అలోవీరా కలబంద
ఇంగ్లీషు పేరు: అలోవీరా
శాస్త్రీయ నామం: అలో బార్బడెన్ సిస్ (లేదా) అలోవీరా
కుటుంబం: జాంతోరిఏసియా (లిలియేసి)
అలోవీరా సుమారు 2 అడుగుల ఎత్తు పెరిగే రసవంతమైన పత్రాలతో పెరిగే బహువార్షిక మొక్క. పత్రాలు దగ్గరగా ఒకే చోటు నుండి గుత్తివలె వస్తాయి. పత్రాలు అడుగు భాగం వెడల్పుగా ఉండి, రానురానూ సన్నబడుతూ ఉంటాయి. పత్రాల అంచులకు చిన్న ముండ్లు ఉంటాయి. పత్రాలు లేత ఆకుపచ్చ రంగు నుండి ముదురు ఆకుపచ్చరంగును కలిగి వుంటాయి. పుష్పాలు ఒక మీటరు పొడవుండే అక్షంపై ఏర్పడతాయి. పుష్పాలు నారింజ రంగులో ఉండి, గొట్టాలవలే ఉంటాయి. ఫలం గుళిక. ఈ మొక్క మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ, ఉద్యానవనాలలోనూ, ఆకర్షణ కోసం గృహాలలోనూ ఎక్కువగా పెంచబడుతోంది.
ఇటీవల కాలంలో అలోవీరాను సౌందర్య సాధనాలలో ఉపయోగించడం కోసం, వైద్యంలో ఉపయోగించే అలోవీరా జ్యూస్ కోసం రైతులు వాణిజ్యపరంగా సాగుచేస్తున్నారు. అలోవీరా ఉత్పత్తులను (అలోవీరా జ్యూస్, జెల్ సబ్బులు, ఆయింట్మెంట్ మొదలగు) అనేక కంపెనీలు మార్కెటింగ్ చేస్తున్నాయి. ఈ మొక్క పత్రాలు, పత్రాల నుండి తీసిన గుజ్జును వైద్యపరంగా వుపయోగిస్తారు.
రసాయన పదార్థాలు :
ఈ మొక్క పత్రాలలో అలోవీరా, బార్బల్యిన్, అంత్రాక్వినోన్, ఇమాడిన్, జిబ్బరిలిన్స్ వంటి అనేక రసాయన పదార్థాలు ఉంటాయి.
వైద్యపరంగా ఉపయోగాలు:
ఈ మొక్క ఆకుల రసం శరీరానికి చలువ చేస్తుంది. అజీర్ణం, కడుపు నొప్పి, దగ్గు, రక్తశుద్ధికి, మూత్రాన్ని జారీ చేయడానికి, నేత్ర వ్యాధుల నివారణలో, స్త్రీల ఋతు సంబంధ వ్యాధులలో, కాలిన గాయాల నివారణ కొరకు, మూత్ర సంబంధ రోగాల నివారణలో ఉపయోగపడుతుంది. పత్రాల నుండి తీసిన గుజ్జును ఎండబెట్టగా వచ్చే పదార్థాన్ని ‘ముసాంబ్రము’ అంటారు. దీనిని ఆయుర్వేద మందులలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
వ్యవసాయంలో కలబంద ఉపయోగాలు:
అలోవీరా మొక్కలో ఉన్న రసాయనాలు కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా పని చేస్తాయని డా|| వర్మ (2013) పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
అలోవీరా కషాయానికి దోమల లార్వాలను నిరోధించే లక్షణం ఉందని డా|| అర్జునన్ (2011) పరిశోధనలు సూచిస్తున్నాయి.
అలోవీరా మొక్కలో ఉన్న రసాయనాలకు శిలీంద్రాలను అరికట్టే గుణం ఉందని, అందువలన ఈ మొక్కను సేంద్రియ శిలీంద్రనాశనిగా ఉపయోగించుకోవచ్చునని డా|| జస్సోడే (2005) మరియు ఇతర శాస్త్రజ్ఞుల పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
అలోవీరా పత్రాలను ఉపయోగించి ద్రావణాన్ని తయారు చేసి దానిని పంటలనాశించు ఆకుమచ్చల నివారణ లోను, త్రుప్పు తెగులు నివారణలోను ఎంతగానో వుపయోగించవచ్చు.
అలోవీరా ద్రావణం తయారు చేసే విధానం:
కావలసిన పదార్థాలు:
కలబంద (అలోవీరా) ఆకులు 1 కిలో
సీతాఫలం ఆకులు 1 కిలో
బొప్పాయి ఆకులు 1 కిలో
పసుపు పొడి 200 గ్రాములు
మట్టి కుండ పెద్దది (20 లీటర్లది)
తయారు చేసే పద్ధతి:
కలబంద, సీతాఫలం మరియు బొప్పాయి ఆకులను పై మోతాదులో తీసుకొని బాగా ముద్దగా నూరి 20 లీటర్లు నీరు పోసిన కుండలో వేసి కర్రతో కలియ బెట్టాలి.
పై ద్రావణానికి 200 గ్రాముల పసుపు పొడిని చేర్చి, పొయ్యిపై పెట్టి ద్రావణం, నాలుగు నుండి ఐదు పొంగులు వచ్చే వరకు బాగా ఉడకబెట్టండి. ద్రావణాన్ని మధ్య మధ్యలో కర్రతో కలుపుతూ ఉండాలి. ద్రావణం ఉడకడానికి సుమారు అరగంట సమయం పడుతుంది.
ఉడికిన ద్రావణాన్ని చల్లారనివ్వాలి.
ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వేరొక కుండలో గానీ, ప్లాస్టిక్ డ్రమ్ములోగానీ వడపోయాలి. ఈ ద్రావణం సుమారు 10 లీటర్ల వరకు వస్తుంది.
ఈ ద్రావణానికి 100 లీటర్ల నీరు కలిపి ఒక ఎకరం పంటపై సాయంత్రం వేళ పిచికారీ చేయండి.
తెగులు తీవ్రత ఎక్కువగా వుంటే 10 రోజులకు ఒకసారి మరలా ద్రావణాన్ని పంటపై పిచికారీ చేసి మంచి ఫలితాలు పొందవచ్చు.
అలోవీరా ద్రావణాన్ని ఉపయోగించి ఇండ్లలో పెంచే కూరగాయ మొక్కలకు ఆశించే ఆకుమచ్చ తెగుళ్ళను (టమాట, బీర, మిరప, వంగ, దోస మొదలైన) సమర్థవంతంగా నివారించడం ఈ రచయిత గమనించారు.
అలోవీరా మొక్కలను ఇండ్లలోనూ, పొలాలలోనూ పెంచుకుంటూ, సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యంగా తెగుళ్ళ నివారణ కొరకు రైతులు ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాం.
Tag:కలబంద