సమగ్ర వ్యవసాయ విధానంలేక సంక్షోభం వైపే నడుస్తున్న తెలంగాణ – రాష్ట్ర వ్యవసాయరంగంపై సమీక్ష 2014 – 2019
1. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఇప్పటికీ 60 శాతం జనాభా గ్రామీణ ప్రాంతంలోనే వుంది. రైతులు, వ్యవసాయకూలీలు, చేతి వృత్తుల కళాకారులు, విభిన్న జీవనోపాధులతో జీవించే శ్రామిక కులాల ప్రజలు – గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అతి తక్కువ ఆదాయాలతో జీవిస్తున్నారు. ఆయా సమూహాల సమస్యలు తీవ్రంగా వున్నాయి.
2. రాష్ట్ర స్థాయిలో జీడీపీ నికరంగా పెరుగుతూనే వుందని రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు వెలువరిస్తున్నా (రుణాలను ఆదాయంగా చూపిస్తున్నారని ‘కాగ్’ మొట్టికాయలు వేసినా) గ్రామీణ జిల్లాల ‘జీడీడీపి’ అత్యంత తక్కువగా వుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ‘జీడీడీపి’ లక్షా ముప్పైవేల కోట్లను దాటిపోతే, మెజారిటీ గ్రామీణ జిల్లాల ‘జీడీడీపీ’ 10 వేల కోట్లలోపే వుంది. ఫలితంగా తలసిర ఆదాయం పరంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు 3 లక్షల రూపాయలను మించి వుంటే, జగిత్యాల, వనపర్తి, సిరిసిల్ల, గద్వాల లాంటి గ్రామీణ జిల్లాల తలసరి ఆదాయం లక్ష రూపాయలలోపే. అంటే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా నగరాల చుట్టూ తిరిగే పాత అభివృద్ధి నమూనాయే కొనసాగుతుందని అర్థం.
3. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనీ, ప్రజల ఆదాయాలు గణనీయంగా పెరుగుతున్నాయనీ, ప్రభుత్వం చెబుతున్నా, తగ్గని రేషన్ కార్డుల రూపంలో పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. 2019 జులై నాటికి 17,015 రేషన్ దుకాణాల పరిధిలో మొత్తం 88,00,545 రేషన్ కార్డులు వున్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 82,42,733 కాగా అంత్యోదయ ఆహార భద్రత కార్డులు 5,51,645, అన్నపూర్ణ కార్డులు 6,167 వున్నాయి. సాధారణంగా కుటుంబాల ఆదాయాలు పెరిగినప్పుడు, ప్రజలు, ప్రభుత్వ రేషన్ షాపులపై ఆధారపడడం తగ్గిపోవాలి. క్రమంగా రేషన్ కార్డుల సంఖ్య, రేషన్ షాపుల సంఖ్య తగ్గిపోవాలి. ఇది జరగడం లేదంటే ప్రజల ఆదాయాలు పెరగడం లేదని అర్థం లేదా రేషన్ కార్డుల చుట్టూ తీవ్రమైన దుబారా, అవినీతి నిండి వుందని అర్థం చేసుకోవాలి.
4. గ్రామీణ జిల్లాలలో పెద్దగా పారిశ్రామికీకరణ జరగడం లేదు. కొన్ని నగరాలు విస్తరిస్తున్నా, పెద్దగా ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. చేతి వృత్తులు, కులవృత్తులు క్షీణిస్తున్న దశలో గ్రామీణ ప్రాంత కుటుంబాలు ఆదాయం కోసం అత్యధికంగా ఆధారపడుతున్నది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద. ఈ పథకం ప్రకారం జాబ్ కార్డులు పొందిన ప్రతి గ్రామీణ కుటుంబానికి 100 రోజుల పని ఒక హక్కుగా కల్పించాలి. ఉపాధి హామీ పనికి నిర్ణయించిన వేతనం రోజుకు 205 రూపాయలు. రాష్ట్ర కనీస వేతనం కంటే ఇది చాలా తక్కువ. కానీ పథకం పని తీరు చట్టం రాష్ట్రంలో లక్ష్యాలను సుదూరంగా వుంది. 2018-19 లెక్కల ప్రకారం ఈ పథకం క్రింద ఉపాధి పొందిన కుటుంబాలు 25,20,000 మాత్రమే. ఈ కుటుంబాల నుండి 42,40,000 మంది శ్రమలో పాల్గొన్నారు. 100 రోజుల పని పూర్తి చేసిన కుటుంబాలు 2,24,366 మాత్రమే. ఈ శ్రామికులకు పడిన సగటు వేతనం 148.40 రూపాయలు మాత్రమే. కుటుంబాలకు దక్కిన సగటు పని దినాలు 46.5 రోజులు మాత్రమే. నిజంగా అన్ని కుటుంబాలకు చట్టం నిర్ధేశించిన పని దినాలు లభించి, కనీస వేతనం దక్కి వుంటే, గ్రామీణ కుటుంబాల ఆదాయం కొంతైనా పెరిగివుండేది.
