తుమ్మి మొక్క
తుమ్మి మొక్క
ఈ మొక్క ఎక్కువగా వర్షాభావ ప్రాంతాలలో, తేలికపాటి నేలలో పెరిగే ఏకవార్షిక కలుపు మొక్క. సుమారు 15-60 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. కాండం నలుపలకలుగా ఉండి, నూగును కలిగి ఉంటుంది. సన్నని అండాకారం కలిగిన పత్రాలు కణుపుకు ఇరువైపులా ఉంటాయి. పత్రాలు వ్యాక్స్ (నూనె వంటి పదార్థం)ను కలిగి ఉంటాయి. పత్రాలపై స్పష్టమైన చారలు ఉంటాయి. పుష్పాలు తెలుపు రంగుతో ఉండి శాఖల చివర గుత్తులుగా వస్తాయి. పుష్పవృతం వుండదు. పుష్ప గుచ్ఛాలు ముండ్ల వంటి కొనలను కలిగి ఉంటాయి. ఫలాలు 2.5 మిల్లీ మీటర్ల పొడవుండి, బూడిదరంగు విత్తనాలను కలిగి ఉంటాయి. ఈ మొక్కను ఆదివాసీయులు వైద్యపరంగా అనేక వ్యాధుల నిర్మూలనలో ఉపయోగిస్తారు.
ఈ మొక్కలో బీటా-సైటోస్టిరాల్, నికోటెన్, గ్లూకోసైడ్స్, ఫ్లావనాయిడ్స్, టెర్పైన్స్, యుర్ సోలిక్ ఆమ్లము వంటి అనేక ముఖ్యమైన రసాయన పదార్థాలు వుంటాయి. (డా|| శ్రీనివాసన్ – 2011)
ఈ మొక్కను దగ్గు, ఆస్త్మా, తలనొప్పి, చర్మ వ్యాధుల నివారణలో చాలా కాలంగా ఆదివాసీయులు వుపయోగిస్తున్నారు. అదే విధంగా ఈ మొక్కను తేలు కాటుకు విరుగుడుగా కూడా వుపయోగిస్తారు. తుమ్మి మొక్కలో వున్న రసాయనాలు చాలా శక్తివంత మైనవి. ఈ రసాయనాలు కీటకాలకు అభివృద్ధి నిరోధకంగానూ, కీటకనాశనిగానూ పని చేస్తాయని డా|| శర్మ (2009), డా|| జూలియర్ (2013) పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
ఈ మొక్క యొక్క కషాయానికి పంటలను ఆశించే పిండి పురుగు, రసం పీల్చే పురుగులను నివారించే గుణం వుండని డా|| ముఖర్జీ (2009) పరిశోధనలలో తేలింది. తుమ్మి మొక్క కషాయానికి దోమలను నివారించే లక్షణాలు వున్నాయని డా|| జూలియర్ (2013) పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ మొక్కలను సేకరించి, బాగా ఎండబెట్టి, ధూపంగా వేసి దోమల నివారణలో వుపయోగిస్తారు. ఈ మొక్కను రైతులు పురుగుల నివారణకోసం పంచపత్ర కషాయంలో వుపయోగించుకోవచ్చు.
Tag:తుమ్మి మొక్క