పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం – సుస్థిర వ్యవసాయ కేంద్రం
పచ్చిమిర్చిలో ‘కాప్సిసిన్’ అనే ఆల్కలాయిడ్ మరియు వెల్లుల్లిలో ‘అల్లెసిస్’ అనే ఆల్కలాయిడ్లు ఉంటాయి. ఇవి పురుగుకు స్పర్శ చర్య ద్వారా ‘తిమ్మిరి’ గుణాన్ని కలిగిస్తాయి. దీనివలన పురుగు తక్షణం చనిపోతుంది. లేదా మొక్క పైనుండి క్రిందపడి చనిపోతుంది. క్రింద పడిన పురుగులను చీమలు తినేసే అవకాశం వుంది.
శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, దాసరి పురుగు, ఎర్రగొంగళి పురుగు (మూడవ దశ వరకు) నివారణకు ఈ ద్రావణాన్ని పత్తి, కంది, శనగ, వేరుశనగ, ఆముదం, వంగ, టమాట, మిరప పంటలలో రైతులు పురుగు ఉధృతిని బట్టి వాడవచ్చు.
తయారీకి కావలసిన పదార్థాలు:
పచ్చిమిర్చి – 3 కిలోలు
వెల్లుల్లి – అరకిలో
కిరోసిన్ – పావులీటరు (250 మి.లీ)
సబ్బుపొడి – 100 గ్రా||
తయారు చేసే విధానం:
- 3 కిలోల పచ్చి మిరపకాయలను మెత్తగా నూరి, దానిని 10 లీటర్ల నీటిలో ఒక రాత్రంతా బాగా నానబెట్టాలి.
- అర కిలో వెల్లుల్లిపాయలను పొట్టుతీసి వాటిని బాగా నూరి 250 మి.లీ. కిరోసిన్లో ఒక రాత్రంతా నానబెట్టాలి.
- మర్నాడు పచ్చిమిర్చి ద్రావణాన్ని ఒక పలుచని గుడ్డతో వడపోయాలి.
- అదేవిధంగా వెల్లుల్లి ద్రావణాన్ని కూడా గుడ్డతో వడపోయాలి.
- మిరప ద్రావణం, వెల్లుల్లి ద్రావణం 100 గ్రాముల సబ్బుపొడి ద్రావణం, ఈ మూడింటిని బాగా కలిపి మిశ్రమాన్ని తయారు చేయాలి. తయారు చేసిన ద్రావణం సుమారు 10 లీ. వరకు ఉంటుంది.
- ఈ విధంగా తయారు చేసిన ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరా పొలంలో సాయంత్రం పూట పిచికారీ చేయాలి.
జాగ్రత్తలు:
- ఈ ద్రావణం చాలా శక్తివంతమైన క్రిమిసంహారకంగా పనిచేస్తుంది.
- ఈ ద్రావణం పంటలపై పిచికారి చేసిన 4-5 రోజుల తరువాత పశువుల పేడ మరియు మూత్రం ద్రావణం పిచికారీ చేయడం చాలా మంచిది. దీని వలన పంటలకు పోషకాలు లభించి ఆరోగ్యవంతంగా ఉంటాయి.
- ఈ ద్రావణం తయారు చేసేటపుడు ఒంటికి నూనె రాసుకోవటం అవసరం.
- పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం పంటలపై పిచికారీ చేసేటపుడు ఒంటిపై పూర్తిగా బట్టలు ధరించాలి.
- పంట కాలంలో 1-2 సార్లు ఈ ద్రావణాన్ని వాడుకోవచ్చు.
- తయారు చేసిన ద్రావణాన్ని నిల్వ ఉంచరాదు.
- పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం పంటలలో వచ్చే పెద్ద పురుగుల నియంత్రణలో 2 సార్లు 10 రోజుల వ్యవధిలో వాడి మంచి ఫలితాలు సాధించవచ్చు.