5. గ్రామీణ కుటుంబాలకు ఆదాయం పెరచడానికి గొర్రెలు, పశువులు, చేపల రూపంలో పథకాలు రూపొందించి, అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ, ఆచరణ అందుకు అనుగుణంగా లేదు. ముఖ్యంగా గొర్రెల పంపిణీ విషయం చూస్తే, ఈ పథకం క్రింద పెట్టుకున్న లక్ష్యం 7,29,067 యూనిట్లు (యూనిట్‌కు 21 గొర్రెలు) కాగా, పంపిణీ చేసింది 3,65,682 యూనిట్లు. ఇంకా పంపిణీ చేయాల్సింది 3,63,385 యూనిట్లు. కానీ ప్రభుత్వం రెండవ విడత గొర్రెల పంపిణీకి ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పాడి గేదెల పంపిణీ లక్ష్యం 2,13,917 కాగా, పంపిణీ చేసింది కేవలం 57,842. ఇంకా పంపిణీ చేయాల్సింది 1,56,075 పాడి గేదెలు. దీనికి కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. పంపిణీ చేసిన గొర్రెల విషయంలో విపరీతమైన అవినీతి చోటు చేసుకుంది. పైగా వాటికి మేత భూములు పెద్ద సమస్య. అనేక మంది గొర్రెల కాపరులు గొర్రెల యూనిట్ కోసం 31,250 రూపాయల చొప్పున డీడీ తీసి ఎదురుచూస్తున్నారు. పైగా హరితహారం మొక్కలు తిన్నాయనే పేరున గొర్రెలకు గ్రామ సర్పంచ్‌లు విధిస్తున్న భారీ జరిమానాలు పథకం అమలుకు పెద్ద సమస్యగా మారే ప్రమాదం వుంది.
6. వ్యవసాయరంగం తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి గుండెకాయ. తెలంగాణాలో వ్యవసాయరంగానికి ఎన్నడూ లేనంత సహాయం అందిస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, దూరంగా వున్నవాళ్ళు ఇది నిజమే అని భావిస్తున్నప్పటికీ, వాస్తవాలను లోతుగా పరిశీలిస్తే పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ప్రభుత్వం తనకు తోచినట్లుగా పథకాలు రూపొందించి అమలు చేస్తున్నప్పటికీ, గ్రామీణ వ్యవసాయ కుటుంబాల సంక్షోభాన్ని అది ఏ మాత్రమూ పరిష్కరించడం లేదు. రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే వున్నాయి. రైతు కుటుంబాలపై అప్పుల భారం కొనసాగుతూనే వుంది. ఆదాయాలు క్షీణిస్తూనే వున్నాయి. పైగా కరువులు, వర్షాభావం, వడగండ్లు, అధిక వర్షాలు చేస్తున్న నష్టాలు అనంతం. పైగా వాతావరణంలో వస్తున్న మార్పులను, అవి వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేస్తున్న తీరును ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణాలో ఎడారీకరణ పెరుగుతున్నదని నివేదికలు వస్తున్నాయి.
7. ఈ నేపధ్యంలో రాష్ట్రానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానం అవసరముంటుంది. దీని కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేసినట్లు వినపడుతున్నప్పటికీ, దాని నివేదిక ఏమైందో ఎవరికీ తెలీదు. డా|| మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎం.సి.హెచ్.ఆర్.డి.) తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు ఒక కరువు మాన్యువల్‌ను రూపొందించినప్పటికీ ప్రభుత్వం దానిని ఆమోదించి, అమలు చేయడం లేదు. వ్యవసాయ కుటుంబాలను రుణ విముక్తులను చేయాలనే లక్ష్యంతో ఒక చట్టం ఆమోదించి, ఒక ట్రిబ్యునల్‌ను నియమించినప్పటికీ, ఆ ట్రిబ్యునల్ పని చేయడానికి అవసరమైన పూర్తిస్థాయి సిబ్బందిని, వసతులను ఇంకా సమకూర్చలేదు. అట్టహాసంగా ప్రకటనలు చేయడం, జీవోలు విడుదల చేయడం తప్ప, చాలా విషయాలలో ఆచరణ నాసిరకంగా వుంది. వ్యవసాయరంగానికి సంబంధించి ఒక్కో అంశాన్ని పరిశీలించినా ఇదే విషయం స్పష్టమవుతూ వుంది.
1. భూమి సమస్య:
తెలంగాణ రాష్ట్రంలో భూమి సమస్య జటిలంగా, సంక్షిష్టంగా తయారవుతున్నది. మరీ ముఖ్యంగా వ్యవసాయ భూములు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్‌కు మారిపోతున్నాయి. వ్యవసాయంతో ఏమాత్రం సంబంధంలేని అనేక మంది పెద్ద ఎత్తున భూ కమతాలు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుందామన్న గ్రామీణ పేదలు భూమి కొనుగోలు చేయలేక కౌలు రైతులుగా మారుతున్నారు. ప్రభుత్వం 1,973 భూ సంస్కరణల చట్టాన్ని అమలు చేయడం లేదు. ఎస్.ఇ.సి.సి. -2011 లెక్కల ప్రకారం 50 శాతం గ్రామీణ కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదు.
