అటుక మామిడి
అటుక మామిడి
అటుక మామిడి సుమారు 3-4 మీటర్ల వరకు పెరిగే, నేలబారున వ్యాప్తి చెందే బహువార్షిక మొక్క. ఈ మొక్క ఎక్కువగా వర్షాకాలంలో కలుపు మొక్కగా పొలాల గట్ల పైన, తేలిక పాటి నేలలైన ఎరుపు, ఇసుక నేలలలో బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఖరీఫ్ పంట కాలంలో ఈ మొక్క బాగా విస్తరిస్తుంది. ఈ మొక్కకు సన్నని దుంప వంటి తల్లి వేరు ఉంటుంది. శాఖలు ఎర్రగా ఉంటాయి. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు కొద్దిపాటి నొక్కులతో గుండ్రంగా ఉంటాయి. పత్రాలపై భాగం ఆకుపచ్చగానూ, క్రింది భాగం తెలుపుగానూ ఉంటుంది. పుష్పాలు చిన్నవిగా ఎరుపురంగులో ఉంటాయి. ఫలాలు కోలగా ఉంటాయి. ఫలాలపై జిగురువంటి పదార్థం గల గ్రంధులు ఉంటాయి. వాసన కలిగి ఉంటాయి. ఫలాలు దాదాపు సంవత్సరం పొడవునా ఏర్పడతాయి. ఈ మొక్కను వైద్య పరంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కను నొప్పుల నివారణ లోను, కామెర్లు, మధుమేహం నివారణలోను, ఎలుక కాటుకు విరుగుడుగాను, మూత్ర పిండాలు సక్రమంగా పని చేయడానికి ఉపయోగిస్తారు.
ఈ మొక్కలో పునర్నివిన్, బీటా- సైటోస్టిరాల్, మిరిస్టిక్ ఆమ్లం, ఆగ్జాలిక్ ఆమ్లం, పునర్నవోసైడ్ వంటి అనేక రసాయన పదార్థాలుంటాయి.
అటుక మామిడి మొక్కలో ఉన్న రసాయనాలు చాలా శక్తివంతమైనవి. ముఖ్యంగా ”పునర్నవోసైడ్” పురుగులపై అభివృద్ధి నిరోధకంగానూ, భక్షక నిరోధకం (రిపలెంట్)గానూ, వాంతులనూ కలిగించుటలోను ముఖ్యపాత్ర వహిస్తుంది.
ఈ మొక్క కషాయంను కంది పంటను ఆశించే పచ్చ పురుగుపై వుపయోగించినపుడు మంచి ఫలితాలు వచ్చినట్లు రచయిత గమనించారు.
అటుక మామిడి ఆకుల కషాయానికి బీర, సొర వంటి తీగజాతి కూరగాయ పంటలలో వచ్చే మొజాయిక్ తెగులు (వైరస్ వలన వ్యాపిస్తుంది)ను నియంత్రించే లక్షణాలు వున్నాయని డా|| అవాస్తే, డా|| కుమార్ (2003) పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
మలేరియా వ్యాధిని కలిగించే దోమల లార్వాలను అదుపు చేసే గుణం ఈ మొక్క కషాయానికి వుందని డా|| దేశముఖ్ (1982) పరిశోధనలు తెలుపుతున్నాయి.
అటుక మామిడి కషాయానికి పంటలలో వచ్చే ‘వైరస్ తెగుళ్ళను’ అదుపు చేసే అంశంపైన శాస్త్రజ్ఞుల పరిశోధనలు సేంద్రియ వ్యవసాయానికి ఎంతగానో వుపయోగపడతాయి.
Tag:అటుక మామిడి