నేల వేము
నేల వేము
నేలవేము మొక్కను కొన్ని ప్రాంతాలలో ”కాల్మేఘ్” అని కూడా అంటారు. ఈ మొక్క సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే మందు మొక్క. మొక్కకు అనేక శాఖలు వుంటాయి. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడి కోలాకారంలో ఉంటాయి. పుష్పాలు అక్టోబరు – జనవరి మాసాలలో ఎక్కువగా పూస్తాయి. ఈ మొక్క రబీ సీజన్లో (నవంబరు – జనవరి) ఎక్కువగా కనబడుతుంది. ఈ మొక్క ఎక్కువగా అడవులకు దగ్గరగా వున్న భూములలోనూ, తేలికపాటి నేలలలోనూ అభివృద్ధి చెందుతుంది. ఇటీవల కాలంలో ఈ మొక్కను వైద్యం కోసం గృహాలలో కూడా పెంచుకోవటం జరుగుతోంది. ఈ మొక్క ఆకులు, వేర్లు ఎక్కువ చేదుగా ఉంటాయి. ఈ మొక్కలో ఆండ్రో గ్రాఫిన్, కాల్నెగిన్, ఆండ్రో గ్రాఫోలిడ్ వంటి రసాయనాలు వుంటాయి.
నేల వేము మొక్కలో వున్న ”ఆండ్రోగ్రాఫోలిడ్” అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా, భక్షక నిరోధకంగా మరియు క్రిమి సంహారకంగా పని చేస్తుంది. అందువల్ల ఆకులను సస్యరక్షణలో ‘కషాయం’గా గానీ, ”పంచపత్ర కషాయం” (వివిధ ఆకుల ద్రావణం)లో గానీ రైతులు వుపయోగించుకోవచ్చు.
నేలవేము మొక్క ఆకులలో వున్న రసాయనాలు ఎంతో శక్తివంతమైనవి. నేలవేము కషాయానికి పంటలపై వచ్చే రసం పీల్చే పురుగుల పైన, ఆకులను తినే గొంగళి పురుగుల పైన మరియు కాండం తొలిచే పురుగుల పైన వాడి, పురుగులను సమర్ధవంతంగా నివారించవచ్చని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం కోయంబత్తూరు శాస్త్రజ్ఞుల పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
ఒక ఎకరా పంటకు సుమారు 5 కిలోల నేలవేము ఆకు అవసరమవుతుంది. ఈ ఆకులను 10 లీటర్ల నీటిలో ఒక గంటసేపు బాగా ఉడకబెట్టాలి. ఈ విధంగా ఉడక బెట్టిన ద్రావణం సుమారు 5 లీటర్ల వరకు ఉంటుంది. కషాయాన్ని బాగా చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. వడపోసిన కషాయానికి 100 గ్రాముల సబ్బు పొడిని లేదా 500 గ్రాముల కుంకుడుకాయ రసాన్ని కలపాలి. ఈ ద్రావణానికి 100 లీటర్ల నీటిని చేర్చి ఒక ఎకరా పంటకు సాయంత్రం వేళ పిచికారీ చేయాలి. కషాయం బాగా ఉడుకుతున్నప్పుడు ద్రావణాన్ని మధ్యమధ్యలో ఒక కర్రతో కలుపుతూ ఉండాలి. నేల వేము కషాయాన్ని ఉపయోగించి వరిలో వచ్చే కాండం తొలుచు పురుగు (తెల్లకంకి)ను నివారించడం ఈ రచయిత చూడటం జరిగింది. ఈ పురుగును నివారించడానికి నేలవేము కషాయం కనీసం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు ఉపయోగించవలసి వస్తుంది.
Tag:నేల వేము