2014 లో ప్రభుత్వం తెచ్చిన జీవో నెం. 1 ప్రకారం 3 లక్షల దళిత కుటుంబాలకు, 3 ఎకరాల చొప్పున భూమి కొనుగోలు చేసి పంపిణీ చేయాల్సి వుంది. కానీ గత 5 సంవత్సరాలలో కేవలం 5,798 కుటుంబాలకు 14,702.23 ఎకరాలను మాత్రమే పంపిణీ చేసారు. ఈసారి బడ్జెట్లో కూడా ఈ పథకం కొనసాగుతుందన్న సూచనలేం లేవు.
ఆదివాసీ ప్రాంతాలలో 2018 నవంబర్ 30 నాటికి 1,86,000 దరఖాస్తులు భూమిపై పట్టాల కోసం ఆదివాసీ రైతులరతు చేసుకోగా 1,83,252 వ్యక్తిగత, 3,427 సాముదాయక) 94,360 (93,369 వ్యక్తిగత, 721 సాముదాయక) దరఖాస్తులకు మాత్రమే హక్కు పత్రాలు ఇచ్చి గుర్తించారు. వ్యక్తిగత సాముదాయక చట్టాలు ఇచ్చిన ఈ భూముల విస్తీర్ణం 7,54,339 ఎకరాలు మాత్రమే. ఇంకా 83,757 దరఖాస్తులను తిరస్కరించినట్లు (44 శాతం) ప్రకటించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం, తిరస్కరణకు కారణాలను దరఖాస్తుదారులకు తెలియచేయలేదు. సుప్రీం కోర్టులో నడుస్తున్న కేసులో దరఖాస్తుల పరిశీలినకు మరింత గడువు కోరుతూ లెటరు రాయడం తప్ప, తాజా వాస్తవ నివేదిక సుప్రీం కోర్టు ముందు ప్రభుత్వం వుంచలేదు.
2. కౌలు రైతుల సమస్య:
తెలరగాణాలో కౌలు రైతుల సంఖ్య పెరుగుతున్నది. నీతి ఆయోగ్ స్వయంగా రాష్ట్రంలో కౌలు రైతులు 13 శాతం వుంటారని చెప్పింది. వాస్తవంగా ఈ సంఖ్య మరింత ఎక్కువ వుండే అవకాశం వుంది. కానీ ప్రభుత్వం కౌలు రైతులు తమ ఎజెండాలో లేరని బహిరంగ సభల్లోనూ, అసెంబ్లీలోనూ కూడా ప్రకటించింది. కౌలు రైతులకు ‘రైతుబంధు’ అమలు చేయడం లేదు. భూమిలేని కౌలు రైతులు ‘రైతుబీమా’లో కూడా లేరు. కౌలు రైతులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు, బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఫలితంగా వీరికి పంటల బీమా కూడా అమలు కావడం లేదు. సబ్సిడీ పథకాలు కూడా వీరికి అందడం లేదు. దీని వల్ల కౌలు రైతు కుటుంబాలు తీవ్ర సంక్షోభంలో వున్నాయి. జరుగుతున్న రైతు బలవన్మరణాలలో 80 శాతం కౌలు రైతులవే. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, అత్యంత అమానుషంగా, కౌలు రైతులు తమ ఎజెండాలో లేరని ప్రకటించింది.
3. వ్యవసాయ కూలీలు:
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 59,15,151 మంది వ్యవసాయ కూలీలుగా నమోదయి వున్నారు. (సాగుదారులుగా నమోదయిన వాళ్ళు 31,51,389 మంది) వ్యవసాయ సీజన్లలో దొరికే ఉపాధి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ క్రింద దొరికే ఉపాధి వీరికి ప్రధాన ఆదాయ మార్గం. ఉపాధి హామీ పథకం ఎలా అమలవుతుందో మనం ఇప్పటికే చూశాం. వ్యవసాయ రంగంలో వచ్చిన యాంత్రీకరణ కూడా వ్యవసాయ కూలీల ఉపాధి అవకాశాలను ఏదో ఒక మేరకు తగ్గించింది. భూముల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ కూలీలు ఎవరూ స్వంత ఆస్తులను (భూములు, ఇళ్ళు) సమకూర్చుకోగలిగిన స్థితిలో లేరు. ప్రభుత్వ భూముల పంపిణీ వ్యవహారం కూడా ఎలా కొనసాగుతుందో చూశాం. ఈ స్థితిలో గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీల కోసం ఒక సమగ్ర సాంఘిక భద్రతా చట్టం తేవలసి వుంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఒక్క అడుగు ముందుకు వేయడం లేదు. రేషన్ బియ్యం, కొన్ని సందర్భాలలో ఆరోగ్య శ్రీ, కొన్ని కుటుంబాలకు నెలకు 2 వేల రూపాయల పెన్షన్ కూడా అందకపోతే, ఈ కుటుంబాలు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం వుంది. ఈ స్థితిలో ప్రభుత్వం ‘రైతుబీమా’ పథకాన్ని వ్యవసాయ కూలీలకు కూడా విస్తరించాల్సి వుంటుంది. దాని కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాల్సి వుంటుంది. కానీ ఈ బడ్జెట్లో కూడా ప్రభుత్వం ఆ పని చేయలేదు.
