కందిలో కాయతొలుచు పురుగు నివారణ – సుస్థిర వ్యవసాయ కేంద్రం
ఆకుచుట్టు పురుగు:
కంది పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు ఆశిస్తుంది. ఈ పురుగు ఆకులను చుట్టగా చుట్టుకుని ఆకులను తింటుంది. ఈ పురుగు ఉధృతి అక్టోబర్ – నవంబర్ మాసాలలో ఎక్కువగా ఉంటుంది.
నివారణ: 5 శాతం వేప కషాయం లేదా నీమాస్త్రం వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పంటపై పిచికారీ చేయాలి.
కాయ తొలుచు పురుగు: (శనగపచ్చ పురుగు)
- శనగపచ్చ పురుగు కంది పంటను ఆశించే పురుగులలో చాలా ముఖ్యమైనది మరియు పంటకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ పురుగు పూత, పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటుంది. ఈ పురుగు తల భాగాన్ని కాయలలోకి చొప్పించి, వెనుక భాగాన్ని కాయ వెలుపల ఉంచుతుంది. ఈ లక్షణం వలన ఈ పురుగును సులభంగా గుర్తుపట్టవచ్చు.
- ఈ పురుగు జీవిత చక్రం సుమారు 30 నుండి 40 రోజుల వరకు ఉంటుంది. కంది పంటలో 4 నుండి 5 తరాలు ఈ పురుగు జీవిస్తుంది.
- ఈ పురుగు పూత పైన మరియు ఎదుగుతున్న పిందెలపైన సుమారు 500 నుండి 700 వరకు గుడ్లను విడివిడిగా పెడుతుంది.
నివారణ:
- వేసవిలో లోతు దుక్కి చేయడం వల్ల భూమిలోని పురుగు కోశస్థ దశ బయటపడి పక్షులు ఏరుకు తినటానికి వీలవుతుంది.
- ఖరీఫ్ కరదిలో అంతర పంటగా 7 సాళ్ళు పెసర/ మినుము, తదుపరి రబీలో జొన్న 2 సాళ్ళు వేయడం ద్వారా పరాన్న జీవులను వృద్ధి చేయటానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సాళ్ళు జొన్న రక్షిత పైరుగా విత్తాలి.
- పచ్చ పురుగును తట్టుకునే ఐ.సి.పి.యల్ 332 రకాన్ని లేక పురుగు ఆశించినప్పటికీ తిరిగి పూతకు రాగల యల్ఆర్జి. 30 రకాన్ని సాగు చేయాలి.
- ఎర పంటగా బంతిని వేయాలి. (ఎకరానికి 100 మొక్కలు)
- పశువుల పేడ + మూత్రం ద్రావణం పంటపై 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. దీనివలన రెక్కల పురుగు పంటపై గ్రుడ్లు పెట్టకుండా కొంత వరకు పనికి వస్తుంది.
- లింగాకర్షక బుట్టలను ఎకరానికి 5 చొప్పున అమర్చి శనగపచ్చ పురుగు ఉనికిని (లింగాకర్షక బుట్టలలో పడిన తల్లి పురుగులను) గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
- పురుగు గ్రుడ్లను, తొలిదశ పురుగులను గమనించిన వెంటనే వేపగింజల కషాయాన్ని (5%) లేక వేప సంబంధమైన మందులను లేదా నీమాస్త్రాన్ని పంటపై పిచికారీ చేయాలి.
- యన్.పి.వి. వైరస్ ద్రావణం ఎకరాకు 250 ఎల్.ఇ పంటపై పిచికారీ చేయాలి.
- పురుగు ఆశించిన కాయలను ఎప్పటికప్పుడు పొలం నుండి ఏరి నాశనం చేయాలి.
- పురుగులను తినే రైతు మిత్ర పక్షులు పక్షి స్థావరాలపై వాలి పొలంలోని పురుగులను ఏరుకుతింటాయి. అందువల్ల ఎకరానికి 10 చొప్పున పక్షి స్థావరాలను అమర్చాలి.
- పురుగు పొలంలో కనబడిన వెంటనే ”దులుపుడు చర్య”ను చేయడం వలన పురుగులను సుమారు 80 శాతం వరకు అరికట్టవచ్చు. ఈ దులుపుడు చర్య పురుగు ఉధృతిని బట్టి కనీసం 2-3 సార్ల వరకు చేయవలసి ఉంటుంది. (రెండు కంది సాళ్ళ మధ్య ఒక బట్టనుగానీ, ప్లాస్టిక్ పేపర్‌ను గానీ పరిచి రెండు సాళ్ళలో ఉండే కంది మొక్కలను జాగ్రత్తగా దులపడం వలన కందినాశించిన శనగపచ్చపురుగు లార్వాలు మొక్క నుండి క్రింద పరచిన పేపర్ మీద పడతాయి. ఈ విధంగా సేకరించిన లార్వాలను పంటకు దూరంగా తీసుకువెళ్ళి నాశనం చేయాలి. ఇటీవల కాలంలో దులుపుడు చర్యలో సేకరించిన లార్వాలను ఎన్.పి.వి. వైరస్ ద్రావణం తయారు చేయడానికి వుపయోగిస్తున్నారు.)
- పైన సూచించిన చర్యలను తగిన సమయంలో చేపట్టినప్పుడు సాధారణంగా పురుగు ఉధృతి అదుపులో ఉంటుంది. ఒక వేళ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనట్లైతే పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో 5 శాతం వేప కషాయం లేదా నీమాస్త్రం లేదా వేప సంబంధిత పురుగు మందులను (వృక్ష సంబంధమైన రసాయనాలను) పురుగు ఉధృతిని బట్టి 2-3 సార్లు వారం రోజుల వ్యవధిలో పంటపై సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి.
- యాజమాన్య పద్ధతులను మరియు నివారణ పద్ధతులను రైతులందరూ సామూహికంగా చేపట్టినట్లైతే శనగపచ్చ పురుగును అదుపులో ఉంచవచ్చు.
Tag:కాయతొలుచు పురుగు