ఉమ్మెత్త
ఉమ్మెత్త
ఉమ్మెత్త మొక్క ఆకుల కషాయాన్ని వుపయోగించి పంటలపై వచ్చే పురుగులను (రసంపీల్చే పురుగులు మరియు కాయతొలిచే పురుగులు) సమర్థవంతంగా నివారించవచ్చు. ఉమ్మెత్త ఆకుల కషాయానికి స్పర్శ చర్య, ఉదర చర్య వుంటాయి. అందువల్ల ఈ కషాయం ఒక శక్తి వంతమైన కీటక నాశనిగా పనిచేసి పురుగులను అదుపులో ఉంచుతుంది. ఉమ్మెత్త ఆకులను వివిధ ఆకుల ద్రావణం (కీటక నాశని) తయారీలో వుపయోగించవచ్చు.
ఉమ్మెత్త ఆకుల ద్రావణానికి బొద్దింకలను నివారించే గుణాలున్నాయని డా|| ఖాన్ (ఆలీఘర్ విశ్వవిద్యాలయం – ఉత్తర ప్రదేశ్) పరిశోధనలలో నిరూపితమైంది. దోమల లార్వాలను నిర్మూలించే గుణం ఉమ్మెత్త ద్రావణానికి ఉందని డా|| పంకజ్టాండన్ పరిశోధనలు తెలుపుతున్నాయి. పత్తి పంటలో ఆకులు తినే పురుగుల నివారణకు అమ్రేలీ జిల్లా (గుజరాత్) రైతులు ఈ క్రింది పద్ధతిని వుపయోగిస్తున్నారు.
సుమారు 250-300 గ్రాముల ఉమ్మెత్త ఆకులను మరియు కొమ్మలను చిన్న చిన్న ముక్కలుగా చేసి 1 లీటరు వేడి నీటిలో వేయాలి. తయారైన ద్రావణాన్ని బాగా చల్లారిన తర్వాత 15 లీటర్ల నీటిలో కలిపి పత్తిపంటపై మొక్క తడిసేటట్లు పిచికారీ చేయాలి. సుమారు 6 – 7 గంటల వ్యవధిలో ఆకులు తినే పురుగుల చిన్న చిన్న లార్వాలు నివారించబడతాయి.
ఉమ్మెత్త ఆకుల కషాయానికి పంటలో వచ్చే మిడతలను, పండ్లతోటల నాశించే జులుకుల (రెడ్ ట్రీ ఆంట్స్)ను అదుపు చేసే లక్షణాలు వున్నాయని ఇటీవల జరిగిన శాస్త్ర పరిశోధనలలో తేలింది. (తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం – కోయంబత్తూర్).
Tag:ఉమ్మెత్త