4. రైతుబంధు:
”పెట్టుబడి సహాయ పథకం” క్రింద ప్రభుత్వం 2018 ఖరీఫ్‌లో ఎకరానికి 4 వేల రూపాయల చొప్పున 51,50,000 మందికి 5,260.94 కోట్ల రూపాయలను అందించింది. 2018-19 రబీలో 49,03,000 మందికి 5,244.26 కోట్ల రూపాయలను అందించింది. (సామాజిక, ఆర్థిక నివేదిక -2019) పెట్టుబడి సహాయంగా ఇంత మొత్తాన్ని అందించడం అభినందనీయమే అయినా, ఈ పెట్టుబడి సాయంలో అత్యధిక భాగం సంక్షోభంలో వున్న సన్న, చిన్నకారు, మధ్య తరగతి రైతులకు కాకుండా పెద్ద రైతులకు అందింది. వ్యవసాయం చేయని భూములకు కూడా ఇవ్వడం వల్ల, వాస్తవ సాగుదారులకు (కౌలు రైతులు, పోడు రైతులు) కాకుండా కేవలం పట్టా హక్కులు కలిగిన భూ యజమానులకు ఇవ్వడం వల్ల 50 శాతం నిధులు నిరూపయోగమైనట్టే. పైగా 2018-19 రబీలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2,47,000 మందికి రైతు బంధు అందలేదు. రెవెన్యూ కార్డులలో తప్పుల వల్ల, రెవెన్యూశాఖ భూ రికార్డులను సరి చేయకపోవడం వల్ల ఇంకా అనేక లక్షల మంది రైతులు రైతుబంధు సహాయం అందుకోలేక పోయారు. 2019 ఖరీఫ్ సహాయాన్ని ఎకరానికి 5,000 రూపాయలకు పెంచి, 56,76,000 మందిని అర్హులుగా గుర్తించినప్పటికీ సెప్టెంబర్ 18 నాటికి 39,72,000 మందికి 4,381 కోట్లు జమ చేశారు. ఖరీఫ్ సీజన్ ముగింపుకు వస్తున్నా ఇంకా 13,18,000 మంది రైతులకు 2578 కోట్లు, రైతుబంధు సహాయం అందలేదు. కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సహాయానికి అర్హులుగా తేలిన వారు 75,000 మంది రైతులు మాత్రమే (6,000/-). ఈ పెట్టుబడి సహాయ పథకం నిజంగా ఉపయోగపడాలంటే వాస్తవ సాగుదారులకే పెట్టుబడి సహాయం అందాలి. సన్న, చిన్నకారు రైతులకు ఎక్కువ సహాయం అందాలి.
5. రైతు బీమా:
రాష్ట్రంలో భూమిపై పట్టా హక్కులు కలిగిన 30,00,000 మంది రైతులను 2018 ఆగస్టు 15 నుండీ రైతు బీమా పరిధిలోకి తెచ్చారు. ఈ పథకం క్రింద గత సంవత్సర కాలంలో 15,246 మందికి 762 కోట్ల 30 లక్షల రూ||లు బీమా పరిహారంగా అందించారు. 18-59 సంవత్సరాల మధ్య వయసు రైతులకు ఈ బీమా వర్తించడం వల్ల, ఆయా కుటుంబాలకు ఆర్థికంగా కొంత మేలు జరుగుతున్న మాట వాస్తవం. కానీ గ్రామీణ ప్రాంతంలో 59 సంవత్సరాలు దాటిన రైతులకు, భూమి లేని కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఈ పథకం వర్తించకపోవడం వల్ల, ఇంకా అనేక మరణాలు సంభవిస్తున్నా, అవి నమోదు కావడం లేదు. వారికి ఎటువంటి పరిహారమూ లభించడం లేదు. పైగా బీమా చేయబడ్డ కుటుంబాలలో కూడా భూమి యజమాని చనిపోయిన సందర్భంలో తప్ప, భూమి లేని కుటుంబ సభ్యులు (వారు రైతులుగా వున్నా) ఎవరు చనిపోయినా బీమా పరిహారం అందడం లేదు. ఈసారి బడ్జెట్లో కూడా 31 లక్షల మందినే రైతు బీమా పరిధిలోకి తెచ్చారు. 1,137 కోట్లు ప్రీమియం కోసం కేటాయించారు. గ్రామీణ ప్రాంత ప్రజలను, వ్యక్తి యూనిట్‌గా బీమా పరిధిలోకి తెచ్చి, ప్రభుత్వం ప్రీమియం చెల్లించగలిగితేనే గ్రామీణ కుటుంబాలకు దీని ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.
