దుంపల రూపంలో ఉబ్బి వుంటాయి. ఈ మొక్క వేర్లను మరియు పూర్తి మొక్కను వైద్య పరంగా ఉపయోగిస్తారు. దుంపనుండి తయారు చేసిన ”షర్భత్”ను వేసవి కాలంలో శరీరానికి చలువ చేసేందుకు ఎక్కువ వుపయోగిస్తారు. దీనినే ”నన్నారి” అని కొన్ని ప్రాంతాలలో అంటారు.
ఈ మొక్క పంట పొలాలలోనూ, బీడు భూములలోనూ, పెద్ద పెద్ద చెట్ల క్రింద ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్క వేరు మంచి సుగంధపు వాసన కలిగి వుంటుంది.
ఆకలిని పుట్టించడానికి, జ్వరం, చర్మవ్యాధులు, కీళ్ళ నొప్పులు, మూత్ర సంబంధ వ్యాధుల నివారణలో ఎక్కువగా వాడతారు. వేరు రసాన్ని టాన్సిల్స్, వుదరంలో ఏర్పడే వ్రణాల నివారణలోను, శరీరంలోని అమిత వేడిని తగ్గించడానికి వాడతారు. ఈ మొక్క వేరును ఉపయోగించి చాలా రకాల ఆయుర్వేద మందులు తయారు చేస్తున్నారు. సుగంధిపాల మొక్క మరియు వేర్లలో వున్న రసాయనాలు చాలా శక్తివంతమైనవి. ఈ రసాయనాలకు పురుగులను నియంత్రించే గుణం వుంటుంది. ఈ మొక్క ఆకుల కషాయానికి పురుగుల లార్వాలను నివారించే లక్షణం వుందని డా|| కామరాజ్ మరియు డా|| టాండన్ పరిశోధనలలో తేలింది. ఇదే విషయాన్ని డా|| మల్లిఖార్ఖున్ పరిశోధనలు బలపరుస్తున్నాయి.
ఈ మొక్క వేరునకు నీటిని శుభ్రపరిచే గుణం వుందని (వాటర్ ప్యూరిఫికేషన్) డా|| అర్జునన్ (2012) తమిళనాడు పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఈ మొక్క వేరు కషాయంతో ఇండ్లలో పెరిగే కూరగాయ మొక్కల నాశించే రసం పీల్చే పురుగులను సమర్ధవంతంగా నివారించవచ్చు.
Tag:సుగంధిపాల