నల్లేరు
నల్లేరు
ఈ మొక్క ఎక్కువగా వర్షాభావ ప్రాంతాలలో కంచెల వెంబడి తాడి, మర్రి మొదలగు చెట్లపైన పెరిగే బహువార్షికపు పొద. సుమారు 10-12 మీటర్ల వరకు పెరుగుతుంది. కాండం నలుపలకలగా ఉండి, రసంతో కూడి ఉంటుంది. కణుపుల వద్ద నొక్కులు కలిగి ఉంటుంది. చిన్న చిన్న పత్రాలు అండాకారంగా ఉంటాయి. పత్రానికి ఎదురుగా ఒక చిన్న నులితీగ ఏర్పడుతుంది. పత్రానికి ఎదురుగా గుత్తులుగా వంగ పండు రంగులో పుష్పాలు ఏర్పడతాయి. ఫలాలు గుండ్రంగా ద్రాక్ష పండ్లవలె వుంటాయి. ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ అంతటా తేలికపాటి నేలల్లో లభిస్తుంది. ఈ మొక్కను వైద్యపరంగా ముఖ్యంగా విరిగిన ఎముకలు అతుక్కోవడం కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా అనేక వ్యాధుల నిర్మూలనలో కూడా ఈ మొక్కను వైద్య పరంగా ఉపయోగిస్తారు.
నల్లేరు మొక్కలో వున్న రసాయనాలు ఎంతో శక్తివంతమై నవి. నల్లేరు కషాయానికి శిలీంద్రనాశిని లక్షణాలు వున్నాయని, పంటల నాశించు తెగుళ్ళపై వాడి, తెగుళ్ళను నివారించవచ్చని ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయం శాస్త్రజ్ఞుల పరిశోధనలు నిరూపిస్తున్నాయి (డా|| శ్రీవాస్తవ 2010). నల్లేరు మొక్క కషాయాన్ని వేరుశనగ పంటను ఆశించే తిక్కా ఆకుమచ్చ తెగులు (తొలిదశలలో)పై వుపయోగించినప్పుడు మంచి ఫలితాలు కనపడ్డాయి (రైతుల అనుభవం). ఈ మొక్క ”శిలీంద్ర నాశని” గుణాలపై శాస్త్రజ్ఞుల పరిశోధనలు ఎంతో అవసరముంది.
అనంతపురం జిల్లాలో రైతులు ఈ మొక్కను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి వీటిని పప్పుతో వండుకుని తింటారు. ఇది ఒక బలవర్ధక ఆహారమని, రోగ నియంత్రణలో సహాయపడుతుందని రైతుల నమ్మకం.
Tag:నల్లేరు