6. పంట రుణాలు / రుణమాఫీ:
రాష్ట్రంలో రైతులకు వడ్డీ లేని పంట రుణాలు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం సకాలంలో అందడం లేదు. 2014 ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్లుగా లక్ష రూపాయల రుణమాఫీ కూడా సక్రమంగా అమలు కాలేదు. దాని వల్ల మొత్తం వ్యవసాయరంగ బ్యాంకింగ్ రుణాల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. రైతులమీద వడ్డీ భారం పెడగడమే కాక, బ్యాంకులు కూడా పంట రుణాలు ఇవ్వడం పూర్తిగా తగ్గించేశారు. రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన తర్వాత భూముల రికార్డులు క్లియర్‌గా వున్నవి అని ప్రకటించిన భూముల ఖాతాలు 71,75,000 ఈ ఖాతాలలో రైతుబంధు సహాయం కోసం ఎంపిక చేసిన ఖాతాలు 2018 ఖరీఫ్‌లో 57,18,870 మాత్రమే. ఈ ఖాతాలలో కూడా మొత్తం పంట రుణ ఖాతాలు 37,60,753 వుండగా అందులో 2015 ఏప్రిల్ – డిసెంబర్ మధ్య కాలంలో కేవలం 24,12,790 ఖాతాలకు మాత్రమే పంట రుణాలు అందాయి. 2016 ఏప్రిల్ – డిసెంబర్ మధ్య కాలంలో 26,27,797 ఖాతాలకు మాత్రమే పంట రుణాలు అందాయి. 2017 ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య 18,46,799 ఖాతాలకు మాత్రమే పంట రుణాలు అందాయి. 2018 ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య కేవలం 17,65,858 ఖాతాలకు మాత్రమే పంట రుణాలు అందాయి. ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నది ఒక్కటే. రైతులకు పంట రుణాలు సకాలంలో అందరికీ అందడం లేదని. 2019 సామాజిక, ఆర్థిక నివేదిక ప్రకారం కూడా గత 3 సంవత్సరాలలో వడ్డీ రాయితీ చెల్లింపులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2015-16లో కేవలం 64.49 కోట్లు, 2016-17లో 190 కోట్ల 10 లక్షలు, 2017-18లో 289.28 కోట్లు వడ్డీ రాయితీ చెల్లించారు. ఇందులో రుణ మాఫీ సకాలంలో చేయకపోవడం వల్ల పడిన వడ్డీలు కూడా కలసి వున్నాయి. కౌలు రైతులకు, పోడు రైతులతకు, మహిళా రైతులకు అసలు బ్యాంకు రుణాలే అందడం లేదు. 2018 ఎన్నికలలో కూడా రుణ మాఫీ ప్రకటించినప్పటికీ 2019 బడ్జెట్లో కేవలం 6 వేల కోట్లు (25 శాతం) కేటాయించడం ఎప్పటికి రిలీజ్ చేస్తారో తెలవదు. ఈ సంవత్సరం కూడా రైతులకు పంట రుణాలు సరిగా అందడం లేదు. ఇది రైతులకు మరింత సంక్షోభంలోకి నెడుతుంది.
7. పంటల బీమా:
పంట రుణాలతో ముడిపడి ఉండడం వల్ల, పంటల బీమా అమలు తీరు మరింత అధ్వాన్నంగా వుంది. బీమా కంపనీలు ప్రీమియం రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. ప్రకృతి వైపరిత్యాలు పెరుగుతున్న దశలో ఆదుకోవాల్సిన పంటల బీమా, రైతులకు ఉపయోగపడడంలేదు. ఈ సంఖ్యలను గమనిస్తే ఎంత తక్కువ మంది రైరతులకు బీమా ప్రీమియం చెల్లింపు తేదీలోపు రుణాలు అందుతున్నాయో మనకు అర్థం అవుతుంది. ప్రభుత్వం బడ్జెట్లో నిధులు ఎక్కువ కేటాయించి, ప్రీమియం సకాలంలో కంపెనీలకు చెల్లిస్తే తప్ప, రైతులకు పంటల బీమా వల్ల ఉపయోగం వుండదు. పైగా జిల్లాలో ఒక్క పంటనే కాకుండా బీమా మార్గదర్శకాల ప్రకారం ప్రధాన పంటలన్నిటినీ గ్రామం యూనిట్‌గా బీమా పరిధిలోకి తేవాలి. వాతావరణ ఆధారిత పంటల బీమాకు ప్రధాన ప్రాతిపదికగా వున్న వర్షపాతం వివరాలను ఉచితంగా ప్రజలకు అందజేయాలి.
