పురుగు మందులా?…. పురుగు విషాలా ?
పురుగు మందులా?…. పురుగు విషాలా ?
పేరులో ఏముంది… పురుగు మందులా ? విషాలా ?
‘పురుగు మందులు’ చాలా ఘాటైన, తీవ్రత కలిగిన రసాయనాలు. అవి చాలా విషపూరితమైనవి. అనేక రకాలైన ప్రాణులను చంపగలిగే శక్తి ఉంటుంది. పంటపై వచ్చే పురుగులనే కాక చాలా పెద్ద జీవాలైన మనుషులను, గొడ్లను, పక్షులను చంపే శక్తి కలవి. ఇటువంటి విషాలను ‘మందులు’గా పిలుస్తుండటం వల్ల చాలా మంది వీటిని అభ్యంతరం లేకుండా విస్తారంగా వాడుతున్నారు.
పురుగు విషాల వాడకంతో సమస్యలు :
మొదటిగా పురుగు విషాలు చల్లేవారు వీటి యొక్క ప్రభావానికి ఎక్కువ గురవుతుంటారు. చల్లిన పురుగు మందు చెదురుతూ చర్మం ద్వారా శరీరంలోకి చేరుతుంది. లేదా నోటి ద్వారా, పీల్చిన గాలి ద్వారా ఊపిరితిత్తులలోకి వెళ్ళి రక్తంలో కలుస్తుంది. వీటి ప్రభావం వెంటనే నాడి వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఫలితంగా కళ్ళు తిరగటం, మూర్చపోవటం, చమట పోయడం సంభవిస్తుంది. చాలాసార్లు వెంటనే చనిపోతారుకూడా. ఒకవేళ వెంటనే చనిపోకపోయినా ఒంట్లో చేరిన విషం జీవితాంతం ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ విషాలు శరీరంలోని క్రొవ్వులలో కరిగి పేరుకుని ఉంటాయి. ఇంక శరీరం నుండి బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు.
మహిళల మీద ప్రభావం : మహిళలు చాలా సందర్భాలలో పురుగువిషాలు చల్లకపోయినా వీటి ప్రభావానికి గురవుతూనే ఉంటారు. వీరు పురుగు విషాలను చల్లే ముందు నీళ్ళలో కలిపే పని, స్ప్రేయర్ ఖాళీ అవగానే వెంటనే ద్రావణాన్ని పోసేందుకు వీలుగా దాన్ని కుండల్లో పోసుకుని నెత్తిమీద పెట్టుకుని స్ప్రేయర్ వెంట వెళ్తుంటారు. అలాంటి సందర్భాలలో కూడా ఆ విష ద్రావణం శరీరంమీద పడుతుంది. గాలిద్వారా లోనికి ప్రవేశిస్తుంది. ఇలాంటి పనుల్లో నిమగ్నమయ్యే మహిళలు విష ప్రభావానికి వెంటనే చనిపోకపోయినా వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. వీరిలో ముఖ్యంగా కనిపించేది పునరుత్పత్తి శక్తి దెబ్బతినటం. గర్భకోశాలకు సమస్యలు వచ్చి తీసివేయవలసి వస్తుంది. గర్భం ధరించలేకపోవచ్చు. ధరించినా నిలువలేకపోవచ్చు. నిలిచినా ఆరోగ్యకరమైన పిల్లలను కనలేకపోవచ్చు.
పిల్లల మీద ప్రభావం : ఈ విషాల ప్రభావానికి పిల్లలు కూడా గురవుతారు. ఇంట్లోని ఈ విషాలను అందుకోవటం, ఖాళీ అయిన విషాల డబ్బాలతో ఆటలాడటం మొదలైనవి. చుట్టూ వాతావరణంలో ఉండే పురుగు మందుల అవశేషాలతో వీరి మానసిక, శారీరక పెరుగుదల దెబ్బతింటుంది. చురుకుగా ఉండలేరు.