సంవత్సరం | బీమా పరిధిలోకి వచ్చిన రైతులు | లబ్దిదారులైన రైతుల సంఖ్య | పరిహారం అందినది |
2016 ఖరీఫ్ | 7,11,318 | 2,18,592 | 1,64,79,57,000 |
2016-17 రబీ | 2,67,253 | 16,842 | 13,69,94,000 |
2017 ఖరీఫ్ | 8,99,946 | 4,78,835 | 5,84,94,00,000 |
2017-18 రబీ | 1,77,370 | 11,500 | 17,96,00,000 |
2018 ఖరీఫ్ | 5,96,400 | ప్రాసెస్ | ప్రాసెస్ |
2018-19 రబీ | 1,97,862 | ప్రాసెస్ |
8. రైతుల ఆత్మహత్యలు / పరిహారం:
రాష్ట్రంలో ఇప్పటికే 4,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందులో న్యామైన ఆత్మహత్యలుగా గుర్తించినవి 2018 ఆగస్టు 14 నాటికి 1,200 మందిని మాత్రమే రైతు బీమా అమలులోకి వచ్చాక, ప్రత్యేకంగా రైతు ఆత్మహత్యలని గుర్తించడం మానేశారు. దీని వల్ల పూర్తిగా భూమి లేని కౌలు రైతులు మరణించిన సందర్భంలో వారికి పరిహారం సాధించడం చాలా కష్టంగా వుంది. గుర్తించిన 1,200 మంది ఆత్మహత్యలలో కూడా 700 మందికి మాత్రమే పరిహారం అందిచారు. కోర్టులో కేసు వేసిన తర్వాత మరో 243 మందికి పరిహారం చెల్లిస్తామని జీవో తెచ్చారు. నాలుగు వారాల్లో డబ్బు చెల్లిస్తామని ఇటీవలే కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ మిగిలిన 257 మందికి ఎప్పుడు పరిహారం చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పడం లేదు. బడ్జెట్లో కూడా దీని కోసం ఏ మాత్రం కేటాయింపులు చేయడం లేదు.
వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు – అమలు:
2014-15 నుండీ 2019-20 వరకూ తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులను, నిధుల విడుదలను, ఖర్చులను పరిశీలిస్తే ‘పంచ పాండవులు – మంచం కోళ్ళు’ సామెత గుర్తు వస్తుంది. కేటాయింపులు అవసరాలకు తగినంతగా ఉండవు. కేటాయింపులు భారీగా కనబడిన సందర్భంలో, నిధుల విడుదల సకాలంలో జరగదు. ఖర్చులు మరీ నామమాత్రంగా వుంటాయి. పైగా బడ్జెట్లలో శీర్షికలు మారిపోతుంటాయి. కేటాయించిన బడ్జెట్, రివైజ్ చేసే సందర్భంలో ఎందుకు తగ్గిపోతుందో కారణాలు వుండవు. ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయింపు సందర్భంలో, అంతకు ముందరి సంవత్సరాల ఖర్చుల లెక్కలు వుండవు. ఎందుకు ఖర్చు చేయలేకపోయారో కారణం తెలవదు. అంతా మాయా ప్రపంచం. కేంద్ర ప్రభుత్వం సహాయం అందించే పథకాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కలపకపోవడం వల్ల పథకాలు అమలు కావు. ఖర్చు జరగదు.
2015-16, 2016-17 సంవత్సరాల వ్యవసాయ రంగ ఖర్చులకు సంబంధించి ‘కాగ్’ నివేదిక మీద ఆధారపడితే తప్ప, ప్రభుత్వ బడ్జెట్ పత్రాలలో ఎక్కడా నిధుల ఖర్చు వివరాలు కనిపించవు. 2018-19 ఖర్చుల వివరాలు తెలియాలంటే మరో సంవత్సరం ఆగాలి. 2014-15, 2017-18 సంవత్సరాల ఖర్చుల వివరాలు మాత్రమే ప్రభుత్వ బడ్జెట్ పత్రాలలో దొరుకుతున్నాయి.
ఈ పత్రాలు కాగ్ నివేదికల ఆధారంగా, మేము రూపొందించిన పట్టికను పరిశీలించండి. వివిధ పథకాలకు నిధుల కేటాయింపు, ఖర్చుల వివరాలు చూస్తే ప్రభుత్వ పనితీరు అర్థమవుతుంది. మాటలెన్ని చెప్పినా, గ్రామీణ సంక్షోభం సమసిపోవాలంటే, ప్రభుత్వ నిధులు, వాస్తవ సాగుదారులకు ఉపయోగపడేలా ఖర్చు కావాలి. లబ్దిదారుల వివరాలను ప్రజల ముందు బహిరంగంగా వుంచాలి.
రైతులకు నేరుగా ఉపయోగపడే కొన్ని పథకాలను చూస్తే లబ్దిదారులు అతి తక్కువగా ఉంటున్నారని అర్థమవుతుంది.
సంవత్సరం | విత్తన రాయితీ | లబ్ది పొందిన రైతులు |
2014-15 | 86,33,74,000 | 7,38,000 |
2015-16 | 1,26,04,77,000 | 8,76,000 |
2016-17 | 1,42,23,80,000 | 9,44,000 |
2017-18 | 91,76,22,000 | 7,54,000 |
2018-19 | 1,31,82,50,000 | 5,79,000 |
పై పట్టికను పరిశీలిస్తే రాష్ట్రాన్ని విత్తన బౌలుగా మారుస్తామని చెప్పిన ప్రభుత్వం, నిధుల ఖర్చులో ఇంత తక్కువ చేస్తుందో అర్థమవుతుంది. పైగా లబ్దిపొందుతున్న రైతుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతున్నది. విత్తన బ్యాంకులకు నిధుల కేటాయింపు లేదు. విత్తనాలను రైతుల నుండి సేకరించే విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. కేవలం కంపనీల నుండి, ఇతర రాష్ట్రాల నుండి విత్తనాలు కొనేందుకే ప్రాధాన్యత ఇస్తున్నది. నాణ్యత లేని కల్తీ విత్తనాలు కంపెనీలు అమ్మడం వల్ల, రైతులు ప్రతి సంవత్సరం తీవ్రంగా నష్టపోతున్నారు.
- మైక్రో ఇరిగేషన్: కేంద్రం ఈ విషయంలో మద్ధతు అందిస్తున్నా గత 5 సంవత్సరాలలో 2,46,000 మంది రైతులకు మాత్రమే 4,65,974 ఎకరాలకు డ్రిప్, 1,89,436 ఎకరాలకు స్ప్రింక్లర్స్ (మొత్తం 6,55,410 ఎకరాలు) అందించారు. ఇంకా వేలాది మంది రైతులు, లక్షల ఎకరాలకు సూక్ష్మ సేద్య నీటి పరికరాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ స్థితిలో బడ్జెట్ మరింత పెంచాల్సింది పోయి, కేంద్రం అందించే 5,04,79,000 తప్ప రాష్ట్ర బడ్జెట్లో ఒక్క రూపాయీ కేటాయించలేదు.
- ఉద్యానశాఖ పరిధిలో పాలీహౌజ్‌ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ, బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినప్పటికీ, గత 5 సంవత్సరాలలో 260.16 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 1,210.37 ఎకరాలలో పాలీహౌజ్‌లను నిర్మించారు. వాస్తవానికి మన లాంటి రాష్ట్రంలో ఇప్పుడు పాలీహౌస్‌లను నిర్మిస్తున్న పద్ధతి ఏ మాత్రం ఉపయోగం లేనిది. రైతులు కూడా సంతోషంగా లేరు. పైగా అనేక మంది రైతులు దళారులు, బ్యాంకర్లు చేసిన మోసాల వల్ల తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యారు.
- తెలంగాణా రాష్ట్ర, విత్తనాభివృద్ధి కోసం 2018-19, 2019-20లలో ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదు.
- 2018-19లో 6 కోట్ల 29 లక్షలు పట్టుశాఖకు కేటాయించిన ప్రభుత్వం 2019-20లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. వ్యవసాయ విద్య, పరిశోధన కోసం 2018-19లో 101 కోట్ల 30 లక్షలు కేటాయించిన ప్రభుత్వం 2019-20లో కేవలం 30 కోట్లు కేటాయించారు. ఇందులో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 20 కోట్లు, ఉద్యాన విశ్వవిద్యాలయానికి 10 కోట్లు మాత్రమే కేటాయించారు. రాబోయే కాలంలో కూడా యూనివర్శిటీలలో, పరిశోధనా కేంద్రాల్లో ఏ కార్యక్రమాలూ సాగవన్నమాట. ఇప్పటికే నిర్వీర్యమైన వ్యవసాయ విద్య, పరిశోధనలు మరింత కుంటుపడతాయి.
- రాష్ట్రంలో అత్యంత కీలకమైన వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు 2018-19లో 100 కోట్ల 86 లక్షలు కేటాయించిన ప్రభుత్వం 2019-20లో కేవలం 6 కోట్ల 42 లక్షలు కేటాయించింది.
- రాష్ట్రంలో ఉద్యానశాఖకు 2018-19లో 280 కోట్ల 41 లక్షలు కేటాయించిన ప్రభుత్వం, 2019-20లో కేవలం 19 కోట్ల 36 లక్షలు కేటాయించింది.
- మిగిలిన పథకాలను చూసినా పరిస్థితి భిన్నంగా లేదు. పంటల బీమా పథకం ప్రీమియం చెల్లింపుకు కేవలం 2 కోట్ల 81 లక్షలు కేటాయించారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. రైతులకు విత్తన సరఫరా కోసం బడ్జెట్ 2018-19లో 105 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఈ సారి దానిని 55 కోట్లకు తగ్గిరచేసింది.
- ఉద్యానశాఖ పరిధిలో జాతీయ ఉద్యాన పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
- గ్రామీణ మౌళిక సదుపాయాల కోసం, పాలిహౌజ్‌ల కోసం, ఇతర రాయితీల కోసం, కూడా అసలు డబ్బులు కేటాయించలేదు.
- చాలా సందర్భాలలో ఉద్యోగుల జీతభత్యాలకు తప్ప, పథకాల అమలుకు నిధులు కేటాయించలేదంటే, రైతులకు ఈ సంవత్సరం ఏ సహాయమూ అందదని అర్థం. నిర్వహణ కోసం నిధులు పెంచడం లేదంటే కొత్త ఉద్యోగుల నియామకం కూడా లేనట్లే అర్థం చేసుకోవాలి.
పంటలకు మద్ధతు ధరలు:
- గత 5 సంవత్సరాలలో ప్రధాన పంటలకు మద్ధతు ధరలు అందడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం వరి ధాన్యాన్ని సేకరిస్తున్నా, రైతులకు సకాలంలో చేతికి డబ్బులు రావడం లేదు.
- తెలరగాణా రాష్ట్రంలో పంటల ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ, విషాదం ఏమిటంటే, కేంద్ర స్థాయిలో సి.ఎ.సి.పి. ఉత్పత్తి ఖర్చులను పరిగణనలో తీసుకునే సందర్భంలో 2015-16, 2016-17 సంవత్సరాల ఉత్పత్తి ఖర్చుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిన దాఖలా లేదు. 2019-20 ఖరీఫ్ సి.ఎ.సి.పి. నివేదికలో, ఆంధ్రప్రదేశ్ వివరాలు తప్ప, తెలంగాణ రాష్ట్ర ఉత్పత్తి ఖర్చుల వివరాలు లేవు.
- ఒక వేళ ఆ వివరాలనే పరిగణనలో పెట్టుకుంటే, రాష్ట్ర పంటల ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా కేంద్రం ప్రకటించే మద్ధతు ధరలు లేవని అర్థమవుతుంది. దాని వల్ల రాష్ట్ర సగటు దిగుబడి ప్రకారం ఉత్పత్తి వచ్చినా, ఎం.ఎస్.పి. అందిందని అనుకున్నా రైతులకు నికరంగా మిగిలేది చాలా తక్కువ. ఇలాంటి సందర్భాలలో ఆయా రాష్ట్రాలు రైతులకు ప్రత్యేకించి బోనస్ చెల్లిస్తున్నాయి. కానీ, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అలా బోనస్ చెల్లించలేదు. ఈ సారి కూడా బడ్జెట్లో అందుకోసం నిధులు కేటాయించుకోలేదు. రైతుబంధు పేరుతో నిధులు అనర్హులకు అందించడం కంటే, ధరల బోనస్ పేరుతో అందిస్తే, వాస్తవ సాగుదారులకు లాభం జరుగుతుంది.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో వ్యవసాయం
- గత 5 సంవత్సరాల అనుభవం పరిశీలిస్తే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్ళిస్తున్నారని అర్థం అవుతుంది. ఈ నిధుల వినియోగాన్ని లోతుగా పరిశీలించాల్సి వుంది.
- ఎస్సీ సబ్‌ప్లాన్‌లో 2018-19 సంవత్సరానికి రైతుబంధు కోసం 1,854 కోట్లు కేటాయించారు. ఇంత మొత్తానికి బడ్జెట్ విడుదల ఆర్డర్ కూడా ఇచ్చారు. కానీ 1,364 కోట్ల 97 లక్షల 96 వేలు ఖర్చు చేశారు. అంటే ఎకరానికి సంవత్సరానికి 8,000 రూపాయల చొప్పున 17 లక్షల ఎకరాలకు చెల్లించినట్లు లెక్కలు చెబుతున్నాయి. కానీ, నిజంగా ఈ నిధులన్నీ దళిత కుటుంబాల భూములకే సహాయంగా వెళ్ళిందా, లేదా అన్నది పరిశీలించాలి.
- ఎస్టీ సబ్‌ప్లాన్ నుండి 2018-19లో రైతుబంధు కోసం 1,089 కోట్ల 60 లక్షలు కేటాయించారు. ఇంత మొత్తానికి బడ్జెట్ విడుదల ఆర్డర్ కూడా ఇచ్చారు. దీని ప్రకారం ఎకరానికి 8 వేల చొప్పున 12 లక్షల ఎకరాలకు సహాయం అందిందని అర్థమవుతుంది. కానీ అటవీ హక్కుల చట్టం ప్రకారం 2018 నవంబర్ 30 నాటికి 93,369 మంది రైతులకు 3,00,284 ఎకరాలకు వ్యక్తిగత పట్టాలు ఇచ్చారు. రైతు బంధుకు ఈ వ్యక్తిగత పట్టాలనే పరిగణనలో పెట్టుకుంటారని అనుకుంటే మరి 12 లక్షల ఎకరాలకు సహాయం అందించినట్లు ఎలా చూపిస్తున్నారో లోతుగా పరిశీలించాలి.
- ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ క్రింద మిగిలిన వ్యవసాయరంగ పథకాలకు కేటాయింపులు, ఖర్చులు నామ మాత్రంగా వున్నాయి. దాని వల్ల దళిత, ఆదివాసీ రైతు కుటుంబాలు సరైన సహాయం అందక సంక్షోభం నుండి బయటపడలేక పోతున్నాయి.